కలర్‌ఫుల్ ఆరంభం
అడిలైడ్: భారీ షాట్లతో విరుచుకుపడే వన్డేలు, ధనాధన్ టి20లతో పోల్చితే టెస్టు మ్యాచ్‌లు బోర్.. ఇదీ ఇప్పటిదాకా సగటు అభిమాని ఆలోచన. అయితే ఈ ఫార్మాట్‌కు కూడా ఆదరణ పెంచే ఉద్దేశంతో తొలిసారిగా టెస్టు మ్యాచ్ కూడా ‘కలర్‌ఫుల్’గా ఆరంభమైంది. ఎరుపు బంతి స్థానంలో గులాబీ బంతి వాడగా సంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం ఆరంభమై రాత్రి కూడా కొనసాగిన డే అండ్ నైట్ మ్యాచ్‌ను వీక్షించిన ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. 138 ఏళ్ల టెస్టు చరిత్రలో మొదటి సారిగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో తొలి రోజు ఆటను 47,441 మంది ప్రత్యక్షంగా వీక్షించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడే ఓ అభిప్రాయానికి రావడం తొందరపాటే అయినా ఈ ప్రయోగానికి అభిమానుల నుంచి ఆశించిన మద్దతు లభించిందనే చెప్పవచ్చు.
బౌలర్ల హవా
గులాబీ బంతితో బౌలర్లు పండుగ చేసుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు తొలి రోజే 12 వికెట్లు నేలకూలాయి. ముందుగా ఆసీస్ పేసర్లు మిషెల్ స్టార్క్ (3/24), హాజెల్‌వుడ్ (3/66), సిడిల్ (2/54)తో పాటు స్పిన్నర్ లియోన్ (2/42) కూడా ప్రభావం చూపడంతో కివీస్ 65.2 ఓవర్లలో 202 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటయింది. ఓపెనర్ లాథమ్ (103 బంతుల్లో 50; 7 ఫోర్లు) ఒక్కడే రాణించగలిగాడు. నాలుగో ఓవర్‌లోనే వికెట్ తీసిన హాజెల్‌వుడ్ పింక్ బంతితో తొలిసారిగా ఈ ఫీట్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో రెండు వికెట్లకు 54 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (48 బంతుల్లో 24 బ్యాటింగ్; 3 ఫోర్లు), వోజెస్ (9 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు.