కోల్‌కతా: పింక్ బాల్‌తో మన దేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్, బంగ్లాదేశ్ జట్లు పింక్ బాల్‌తో మొట్ట మొదటి టెస్ట్ ఆడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు షాద్‌మాన్ ఇస్లాం, ఇమ్రూల్ కేయాస్ ఓపెనర్లుగా వచ్చారు. తొలి బంతిని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ వేయగా.. షాద్‌మాన్ ఆడాడు. భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్ సంధించిన తొలి బౌలర్‌గా ఇషాంత్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. దాయాది దేశంలో పింక్ బాల్ ఎదుర్కొన్న తొలి బ్యాట్స్‌మన్‌గా షాద్‌మాన్ నిలిచాడు.
పరుగులేమి రాకుండానే మొదటి ఓవర్ ముగిసింది. రెండో ఓవర్ ఉమేశ్ యాదవ్ వేశాడు. రెండో ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి ఇమ్రూల్ కేయాస్ ఖాతా తెరిచాడు. పింక్ బాల్‌తో తొలి వికెట్ కూడా ఇషాంత్ శర్మ దక్కించుకున్నాడు. తన మూడో ఓవర్ మూడో బంతికి ఇమ్రూల్‌ను ఎల్‌బిడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది. మరోవైపు పింక్‌బాల్ టెస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు, ప్రముఖులతో ఈడెన్ గార్డెన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్ వీక్షించేందుకు ఈడెన్ గార్డెన్స్‌కు విచ్చేశారు. సోషల్ మీడియాలో #PinkBallTest హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment