భారత మహిళల ఘోర పరాజయం
కాన్బెర్రా: ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై టీ 20 సిరీస్ ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళలకు తొలి వన్డేలో చుక్కెదురైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత మహిళలు 101 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూశారు. ఆస్ట్రేలియా విసిరిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్ 46.5 ఓవర్లలో 175 పరుగులకే చాపచుట్టేసి ఓటమి పాలైంది.
భారత జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్(42) మినహా మిగతా క్రీడాకారిణులు విఫలమయ్యారు. కెప్టెన్ మిథాలీ రాజ్(23), జులాన్ గోస్వామి(25) లు ఫ పూనమ్ రౌత్(10), తిరుష్ కామిని(10), వేదా కృష్ణమూర్తి(6),శిఖా పాండే(13)లు నిరాశపరచడంతో ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో పెర్రీ నాలుగు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించగా, స్కట్, జొనాసెన్, గ్రేస్ హరిస్లకు తలో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు 50.0 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా మహిళా ఓపెనర్ మెగ్ లానింగ్(43), పెర్రీ(90), అలెక్స్ బ్లాక్ వెల్(114)లు రాణించి భారీ చేయడంలో సహకరించారు. భారత బౌలింగ్ లో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా, గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ లు తలో వికెట్ లభించింది.