వికెట్లు... టపటపా
డేనైట్ టెస్టులో రెండో రోజు 13 వికెట్లు
ఓవరాల్‌గా 94 పరుగుల ఆధిక్యంలో కివీస్
అడిలైడ్: తొలిసారి ప్రయోగాత్మకంగా ఆడుతున్న డేనైట్ టెస్టులో పింక్ బంతితో బౌలర్లు పండగ చేసుకుంటున్నారు. తొలిరోజు 12 వికెట్లు పడితే... రెండో రోజు శనివారం ఏకంగా 13 వికెట్లు నేలకూలాయి. తొలిరోజు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ కాగా... రెండో రోజు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (53), నెవిల్ (66) అర్ధ సెంచరీలు చేయగా... మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. అయితే చివరి ఇద్దరు ఆటగాళ్లు లియోన్ (34), స్టార్క్ (24 నాటౌట్) రాణించడంతో ఆసీస్‌కు కీలకమైన 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్ మూడు, బౌల్ట్, క్రెయిగ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో ఐదు వికెట్లకు 116 పరుగులు చేసింది. రాస్ టేలర్ (32) రాణించాడు. శాంట్నర్ (13), వాట్లింగ్ (7) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ మూడు, మిషెల్ మార్ష్ రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లోటును మినహాయిస్తే ప్రస్తుతం న్యూజిలాండ్ 94 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఈ మ్యాచ్ మూడోరోజు ఆదివారం ముగిసే అవకాశం ఉంది.
అదే ఉత్సాహం
ఇక ప్రేక్షకులు ఈ మ్యాచ్‌కు రెండో రోజు కూడా భారీగా వచ్చారు. 42,372 మంది అభిమానులు లైట్ల వెలుతురులో పింక్ బంతితో టెస్టు క్రికెట్ అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందారు.