Babita Kumari
-
రెజ్లర్ల ఉద్యమం.. పర్యవేక్షక కమిటీలోకి బబితా
మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంపై మేరీకోమ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తమ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కమిటీ ఏర్పాటుకు ముందు తమను సంప్రదించలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తాజాగా పర్యవేక్షణ కమిటీలో కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత, రెజ్లర్ బబిత ఫొగట్‌ను ఆరో సభ్యురాలిగా చేర్చినట్టు కేంద్ర క్రీడాశాఖ మంగళవారం ప్రకటించింది. కాగా కమిటీలో మేరీకోమ్‌తో పాటు మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ షట్లర్ తృప్తి ముర్గుండె, రాధిక శ్రీరామ్, రాజేశ్ రాజగోపాలన్‌లు ఉన్నారు. తాజాగా బబితా ఈ కమిటీలో ఆరో సభ్యురాలిగా చేరింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ నియంతృత్వ ధోరణిని రెజ్లర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం డబ్ల్యూఎఫ్ఐ రోజువారి వ్యవహారాలను పర్యవేక్షక కమిటీనే చూస్తోంది. -
‘దంగల్’ తరహా సీన్ రిపీట్..
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘దంగల్’లో హీరో అమీర్ ఖాన్‌ను తన కూతురు ఫైనల్ బౌట్ చూడకుండా జట్టు కోచ్ ఆయనను ఓ గదిలో బంధిస్తారు. నిజంగా ఇది జరగనప్పటికీ సినీడ్రామా కోసం అలా చేశారు. స్టార్ రెజ్లర్లు గీత, బబిత ఫొగాట్ తండ్రి మహావీర్ ఫొగాట్ జీవితచరిత్ర ఆధారంగా ఆ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బంధించడం జరగలేదు కానీ... స్టేడియం వెలుపల మహావీర్ నిరీక్షించిన ఘటన గోల్ట్కోస్ట్లో జరిగింది. తన కుమార్తె తలపడుతున్న 53 కేజీల స్వర్ణ పతక బౌట్‌ను చూసేందుకు స్టేడియానికి వెళ్లిన మహావీర్ టికెట్ లేక ఆగిపోయారు. తొలి మూడు బౌట్లలో బబిత గెలిచినా... అది చూసే అవకాశం మాత్రం మహావీర్‌కు దక్కలేదు. చివరకు ఆస్ట్రేలియా రెజ్లర్లకు వచ్చిన టికెట్లతో ప్రవేశం పొందిన ఆయన... తన కుమార్తె ఫైనల్ ‘పట్టు’ చూడగలిగారు. టికెట్ల వ్యవహారంపై చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా మాట్లాడుతూ రెజ్లింగ్ కోచ్ తోమర్‌కు ఐదు టికెట్లిచ్చామని... అమెకు ఎందుకు అందలేదో తెలియదన్నారు. రాత్రి దాకా ప్రయత్నించా: బబిత ‘అథ్లెట్‌కు రెండు టికెట్లిస్తారు. కానీ అవి నాకు అందలేదు. నా తండ్రికి టికెట్ ఇవ్వండని ఐఓఏ అధికారుల్ని, భారత చెఫ్ డి మిషన్‌ను అడిగా. బుధవారం రాత్రి పది గంటలదాకా నాకు ఇదే పనైంది. ఎంత చేసినా టికెట్లు అందలేదు. దీంతో స్టేడియం వెలుపలే మా నాన్న ఉండిపోయాడు. చివరకు ఆస్ట్రేలియన్ల చొరవతో ఆఖరి పోరు చూడగలిగారు. నేను చాలా నిరాశ చెందాను’ అని బబిత వాపోయింది. -
నిరాశపరిచిన బబితా కుమారి
భారత మహిళా రెజ్లర్ బబితా కుమారి నిరాశపరిచింది. ప్రిక్వార్టర్ పైనల్స్ లో భాగంగా గురువారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో గ్రీస్ రెజ్లర్ మరియా ప్రివోలరాకీ చేతిలో 5-1 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత మరియా 3-0తో ఆధిక్యంలో ఉండగా ఆట ముగిసేసరికి మరో రెండు పాయింట్లు సాధించింది. మరోవైపు బబితా కేవలం ఒకే పాయింట్ సాధించడంతో ఓటమి ఖరారైంది. అయితే గ్రీస్ రెజ్లర్ మరియా ఫైనల్లో ప్రవేశిస్తే బబితాకు సాక్షి మాలిక్ కు లభించినట్లుగా మరో అవకాశం దక్కుతుంది. -
ప్రపంచ రెజ్లింగ్ టోర్నీ: బబితాకు నిరాశ
లాస్ వెగాస్ (అమెరికా) : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. బబితా కుమారి, వినేశ్ ఫోగత్, నవ్‌జ్యోత్ కౌర్ టోర్నీ నుంచి నిష్ర్కమించారు. 2012లో కాంస్యం సాధించిన బబిత (53 కేజీలు) క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయింది. బబిత 2-6తో చైనాకు చెందిన గ్జూచున్ జోంగ్ చేతిలో ఓడింది. యువ రెజ్లర్ వినేశ్ (48 కేజీలు) తొలి రౌండ్లోనే 4-8తో కిమ్ హ్యోన్ గ్యాంగ్ (ఉత్తర కొరియా) చేతిలో పరాజయం పాలైంది. నవ్‌జ్యోత్ (69 కేజీలు) కూడా తొలి రౌండ్లోనే 0-8తో అలినా స్టాడ్నిక్ (ఉక్రెయిన్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల 85 కేజీల గ్రీకో రోమన్ విభాగం క్వార్టర్స్‌లో మనోజ్ కుమార్ 0-10తో రమీ ఆంటెరో (ఫిన్లాండ్) చేతిలో ఓడిపోయాడు. -
గాయం వేధించినా...
న్యూఢిల్లీ: కాలి కండరాల్లో చీలిక వచ్చినా... వైద్యులు బరిలోకి దిగొద్దని హెచ్చరించినా... ఇవేమీ పట్టించుకోకుండా పట్టుదలతో పోరాడి స్వర్ణ పతకం సాధించానని భారత మహిళా రెజ్లర్ బబిత కుమారి తెలిపింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా తన కాలి కండరాల్లో చీలిక రావడంతో పోటీల్లో పాల్గొనవద్దని డాక్టర్లు సూచించినట్టు 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన బబిత వెల్లడించింది. ‘గాయం తీవ్రంగా ఉంది. పోటీల్లో పాల్గొనకపోవడం మంచిది అని డాక్టర్లు తెలిపారు. అయితే నా సోదరి గీతాకు ఫోన్ చేశాను. ఏం జరిగినా ఫర్వాలేదు. నా కాలు విరిగినా పోటీల్లో పాల్గొంటాను అని ఆమెకు స్పష్టం చేశాను’ అని నాలుగేళ్ల క్రితం న్యూఢిల్లీ గేమ్స్‌లో రజతం నెగ్గిన ఈ హర్యానా అమ్మాయి వివరించింది. వచ్చే నెలలో మొదలయ్యే ఆసియా క్రీడల సమయానికి పూర్తిగా కోలుకుంటానని బబిత తెలిపింది.