Day Night Test
-
Ind Vs Sl Test Series: లంకపై విజయఢంకా
11–0 ఇదీ రోహిత్ లెక్క! ఈ ‘హిట్‌మ్యాన్’ పూర్తిస్థాయి జట్టు పగ్గాలు చేపట్టాక... స్వదేశంలో ఇద్దరు ప్రత్యర్థులతో ఆడిన మూడు ఫార్మాట్లలోనూ భారత్ వైట్‌వాష్ చేసింది. వెస్టిండీస్‌తో మూడేసి చొప్పున టి20, వన్డేలు... తర్వాత శ్రీలంకతో మూడు టి20 పోటీలు, ఇప్పుడు రెండు సంప్రదాయ టెస్టులు అన్నింటా భారత్‌దే జయం. పాపం కరీబియన్, లంక జట్లు కనీస విజయం లేక ‘జీరో’లతో ఇంటిబాట పట్టాయి. రెండో రోజే టెస్టులో విజయానికి బాటలు వేసుకున్న భారత్ సోమవారం రెండో సెషన్లోనే లంక ఆటను ముగించడంలో సఫలమైంది. కెప్టెన్ కరుణరత్నే శతకం మినహా లంక ఈ పర్యటనలో చెప్పుకునేందుకు ఏమీ లేక వెనుదిరిగింది. బెంగళూరు: టీమిండియా బౌలింగ్ ఉచ్చులో చిక్కుకున్న శ్రీలంక మూడో రోజు రెండు సెషన్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. డేనైట్ టెస్టులో భారత్ 238 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత బ్యాటర్లలాగే బౌలర్లూ శ్రీలంక భరతం పట్టారు. 3 వికెట్లు తీసిన స్టార్ సీమర్ బుమ్రా ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లను పడేశాడు. స్పిన్నర్లు అశ్విన్ (4/55), అక్షర్ పటేల్ (2/37) లంక బ్యాటర్స్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా తిప్పేశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో వంద పైచిలుకు పరుగులకే ఆపసోపాలు పడిన లంక... కెప్టెన్ దిముత్ కరుణరత్నే (174 బంతుల్లో 107; 15 ఫోర్లు) వీరోచిత సెంచరీ పుణ్యమాని రెండో ఇన్నింగ్స్‌లో 200 పైచిలుకు పరుగులు చేయడమే ఆ జట్టుకు ఊరట. శ్రేయస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా... 120.12 స్ట్రైక్‌రేట్‌తో సిరీస్‌లో 185 పరుగులు చేసిన రిషభ్ పంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ మూడోరోజు 447 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు 28/1 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 59.3 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెప్టెన్ కరుణరత్నే... ఇతనితో పాటు ఓవర్‌నైట్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (60 బంతుల్లో 54; 8 ఫోర్లు) ఆడినంత వరకే ఆట కనిపించింది. వీళ్లిద్దరి బౌండరీలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెండిస్ వన్డేలాగే ధాటైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ కంటే ముందుగా 57 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ ఉన్నంతసేపు 12 ఓవర్ల పాటు బౌండరీలు, పరుగులతో స్కోరుబోర్డు కదిలింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 97 పరుగులు జతచేసింది. ఎప్పుడైతే జట్టు స్కోరు 97 వద్ద మెండిస్‌ను అశ్విన్ స్టంపౌట్ చేశాడో 9 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు పడ్డాయి. మాథ్యూస్ (1)ను జడేజా బౌల్డ్ చేయగా, ధనంజయ డిసిల్వా (4)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. డిక్వెలా (12) విఫలమయ్యాడు. మరో వైపు కరుణరత్నే 92 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తయింది మరో వికెట్ పడకుండా తొలిసెషన్ 151/4 స్కోరు వద్ద ముగిసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే డిక్వెలా, అనంతరం అసలంక(5) అక్షర్ పటేల్ ఉచ్చులో పడ్డారు. 166 బంతుల్లో సెంచరీ (14 ఫోర్లు) పూర్తి చేసుకున్న కరుణరత్నే అవుటయ్యాక 4 పరుగుల వ్యవధిలోనే లంక ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్ 252; శ్రీలంక తొలిఇన్నింగ్స్ 109; భారత్ రెండో ఇన్నింగ్స్: 303/9 డిక్లేర్డ్; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తిరిమన్నె (ఎల్బీ) (బి) బుమ్రా 0; కరుణరత్నే (బి) బుమ్రా 107; మెండిస్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 54; మాథ్యూస్ (బి) జడేజా 1; ధనంజయ (సి) విహారి (బి) అశ్విన్ 4; డిక్వెలా (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 12; అసలంక (సి) రోహిత్ (బి) అక్షర్ 5; ఎంబుల్డెనియా (ఎల్బీ) (బి) అశ్విన్ 2; లక్మల్ (బి) బుమ్రా 1; ఫెర్నాండో (సి) షమీ (బి) అశ్విన్ 2; జయవిక్రమ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (59.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–0, 2–97, 3–98, 4–105, 5–160, 6–180, 7–204, 8–206, 9–208, 10–208. బౌలింగ్: బుమ్రా 9–4–23–3, షమీ 6–0–26–0, అశ్విన్ 19.3–3–55–4, జడేజా 14–2–48–1, అక్షర్ పటేల్ 11–1–37–2. 442: టెస్టుల్లో అశ్విన్ వికెట్ల సంఖ్య. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అతను...దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ (439)ను అధిగమించి ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. -
Ind Vs Sl 2nd Test: విహారికి ఛాన్స్.. మరి సిరాజ్?
India Vs Sri Lanka 2nd Test- బెంగళూరు: మూడు రోజుల్లోపే తొలి టెస్టులో శ్రీలంక ఆట ముగించిన భారత్ ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తాజా ఫామ్, బలాబలాల దృష్ట్యా ప్రత్యర్థికంటే ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు ఇక్కడా అడ్డు ఉండకపోవచ్చు. తొలి పోరులో ఘోర వైఫల్యం తర్వాత రెండో టెస్టులో లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఫ్లడ్ లైట్ల వెలుగులో ‘డే అండ్ నైట్’గా గులాబీ బంతితో జరగనున్న ఈ మ్యాచ్‌కు మైదానంలో ప్రేక్షకులను 100 శాతం అనుమతిస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం. సిరాజ్‌కు అవకాశం ఇస్తారా! మొహాలీలో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత సహజంగానే తుది జట్టులో మార్పులకు అవకాశం కనిపించదు. రోహిత్‌తో పాటు సొంతగడ్డపై మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. మూడో స్థానంలో హనుమ విహారికి మళ్లీ అవకాశం ఖాయం కాగా... కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా సెంచరీ సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతాడా చూడాలి. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా ఆ తర్వాత అశ్విన్ కూడా సత్తా చాటగలడు. బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడంపై టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. అయితే ‘పింక్ బంతి’ బాగా స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో దాదాపు సొంత మైదానంలాంటి చిన్నస్వామిలో మూడో పేసర్‌గా హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు చాన్స్ లభిస్తుందేమో చూడాలి. తుది జట్టులో ఎవరు? మొదట టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయి తొలి టెస్టులోనూ ఓడిన శ్రీలంక ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం తుది జట్టును సిద్ధం చేసుకోవడమే కష్టంగా మారింది. గత మ్యాచ్‌లో ఆడిన కుమార, నిసాంకా గాయాలతో దూరం కాగా, ఆడే అవకాశం ఉన్న చమీరా కూడా గాయపడ్డాడు. కుశాల్ మెండిస్ కోలుకోవడం ఆ జట్టుకు ఊరట. అసలంక స్థానంలో చండిమాల్‌కు అవకాశం దక్కవచ్చు. మరోసారి టీమ్ బ్యాటింగ్ సీనియర్లు కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్లపైనే ఆధారపడి ఉంది. ఎంబుల్డెనియాతో పాటు కొత్తగా వస్తున్న చమిక కరుణరత్నే భారత్‌ను ఏమాత్రం కట్టడి చేయగలరో చూడాలి. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న సురంగ లక్మల్ ఆటపై అందరి దృష్టీ ఉంది. 4:భారత్‌కు ఇది నాలుగో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్... స్వదేశంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లపై గెలిచిన భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఓడింది. 400: మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్‌కిది 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. #TeamIndia vice-captain @Jaspritbumrah93 on the mental changes that need to be made for a Pink Ball Test.@Paytm #INDvSL pic.twitter.com/PCfrY6sJe7 — BCCI (@BCCI) March 11, 2022 -
డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ.. స్మృతి మంధాన సరి కొత్త చరిత్ర
Smriti Mandhana Maiden Century: భారత ఓపెనర్ స్మృతి మంధాన (216 బంతుల్లో 127; 22 ఫోర్లు, 1 సిక్స్) ‘పింక్ బాల్’ టెస్టులో చరిత్రకెక్కింది. భారత్ ఆడుతున్న తొలి డే నైట్ టెస్టులో ఆమె శతకం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన రెండో రోజు ఆటలో ఆమె సెంచరీ హైలైట్‌గా నిలిచింది. వర్షంతో ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. రెండో రోజు వర్షం, ప్రతికూల వాతా వరణంతో 57.4 ఓవర్ల ఆటే సా«ధ్యమైంది. డిన్నర్ బ్రేక్ తర్వాత ఆట కాసేపే (17 ఓవర్లు) జరిగింది. పటిష్టస్థితిలో భారత్ ఓవర్‌నైట్ స్కోరు 132/1తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్‌ను స్మృతి పటిష్ట స్థితిలో నిలిపింది. ఆట మొదలైన రెండో ఓవర్లోనే పెర్రీ క్యాచ్ జారవిడువడటంతో బతికిపోయిన స్మృతి తర్వాత ఎలాంటి పొరపాటుకు తావివ్వలేదు. స్ట్రయిట్ డ్రైవ్‌లతో బౌలర్లను ఓ ఆటాడుకుంది. ఆఫ్‌సైడ్‌లో ఫీల్డర్లను పదేపదే పరిగెత్తించింది. ఆమె చేసిన 127 పరుగుల్లో 94 (22 ఫోర్లు, సిక్స్) పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం. 170 బంతుల్లో కెరీర్లో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేసిన ఆమె రెండో వికెట్‌కు పూనమ్ రౌత్‌తో కలిసి 102 పరుగులు జతచేసింది. స్వల్ప వ్యవధిలో స్మృతితో పాటు రౌత్ (36; 2 ఫోర్లు) నిష్క్రమించాక 231/3 స్కోరు వద్ద భారత్ భోజన విరామానికెళ్లింది. తర్వాత కెపె్టన్ మిథాలీ రాజ్ (30; 5 ఫోర్లు), యస్తిక భాటియా (19) కాసేపు ఆడారు. ఆట నిలిచే సమయానికి దీప్తి శర్మ (12 బ్యాటింగ్), తానియా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సోఫీ మోలినెక్స్కు 2 వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన విదేశీ మహిళా క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు మోలీ హైడ్ (124 నాటౌట్–ఇంగ్లండ్; 1949లో) పేరిట ఉండేది. ఆ్రస్టేలియా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ స్మృతి. సంధ్యా అగర్వాల్ (134; 1984లో) తర్వాత ఆ్రస్టేలియా జట్టుపై టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్ స్మృతి. ఆ్రస్టేలియా జట్టుపై వన్డేల్లో, టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్ స్మృతి. గతంలో ఎనిడ్ బేక్వెల్ (ఇంగ్లండ్), దెబోరా హాక్లీ (న్యూజిలాండ్), క్లెయిర్ టేలర్ (ఇంగ్లండ్) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
Mithali Raj: వ్యక్తిగతం కాదు... సమష్టితత్వం ముఖ్యం
న్యూఢిల్లీ: దేశానికి ఆడేటప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదని మహిళల జట్టు టెస్టు, వన్డే సారథి మిథాలీ రాజ్ పేర్కొంది. చాన్నాళ్ల తర్వాత మహిళల జట్టు పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళుతోంది. వచ్చేనెల 16 నుంచి బ్రిస్టల్‌లో ఏకైక టెస్టు జరుగుతుంది. ఈ నేపథ్యం లో మిథాలీ మాట్లాడుతూ... ‘కోచ్ రమేశ్ పొవార్‌తో వివాదం గతంతో సమానం. నేను ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా. ఇక్కడ వ్యక్తిగతం పనికి రాదు. సమష్టితత్వమే కావాలి. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో నేనెప్పుడూ వ్యక్తిగత ఇష్టాలకు విలువ ఇవ్వలేదు. జట్టు కోసమే ఆడాను. ఇకమీదట కూడా అంతే’ అని పేర్కొంది. ‘నా కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. చేదు అనుభవాలూ ఉన్నాయి. కానీ అవన్నీ వెంట మోసుకెళ్లలేదు. వర్తమానమే జట్టుకు అవసరం. ఇప్పుడు కోచ్‌తో జట్టు ప్రయోజనాలపైనే చర్చించుకుంటాం. మిగతావి అప్రస్తుతం. ఇక్కడ మా ఇద్దరి లక్ష్యం జట్టును ముందుకు తీసుకెళ్లడమే. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడాక... ఆస్ట్రేలియాతో మరో టెస్టు ఆడనున్నాం. తొలిసారి డే–నైట్ టెస్టు ఆడనున్నాం. కెరీర్ ముగిసేలోపు డే–నైట్ టెస్టు ఆడతానని ఊహించలేదు. నా కల నిజమవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని మిథాలీ తెలిపింది. (చదవండి: ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ సారధి) -
రెడ్–పింక్ బాల్స్ మధ్య తేడా ఏమిటి!?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య మొట్టమొదటి సారిగా డే–నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందనే విషయం తెల్సిందే. ఈ కారణంగానే కాకుండా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ గ్రౌండ్లో ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఉంది. భారత్ పింక్ (గులాబీ రంగు) బాల్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడడం కూడా ఇదే మొదటిసారి. సాధారణంగా అన్ని దేశాలు మొదటి నుంచి రెడ్ బాల్స్‌తోనే టెస్ట్‌మ్యాచ్‌లు ఆడుతూ వచ్చాయి. ఒన్డేలు, ఐపీఎల్ లాంటి పరిమిత ఒవర్ల మ్యాచ్‌లను వైట్ బాల్స్‌తో ఆడుతున్నాయి. వైట్ బాల్స్‌కు బౌన్స్ రేటు ఎక్కువగా ఉంటుంది. దానితోని ఫోర్లు, సిక్స్‌లు ఎక్కువగా కొట్టే అవకాశం ఉంటుంది. అందుకని ప్రేక్షకులను ఎక్కువగా అలరించడం కోసం వన్డే, ఐపీఎల్ లాంటి మ్యాచ్‌ల్లో వైట్ బాల్స్‌ను వాడుతున్నారు. భారత్ మినహా కొన్ని దేశాలు పింక్ బాల్స్తోని కూడా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాయి. ఆడుతున్నాయి. భారత్‌కే బంగ్లాదేశ్‌తో అరంగేట్రం. అసలు రెడ్ బాల్స్‌కు, పింక్ బాల్స్‌కు తేడా ఏమిటీ? ఇందులో ఏ బాల్స్ ఎక్కువ ఒవర్ల వరకు దెబ్బతినదు? ఏది ఎక్కువగా బరువు ఉంటుంది? పింక్ బాల్స్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయా? బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయా? ఫాస్ట్ బౌలర్లకు మేలు చేస్తుందా? స్పిన్నర్లకు మేలు చేస్తుందా? అన్న సందేహాలు క్రికెట్ అభిమానుల్లో సుడులు తిరుగుతూనే ఉండవచ్చు. రెడ్ బాల్స్, పింక్ బాల్స్, వైట్ బాల్స్ ఏవైనా ఒకే స్థాయి బరువు కలిగి ఉంటాయి. లండన్‌లోని మార్లిబోన్ క్రికెట్ క్లబ్ సూచించిన ప్రమాణాల వరకు ఈ మూడు రంగుల క్రికెట్ బంతులు 156 గ్రాముల నుంచి 162 గ్రాముల బరువు మధ్యనే ఉండాలి. దీనికన్నా ఎక్కువున్నా, తక్కువ బరువున్న తిరస్కరిస్తారు. అన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో దీన్నే ప్రమాణంగా పాటిస్తున్నారు. కొందరు రెడ్ బాల్స్ బరువుంటాయని, వైట్ బాల్స్ తేలిగ్గా ఉంటాయంటారు. అది పూర్తిగా అబద్ధం. వైట్ బాల్స్‌కు స్వింగ్ ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటి భావన కలుగుతుంది. స్వింగ్ రావడం కోసం బంతి మధ్యలో మెత్తటి పదార్థాన్ని ఉపయోగిస్తారు. అసలు రెండింటి మధ్య తేడా ఏమిటి? భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌ల కోసం రెడ్ బాల్స్‌ను తయారుచేసి అందిస్తున్న మీరట్‌లోని ‘సాన్స్పరేల్స్ గ్రీన్లాండ్స్ (ఎస్జీ)’ కంపెనీలో గత 45 ఏళ్లుగా చీఫ్ బాల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వసీవుల్లా ఖాన్ (73) కథనం ప్రకారం అన్ని రంగుల క్రికెట్ బాల్స్‌కు పైనా కవచంలా లెదర్నే ఉపయోగిస్తారు. ఎరుపు, పింక్ బాల్స్లోపల కాట్స్వూల్, కార్క్లనే కూరుతారు. బంతులను కుట్టడంలో కూడా తేడా ఉండదు. రెడ్ బాల్స్‌ను తెల్లదారంతో కుడితే, పింక్ బాల్స్‌ను నల్లదారంతో కుడతారు. రెడ్ బాల్స్‌కు పైన మైనం కోటింగ్ ఉంటుంది. అందువల్ల రెడ్ బాల్స్ మిల మిలా మెరుస్తూ చెర్రీ పండ్ల రంగులో కనిపిస్తాయి. కొన్ని ఓవర్ల తర్వాత మైనాన్ని బంతి లోపలికి లాగేసుకోవడం వల్ల స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా బంతి మారుతుంది. మైనం ప్రభావాన్ని త్వరగా పోగొట్టడానికే బౌలర్లు ఒకవైపున వాటిని బాగా రాపిడి పెడతారు. పింక్ బాల్స్‌కు మైనాన్ని ఉపయోగించరు! మైనం వాడితే పింక్ రంగు నలుపు రంగులోకి మారుతుంది. అందుకని మైనాన్ని వాడరు. పాలిష్ వాడుతారు. ఎర్రరంగు త్వరగా పోకుండా రెడ్ బాల్స్‌పై మైనం పూత ఎలా రక్షిస్తుందో ఈ పాలిష్ 40 ఓవర్ల వరకు పింక్ రంగు పోకుండా రక్షిస్తుంది. టెస్ట్ మ్యాచ్‌లకు ఉపయోగించే బంతుల్లో నాణ్యమైన పదార్థాన్ని కూరడంతో పాటు బలమైన దారాన్ని ఉపయోగిస్తారు. ఈ రెండింట్ని కూడా భారత్ కంపెనీలు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. బంతిని కుట్టే రెండు (కప్పులు) అంచుల మధ్య భాగాన్ని ‘సీమ్’ అని పిలుస్తారు. రెడ్ బాల్స్‌లో బంతి కప్పు అంచులకు సింథటిక్‌ను మాత్రమే వాడతారు. పింక్ బాల్స్‌లో సింథటిక్‌ను, లైనెన్‌ను సమపాళ్లలో వినియోగిస్తారు. డే టెస్ట్ మ్యాచ్‌లకే రెడ్ బాల్స్‌ను ఉపయోగిస్తారు. డే–నైట్ టెస్ట్ మ్యాచ్‌లకు పింక్ బాల్స్ వాడుతారు. లైనెన్తో గ్రిప్ పెరుగుతుంది పింక్ బాల్స్ సీమ్‌లో లైనెన్‌ను ఉపయోగించడం వల్ల బౌలర్లకు గ్రిప్పు పెరుగుతుంది. ముఖ్యంగా సీమ్ బౌలర్లకు అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మొదటి పది–పదిహేను ఓవర్ల వరకు పింక్ బాల్స్ ఎక్కువగా స్వింగ్ అవుతాయి. 40–45 ఓవర్ల తర్వాత కూడా స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువగా ఉపయోగపడతాయి. మొత్తంగా రెడ్ బాల్స్‌తో పోలిస్తే రంగు త్వరగా పోదు. పటిష్టత ఎక్కువగా ఉంటుంది. అంటే బాల్ త్వరగా షేపవుట్ కాదు. ‘గోగేజ్–నోగేజ్’ పేరిట బాల్ షేపవుట్ అయిందా, లేదా? అన్న అంశాన్ని ఎంపైర్లు నిర్ధారిస్తారు. గోగేజ్ అంటే బంతి చుట్టూ కొలత 71 మిల్లీ మీటర్ల ఉండాలి. నోగేజ్ అంటే 73 మిల్లీ మీటర్లకు మించి ఉండరాదు. అంటే, బంతి మధ్య కేంద్ర బిందువు నుంచి బంతి చుట్టూ కొలత కొలచినప్పుడు బంతి వృత్తం 71–73 మిల్లీ మీటర్ల మధ్యనే ఉండాలి. ఎక్కడ బంతి ఉపరితల వృత్తం 71 మిల్లీ మీటర్లకన్నా తగ్గినా, 73 మిల్లీ మీటర్లకన్నా పెరిగినా అది షేపవుట్ అయినట్లు. అన్ని విధాల పింక్ బాల్స్ బాట్స్మెన్కన్నా బౌలర్లకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. (చదవండి: రహానే కళ్లలో గులాబీ కలలే.. ) -
కోహ్లికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన దాదా
ముంబై : డే-నైట్ టెస్టు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. టెస్టుల్లో నంబర్ వన్ జట్టైన టీమిండియా ఇప్పటివరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐదు రోజుల క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. భారత్-బంగ్లాదేశ్ మినహా అన్ని టెస్టు జట్లు డే నైట్ టెస్టులు ఆడాయి. పలు కారణాలు చూపుతూ డేనైట్ టెస్టులు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. అయితే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. డే నైట్ టెస్టులు ఆడాల్సిందేనని పట్టుపట్టాడు. అంతేకాకుండా తన ఆలోచనలు కార్యరూపం దాల్చేలా వడివడిగా అడుగులు వేశాడు. మొదట కోహ్లిని ఒప్పించిన దాదా అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కూడా అంగీకరించేలా చేశాడు. తాజాగా డేనైట్ టెస్టు కోసం గంగూలీ పంపిన ప్రతిపాదనలకు బీసీబీ అంగీకారం తెలపడంతో టీమిండియా తొలి డే-నైట్ టెస్టుకు మార్గం సుగుమమైంది. దీంతో కోలకతా వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి డే-నైట్ టెస్టుకు అంకురార్పణ జరగనుంది. టీమిండియా తొలి డే నైట్ టెస్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. ‘బీసీబీ పింక్‌బాల్ టెస్టుకు అంగీకరించింది. ఇది సానుకూల పరిణామం. టెస్టు క్రికెట్‌కు అవసరమైన మార్పు ఇది. నేను, నా బృందం ఇలాంటి ఆట కోసం పరితపించాం. కొత్త తరహా టెస్టుకు అంగీకారం తెలిపిన కెప్టెన్ కోహ్లికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని గంగూలీ అన్నాడు. అయితే సంప్రదాయక టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావాల్సిందేనని దాదా పేర్కొన్నాడు. నిజానికి చాన్నాళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్లో పింక్‌బాల్ క్రికెట్ ఆడించాలని అప్పటి క్రికెట్ కమిటీ చైర్మన్ అయిన గంగూలీ సిఫార్సు చేశాడు. ఇక అధ్యక్షుడిగా కేవలం 9 నెలలు మాత్రమే ఉండే అవకాశం ఉండటంతో భారత క్రికెట్ అభివృద్ధికి దాదా మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘అప్పటి వరకు డే/నైట్ టెస్ట్ ఆడేదిలేదు’
ముంబై : ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు ప్రతిపాదనను నిరాకరించిన బీసీసీఐ నిర్ణయాన్ని బోర్డు పాలకుల కమిటీ (సీఓఏ) అధ్యక్షుడు వినోద్ రాయ్ వెనకేసుకొచ్చాడు. డే/నైట్ టెస్టు ఆడితే ఓడిపోతామన్న భయంతోనే బీసీసీఐ స్వార్థంగా ఈ మ్యాచ్‌కు అంగీకరించట్లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయ్ మాట్లాడుతూ.. ‘‘అన్ని మ్యాచ్‌లూ గెలవాలనుకోవడంలో తప్పేం ఉంది? 30 ఏళ్ల క్రితం డ్రా చేసుకునేందుకు భారత్ మ్యాచ్‌లాడుతోంది అనేవారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. టీమిండియా ఆటగాళ్లు ఎప్పుడైతే డే/నైట్ టెస్టు ఆడడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతారో అప్పుడే దానికి అంగీకరిస్తాం’’ అని స్పష్టం చేశాడు. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి సైతం బోర్డు నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చాడు. ఎవరితో ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఆడాలనేది తమ వ్యవహారమని, తాము భారత్ విజయాల కోసం కృషి చేస్తామని రాహుల్ జోహ్రి తెలిపాడు. డే/నైట్ టెస్టు ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించాడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా తప్పుబట్టాడు. టెస్ట్ క్రికెట్‌కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డాడు. ఇక డే/నైట్ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియా డే/నైట్ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ డే/నైట్ టెస్టు ఆడాలని హర్భజన్ సూచించాడు. ‘డేనైట్ టెస్టుల్ని భారత్ ఎందుకు ఆడనంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఆసక్తికరంగా ఉంటుంది. ఓసారి ఆడిచూస్తే బాగుంటుంది. పింక్ బాల్ ఐతే ఏంటి. ఆడితే తప్పకుండా అలవాటు అవుతుంది. అదేమీ కష్టం కాదు... ఆడితే వచ్చే నష్టమూ లేదు’ అని అన్నాడు. -
బీసీసీఐ ఓ సెల్ఫీష్ : ఆసీస్ మాజీ క్రికెటర్
సిడ్నీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డే/నైట్ టెస్టు ప్రతిపాదనను తిరస్కరించాడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా తప్పుబట్టాడు. టెస్ట్ క్రికెట్‌కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరించందన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్‌లో టెస్టు క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని, ఈ దేశాలతో టెస్ట్ క్రికెట్‌కు పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్నామని వా ఓ రేడియో చానెల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భారత జట్టులో సమర్థవంతమైన బ్యాట్స్‌మెన్, స్పిన్నర్లు, పేసర్లతో పటిష్టంగా ఉండగా అసలు బీసీసీఐ డే/నైట్ టెస్టుకు ఎందుకు విముఖత వ్యక్తం చేసిందో అర్థం కావడలేదన్నాడు. టీమిండియాకు డే/నైట్ టెస్టులు సరిగా సరిపోతాయన్నాడు. డే/నైట్ టెస్టులు చూడటం తాను ఇష్టపడతానని తెలిపాడు. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ సైతం ఇదే విధంగా బీసీసీఐని తప్పుబట్టాడు. మరోవైపు మార్క్ వా వ్యాఖ్యాతగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్క్ పదవీ కాలం వచ్చే ఆగస్టు 31తో ముగియనుంది. ఇక భారత్ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల కోసం నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. డే/నైట్ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియా డే/నైట్ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. -
భారత్ ‘గులాబీ’ టెస్టూ గెలవగలదు: గంగూలీ
కోల్‌కతా: బలమైన జట్టున్న భారత్... గులాబీ బంతితో ఆడే డే నైట్ టెస్టునూ గెలవగలదని మాజీ సారథి సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘బంతి రంగులో మార్పు తప్ప ఇందులో తేడా ఏమీ లేదు. నాణ్యమైన ఆటగాళ్లున్న భారత్ గెలవగలదు’ అని గురువారం ఓ వాణిజ్య కార్యక్రమంలో గంగూలీ వ్యాఖ్యానించాడు. అఫ్గానిస్తాన్‌తో చరిత్రాత్మక టెస్టు ఆడకూడదని కెప్టెన్ కోహ్లి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘జట్టేదైనా దేశానికి ఆడటం ముఖ్యమని కోహ్లి భావి స్తాడు. అలాంటివాడు కౌంటీలను ఎంచుకోవడం ఇంగ్లండ్ పర్యటనకు అతడిస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది’ అని అన్నాడు. -
క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ షాక్!
ముంబై : భారత్‌తో డే–నైట్ టెస్టు ఆడించేందుకు శతవిధాలా ప్రయత్నించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. డే నైట్ టెస్ట్ ఆడేందుకు తాము సిద్దంగా లేమని తేల్చి చెప్పింది. ఫ్లడ్‌లైట్ల కింద ఆడాలంటే ఆటగాళ్లకు సుమారు 18 నెలల ప్రాక్టీస్ అవసరమని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి పాలకుల కమిటీ(సీఓఏ)కు సూచించాడు. దీంతో బీసీసీఐ తాత్కలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్కు డేనైట్ మ్యాచ్ ఆడలేమని ఈమెయిల్ ద్వారా సమాచారమిచ్చాడు. ‘‘పరిస్థితుల దృష్ట్యా మీ ప్రతిపాదన తీరస్కరిస్తున్నాము. మీతో డేనైట్ టెస్టులు ఆడలేము’’ అని సదర్లాండ్కు రాసిన మెయిల్లో చౌదరి పేర్కొన్నారు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరిగే తొలి టెస్టును పింక్ బంతితో డే–నైట్ ఆడించాలని సీఏ గంపెడు ఆశలు పెట్టుకుంది. గత మూడేళ్లుగా అడిలైడ్‌లో నాలుగు డే–నైట్ టెస్టులు జరిగాయి. కివీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్‌లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐదు రోజుల ఆట ఆడాయి. ఈ నాలుగు టెస్టుల్లో ఆసీసే గెలవడం గమనార్హం. అలాగే ఈసారి భారత్‌తో ఆడాలని సీఏ శతవిధాల ప్రయత్నించింది. భారత ఆటగాళ్లలో చతేశ్వర పుజారా, మురళి విజయ్‌లకు మాత్రమే డేనైట్ టెస్టు ఆడిన అనుభవం ఉంది. వీరు దులీప్ ట్రోఫీలో భాగంగా ఫ్లడ్లైట్స్ కింద పింక్ బంతితో ఆడారు. బీసీసీఐ తాజ నిర్ణయంతో సీఏ సందిగ్ధంలో పడింది. -
మన హైదరాబాద్‌లో భారత తొలి డే-నైట్ టెస్ట్?
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఇది కచ్చితంగా శుభవార్తే. నెలల వ్యవధిలోనే ఇక్కడ టెస్టు, వన్డే జరగనుంది. పైగా ఆ టెస్టును డేనైట్‌గా నిర్వహించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. హైదరాబాద్ లేదంటే రాజ్‌కోట్‌లో డేనైట్ మ్యాచ్ నిర్వహణకు బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) ఆమోదిస్తే భారత్‌లో తొలి డేనైట్ టెస్టుకు రంగం సిద్ధమవుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్వదేశంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లకు వేదికలు ఖరారు చేసింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో అక్టోబర్‌లో ఒక టెస్టు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ జరుగనుంది. టెస్టులతో పాటు కొన్ని మ్యాచ్‌లకు సంబంధించి తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. బీసీసీఐ ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది భారత్‌లో కేవలం మూడు టెస్టులే జరుగనున్నాయి. అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ జూన్‌లో జరుగుతుంది. అనంతరం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు హైదరాబాద్, రాజ్‌కోట్‌ల్లో జరుగుతాయి. తర్వాత నవంబర్‌లో ఐదు వన్డేల సిరీస్‌ను ముంబై, గువాహటి, కొచ్చి, ఇండోర్, పుణే వేదికల్లో నిర్వహిస్తారు. మూడు టి20లు కోల్‌కతా, చెన్నై, కాన్పూర్లలో జరుగుతాయి. కోల్‌కతా మ్యాచ్ నవంబర్ 4న జరుగుతుంది. శనివారం జరిగిన బీసీసీఐ పర్యటనల ఖరారు కమిటీ సమావేశానికి బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు గంగూలీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యాడు. దుబాయ్‌లో ఉన్న సీఈఓ రాహుల్ జోహ్రి, వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ఈ మీటింగ్‌కు గైర్హాజరయ్యారు. వచ్చే ఏడాది భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా ఇక్కడ ఐదు వన్డేలు, రెండు టి20లు ఆడుతుంది. మొహాలీ (ఫిబ్రవరి 24), హైదరాబాద్ (ఫిబ్రవరి 27), నాగ్‌పూర్ (మార్చి 2), ఢిల్లీ (మార్చి 5), రాంచీ (మార్చి 8)లో వన్డేలు, బెంగళూరు (మార్చి 10), విశాఖపట్నం (మార్చి 13) వేదికల్లో రెండు టి20లు జరుగుతాయి. -
వెస్టిండీస్‌పై పాక్ గెలుపు
దుబాయ్: పాకిస్తాన్ తమ 400వ టెస్టులో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. డే నైట్ తొలి టెస్టు లో 56 పరుగుల తేడాతో గెలి చింది. డారెన్ బ్రేవో (249 బం తుల్లో 116; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా... జట్టును గట్టెక్కించలేక పోయాడు. 346 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 95/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 109 ఓవర్లలో 289 పరుగుల వద్ద ఆలౌటైంది. రోస్టన్ చేజ్ (35)తో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించిన బ్రేవో... హోల్డర్ (40 నాటౌట్) అండతో సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లలో ఆమిర్ 3, యాసిర్ షా, నవాజ్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సలో పాకిస్తాన్ 579/3 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ 357 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సలో పాక్ 123 పరుగులకే ఆలౌటైంది. -
డే నైట్ టెస్టు ఆసీస్‌దే
మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్ 2-0తో సిరీస్ కైవసం అడిలైడ్: గులాబీ బంతులతో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తొలి డే అండ్ నైట్ టెస్టులో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 2-0తో కైవసం చేసుకుంది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మూడో రోజు ఆదివారం బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (49), వార్నర్ (35), వోజెస్ (28), మిషెల్ మార్ష్ (28) తలా కొన్ని పరుగులు జత చేశారు. బర్న్స్ (11)తో కలిసి తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించిన వార్నర్... స్మిత్ (14)తో కలిసి రెండో వికెట్‌కు 28 పరుగులు జత చేసి శుభారంభాన్నిచ్చాడు. తర్వాత షాన్ మార్ష్ కీలక ఇన్నింగ్స్‌తో వెన్నెముకగా నిలిచాడు. వోజెస్తో కలిసి నాలుగో వికెట్‌కు 49; మిచెల్ మార్ష్‌తో కలిసి ఐదో వికెట్‌కు 46 పరుగులు జత చేసి జట్టును విజయం అంచులకు చేర్చాడు. చివర్లో సిడిల్ (9 నాటౌట్), నివిల్ (10) లాంఛనం పూర్తి చేశారు. బౌల్ట్ 5, బ్రాస్‌వెల్, సాంట్నెర్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు 116/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. సాంట్నెర్ (45), బ్రాస్‌వెల్ (27 నాటౌట్), సౌతీ (13) ఓ మాదిరిగా ఆడారు. హాజెల్‌వుడ్ 6, మిషెల్ మార్ష్ 3 వికెట్లు పడగొట్టారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు కూడా బాగానే పోటెత్తారు. హాజెల్‌వుడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
వికెట్లు... టపటపా
డేనైట్ టెస్టులో రెండో రోజు 13 వికెట్లు ఓవరాల్‌గా 94 పరుగుల ఆధిక్యంలో కివీస్ అడిలైడ్: తొలిసారి ప్రయోగాత్మకంగా ఆడుతున్న డేనైట్ టెస్టులో పింక్ బంతితో బౌలర్లు పండగ చేసుకుంటున్నారు. తొలిరోజు 12 వికెట్లు పడితే... రెండో రోజు శనివారం ఏకంగా 13 వికెట్లు నేలకూలాయి. తొలిరోజు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ కాగా... రెండో రోజు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (53), నెవిల్ (66) అర్ధ సెంచరీలు చేయగా... మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. అయితే చివరి ఇద్దరు ఆటగాళ్లు లియోన్ (34), స్టార్క్ (24 నాటౌట్) రాణించడంతో ఆసీస్‌కు కీలకమైన 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్ మూడు, బౌల్ట్, క్రెయిగ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో ఐదు వికెట్లకు 116 పరుగులు చేసింది. రాస్ టేలర్ (32) రాణించాడు. శాంట్నర్ (13), వాట్లింగ్ (7) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ మూడు, మిషెల్ మార్ష్ రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లోటును మినహాయిస్తే ప్రస్తుతం న్యూజిలాండ్ 94 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఈ మ్యాచ్ మూడోరోజు ఆదివారం ముగిసే అవకాశం ఉంది. అదే ఉత్సాహం ఇక ప్రేక్షకులు ఈ మ్యాచ్‌కు రెండో రోజు కూడా భారీగా వచ్చారు. 42,372 మంది అభిమానులు లైట్ల వెలుతురులో పింక్ బంతితో టెస్టు క్రికెట్ అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందారు.