బీసీసీఐ
ముంబై : భారత్‌తో డే–నైట్ టెస్టు ఆడించేందుకు శతవిధాలా ప్రయత్నించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. డే నైట్ టెస్ట్ ఆడేందుకు తాము సిద్దంగా లేమని తేల్చి చెప్పింది. ఫ్లడ్‌లైట్‌ల కింద ఆడాలంటే ఆటగాళ్లకు సుమారు 18 నెలల ప్రాక్టీస్ అవసరమని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి పాలకుల కమిటీ(సీఓఏ)కు సూచించాడు. దీంతో బీసీసీఐ తాత్కలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్‌కు డేనైట్ మ్యాచ్ ఆడలేమని ఈమెయిల్ ద్వారా సమాచారమిచ్చాడు. ‘‘పరిస్థితుల దృష్ట్యా మీ ప్రతిపాదన తీరస్కరిస్తున్నాము. మీతో డేనైట్ టెస్టులు ఆడలేము’’ అని సదర్లాండ్‌కు రాసిన మెయిల్‌లో చౌదరి పేర్కొన్నారు.
‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరిగే తొలి టెస్టును పింక్ బంతితో డే–నైట్ ఆడించాలని సీఏ గంపెడు ఆశలు పెట్టుకుంది. గత మూడేళ్లుగా అడిలైడ్‌లో నాలుగు డే–నైట్ టెస్టులు జరిగాయి. కివీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్‌లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐదు రోజుల ఆట ఆడాయి. ఈ నాలుగు టెస్టుల్లో ఆసీసే గెలవడం గమనార్హం. అలాగే ఈసారి భారత్‌తో ఆడాలని సీఏ శతవిధాల ప్రయత్నించింది. భారత ఆటగాళ్లలో చతేశ్వర పుజారా, మురళి విజయ్‌లకు మాత్రమే డేనైట్ టెస్టు ఆడిన అనుభవం ఉంది. వీరు దులీప్ ట్రోఫీలో భాగంగా ఫ్లడ్‌లైట్స్ కింద పింక్ బంతితో ఆడారు. బీసీసీఐ తాజ నిర్ణయంతో సీఏ సందిగ్ధంలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment