
న్యూఢిల్లీ: దేశానికి ఆడేటప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదని మహిళల జట్టు టెస్టు, వన్డే సారథి మిథాలీ రాజ్ పేర్కొంది. చాన్నాళ్ల తర్వాత మహిళల జట్టు పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళుతోంది. వచ్చేనెల 16 నుంచి బ్రిస్టల్‌లో ఏకైక టెస్టు జరుగుతుంది. ఈ నేపథ్యం లో మిథాలీ మాట్లాడుతూ... ‘కోచ్ రమేశ్ పొవార్‌తో వివాదం గతంతో సమానం. నేను ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా. ఇక్కడ వ్యక్తిగతం పనికి రాదు. సమష్టితత్వమే కావాలి. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో నేనెప్పుడూ వ్యక్తిగత ఇష్టాలకు విలువ ఇవ్వలేదు. జట్టు కోసమే ఆడాను. ఇకమీదట కూడా అంతే’ అని పేర్కొంది.
‘నా కెరీర్‌లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. చేదు అనుభవాలూ ఉన్నాయి. కానీ అవన్నీ వెంట మోసుకెళ్లలేదు. వర్తమానమే జట్టుకు అవసరం. ఇప్పుడు కోచ్‌తో జట్టు ప్రయోజనాలపైనే చర్చించుకుంటాం. మిగతావి అప్రస్తుతం. ఇక్కడ మా ఇద్దరి లక్ష్యం జట్టును ముందుకు తీసుకెళ్లడమే. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడాక... ఆస్ట్రేలియాతో మరో టెస్టు ఆడనున్నాం. తొలిసారి డే–నైట్ టెస్టు ఆడనున్నాం. కెరీర్ ముగిసేలోపు డే–నైట్ టెస్టు ఆడతానని ఊహించలేదు. నా కల నిజమవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని మిథాలీ తెలిపింది.
(చదవండి: ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ సారధి)
Comments
Please login to add a commentAdd a comment