అజహర్ అలీపై ఒక మ్యాచ్ సస్పెన్షన్
అడిలైడ్:ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణమైన పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ అజహర్ అలీపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. దాంతో పాటు అతని మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. గత 12 నెలల కాలంలో అజహర్ అలీ రెండు సార్లు స్లో ఓవర్ రేట్ కు కారణం కావడంతో అతనిపై మ్యాచ్ మ్యాచ్ సస్పెన్షన్తో పాటు భారీ జరిమానా పడింది.
గతేడాది జనవరి 31వ తేదీన న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అజహర్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్ను నమోదు చేసింది. అప్పుడు అజహర్ పై 20 శాతం జరిమానాతో సరిపెట్టారు. అయితే ఏడాదిలోపు రెండు సార్లు స్లో ఓవర్ రేట్ ను నమోదు చేయడంతో ఈసారి అజహర్ ను ఒక మ్యాచ్ నుంచి సస్సెండ్ చేశారు. దాంతో ఈ ఏడాది ఏప్రిల్లో వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్లో పాల్గొనే అవకాశాన్ని అజహర్ కోల్పోనున్నాడు.