గాయం వేధించినా...
న్యూఢిల్లీ: కాలి కండరాల్లో చీలిక వచ్చినా... వైద్యులు బరిలోకి దిగొద్దని హెచ్చరించినా... ఇవేమీ పట్టించుకోకుండా పట్టుదలతో పోరాడి స్వర్ణ పతకం సాధించానని భారత మహిళా రెజ్లర్ బబిత కుమారి తెలిపింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా తన కాలి కండరాల్లో చీలిక రావడంతో పోటీల్లో పాల్గొనవద్దని డాక్టర్లు సూచించినట్టు 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన బబిత వెల్లడించింది.
‘గాయం తీవ్రంగా ఉంది. పోటీల్లో పాల్గొనకపోవడం మంచిది అని డాక్టర్లు తెలిపారు. అయితే నా సోదరి గీతాకు ఫోన్ చేశాను. ఏం జరిగినా ఫర్వాలేదు. నా కాలు విరిగినా పోటీల్లో పాల్గొంటాను అని ఆమెకు స్పష్టం చేశాను’ అని నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీ గేమ్స్‌లో రజతం నెగ్గిన ఈ హర్యానా అమ్మాయి వివరించింది. వచ్చే నెలలో మొదలయ్యే ఆసియా క్రీడల సమయానికి పూర్తిగా కోలుకుంటానని బబిత తెలిపింది.