రెడ్‌–పింక్‌ బాల్స్‌ మధ్య తేడా ఏమిటి!? | Day Night Test: What is Difference Between Pink Ball and Red Ball | Sakshi
Sakshi News home page

రెడ్‌–పింక్‌ క్రికెట్‌ బాల్స్‌ మధ్య తేడా ఏమిటి!?

Published Wed, Nov 20 2019 1:08 PM | Last Updated on Wed, Nov 20 2019 3:32 PM

Day Night Test: What is Difference Between Pink Ball and Red Ball - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్ల మధ్య మొట్టమొదటి సారిగా డే–నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుందనే విషయం తెల్సిందే. ఈ కారణంగానే కాకుండా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ గ్రౌండ్‌లో ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఉంది. భారత్‌ పింక్‌ (గులాబీ రంగు) బాల్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడడం కూడా ఇదే మొదటిసారి. సాధారణంగా అన్ని దేశాలు మొదటి నుంచి రెడ్‌ బాల్స్‌తోనే టెస్ట్‌మ్యాచ్‌లు ఆడుతూ వచ్చాయి. ఒన్‌డేలు, ఐపీఎల్‌ లాంటి పరిమిత ఒవర్ల మ్యాచ్‌లను వైట్‌ బాల్స్‌తో ఆడుతున్నాయి. వైట్‌ బాల్స్‌కు బౌన్స్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. దానితోని ఫోర్లు, సిక్స్‌లు ఎక్కువగా కొట్టే అవకాశం ఉంటుంది. అందుకని ప్రేక్షకులను ఎక్కువగా అలరించడం కోసం వన్‌డే, ఐపీఎల్‌ లాంటి మ్యాచ్‌ల్లో వైట్‌ బాల్స్‌ను వాడుతున్నారు.

భారత్‌ మినహా కొన్ని దేశాలు పింక్‌ బాల్స్‌తోని కూడా టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాయి. ఆడుతున్నాయి. భారత్‌కే బంగ్లాదేశ్‌తో అరంగేట్రం. అసలు రెడ్‌ బాల్స్‌కు, పింక్‌ బాల్స్‌కు తేడా ఏమిటీ? ఇందులో ఏ బాల్స్‌ ఎక్కువ ఒవర్ల వరకు దెబ్బతినదు? ఏది ఎక్కువగా బరువు ఉంటుంది?  పింక్‌ బాల్స్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయా? బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయా? ఫాస్ట్‌ బౌలర్లకు మేలు చేస్తుందా? స్పిన్నర్లకు మేలు చేస్తుందా? అన్న సందేహాలు క్రికెట్‌ అభిమానుల్లో సుడులు తిరుగుతూనే ఉండవచ్చు. రెడ్‌ బాల్స్, పింక్‌ బాల్స్, వైట్‌ బాల్స్‌ ఏవైనా ఒకే స్థాయి బరువు కలిగి ఉంటాయి.

లండన్‌లోని మార్లిబోన్‌ క్రికెట్‌ క్లబ్‌ సూచించిన ప్రమాణాల వరకు ఈ మూడు రంగుల క్రికెట్‌ బంతులు 156 గ్రాముల నుంచి 162 గ్రాముల బరువు మధ్యనే ఉండాలి. దీనికన్నా ఎక్కువున్నా, తక్కువ బరువున్న తిరస్కరిస్తారు. అన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచుల్లో దీన్నే ప్రమాణంగా పాటిస్తున్నారు. కొందరు రెడ్‌ బాల్స్‌ బరువుంటాయని, వైట్‌ బాల్స్‌ తేలిగ్గా ఉంటాయంటారు. అది పూర్తిగా అబద్ధం. వైట్‌ బాల్స్‌కు స్వింగ్‌ ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటి భావన కలుగుతుంది. స్వింగ్‌ రావడం కోసం బంతి మధ్యలో మెత్తటి పదార్థాన్ని ఉపయోగిస్తారు.

అసలు రెండింటి మధ్య తేడా ఏమిటి?
భారత్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం రెడ్‌ బాల్స్‌ను తయారుచేసి అందిస్తున్న మీరట్‌లోని ‘సాన్స్‌పరేల్స్‌ గ్రీన్‌లాండ్స్‌ (ఎస్‌జీ)’ కంపెనీలో గత 45 ఏళ్లుగా చీఫ్‌ బాల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వసీవుల్లా ఖాన్‌ (73) కథనం ప్రకారం అన్ని రంగుల క్రికెట్‌ బాల్స్‌కు పైనా కవచంలా లెదర్‌నే ఉపయోగిస్తారు. ఎరుపు, పింక్‌ బాల్స్‌లోపల కాట్స్‌వూల్, కార్క్‌లనే కూరుతారు. బంతులను కుట్టడంలో కూడా తేడా ఉండదు. రెడ్‌ బాల్స్‌ను తెల్లదారంతో కుడితే, పింక్‌ బాల్స్‌ను నల్లదారంతో కుడతారు. రెడ్‌ బాల్స్‌కు పైన మైనం కోటింగ్‌ ఉంటుంది. అందువల్ల రెడ్‌ బాల్స్‌ మిల మిలా మెరుస్తూ చెర్రీ పండ్ల రంగులో కనిపిస్తాయి. కొన్ని ఓవర్ల తర్వాత మైనాన్ని బంతి లోపలికి లాగేసుకోవడం వల్ల స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలంగా బంతి మారుతుంది. మైనం ప్రభావాన్ని త్వరగా పోగొట్టడానికే బౌలర్లు ఒకవైపున వాటిని బాగా రాపిడి పెడతారు.

పింక్‌ బాల్స్‌కు మైనాన్ని ఉపయోగించరు!
మైనం వాడితే పింక్‌ రంగు నలుపు రంగులోకి మారుతుంది. అందుకని మైనాన్ని వాడరు. పాలిష్‌ వాడుతారు. ఎర్రరంగు త్వరగా పోకుండా రెడ్‌ బాల్స్‌పై మైనం పూత ఎలా రక్షిస్తుందో ఈ పాలిష్‌ 40 ఓవర్ల వరకు పింక్‌ రంగు పోకుండా రక్షిస్తుంది. టెస్ట్‌ మ్యాచ్‌లకు ఉపయోగించే బంతుల్లో నాణ్యమైన పదార్థాన్ని కూరడంతో పాటు బలమైన దారాన్ని ఉపయోగిస్తారు. ఈ రెండింట్‌ని కూడా భారత్‌ కంపెనీలు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. బంతిని కుట్టే రెండు (కప్పులు) అంచుల మధ్య భాగాన్ని ‘సీమ్‌’ అని పిలుస్తారు. రెడ్‌ బాల్స్‌లో బంతి కప్పు అంచులకు సింథటిక్‌ను మాత్రమే వాడతారు. పింక్‌ బాల్స్‌లో సింథటిక్‌ను, లైనెన్‌ను సమపాళ్లలో వినియోగిస్తారు. డే టెస్ట్‌ మ్యాచ్‌లకే రెడ్‌ బాల్స్‌ను ఉపయోగిస్తారు. డే–నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌లకు పింక్‌ బాల్స్‌ వాడుతారు.

లైనెన్‌తో గ్రిప్‌ పెరుగుతుంది
పింక్‌ బాల్స్‌ సీమ్‌లో లైనెన్‌ను ఉపయోగించడం వల్ల బౌలర్లకు గ్రిప్పు పెరుగుతుంది. ముఖ్యంగా సీమ్‌ బౌలర్లకు అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మొదటి పది–పదిహేను ఓవర్ల వరకు పింక్‌ బాల్స్‌ ఎక్కువగా స్వింగ్‌ అవుతాయి. 40–45 ఓవర్ల తర్వాత కూడా స్పిన్‌ బౌలింగ్‌కు ఎక్కువగా ఉపయోగపడతాయి. మొత్తంగా రెడ్‌ బాల్స్‌తో పోలిస్తే రంగు త్వరగా పోదు. పటిష్టత ఎక్కువగా ఉంటుంది. అంటే బాల్‌ త్వరగా షేపవుట్‌ కాదు. ‘గోగేజ్‌–నోగేజ్‌’ పేరిట బాల్‌ షేపవుట్‌ అయిందా, లేదా? అన్న అంశాన్ని ఎంపైర్లు నిర్ధారిస్తారు. గోగేజ్‌ అంటే బంతి చుట్టూ కొలత 71 మిల్లీ మీటర్ల ఉండాలి. నోగేజ్‌ అంటే 73 మిల్లీ మీటర్లకు మించి ఉండరాదు. అంటే, బంతి మధ్య కేంద్ర బిందువు నుంచి బంతి చుట్టూ కొలత కొలచినప్పుడు బంతి వృత్తం 71–73 మిల్లీ మీటర్ల మధ్యనే ఉండాలి. ఎక్కడ బంతి ఉపరితల వృత్తం 71 మిల్లీ మీటర్లకన్నా తగ్గినా, 73 మిల్లీ మీటర్లకన్నా పెరిగినా అది షేపవుట్‌ అయినట్లు. అన్ని విధాల పింక్‌ బాల్స్‌ బాట్స్‌మెన్‌కన్నా బౌలర్లకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. (చదవండి: రహానే కళ్లలో గులాబీ కలలే.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement