అబుదాబి: పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తమ దేశం తరపున ఈ రికార్డు సాధించిన 8వ క్రికెటర్‌గా నిలిచాడు. 32 ఏళ్ల అజహర్ 61వ టెస్టులో 5 వేల పరుగులు పూర్తి చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో అతడు అర్థసెంచరీ చేశాడు. 200 బంతుల్లో 3 ఫోర్లతో 74 పరుగులు సాధించాడు. పాక్ తరపున వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా అతడు ఘనతకెక్కాడు.
2010లో లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లోకి అడుగుపెట్టిన అజహర్ పాక్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. దుబాయ్‌లో గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి.. డే నైట్ టెస్టులో శతకం బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. యూనిస్ ఖాన్(10,099), జావెద్ మియందాద్(8,832), ఇంజమామ్-వుల్-హక్(8,829), మహ్మద్ యూసఫ్(7,530) పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించారు.
కాగా, శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో 64/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది.