నా నిజాయితీనే శంకిస్తారా?
గుహ వ్యాఖ్యలపై గావస్కర్
న్యూఢిల్లీ: క్రికెట్ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలను సునీల్ గావస్కర్ తిప్పికొట్టారు. తన నిజాయితీని శంకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయని అన్నారు. తాను పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్)ను కలిగి ఉన్నట్లు ప్రవర్తించిన ఒక్క సంఘటనైనా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. తన కామెంటరీ ద్వారా సెలక్షన్ ప్యానల్‌ను ప్రభావితం చేసినట్లు రుజువు చేయాలని గుహను సూటిగా అడిగారు. ‘గుహ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా నిరాశపరిచాయి. భారత క్రికెట్ నాకెంతో చేసింది. నా వంతుగా క్రికెట్ అభివృద్ధిలో సహకరిస్తున్నాను.
కానీ ఇలా నా నిజాయితీనే శంకించడం నన్ను బాధించింది. కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంశాన్ని నాకు ఆపాదించడం సరికాదు. నాకు వ్యతిరేకంగా గుహ వ్యాఖ్యలు చేయడం వెనుక ఇంకా ఏదో ఉంది’ అని గావస్కర్ వివరించారు. ధోని, కోహ్లి, కుంబ్లేలపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన వ్యతిరేకించారు. ‘ధోని అద్భుతమైన క్రికెటర్. గ్రేడ్ ‘ఎ’ కాంట్రాక్టు పొందే హక్కు అతనికి ఉంది. భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలను ఎలా ప్రశ్నిస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో సూపర్‌స్టార్ సంస్కృతి ఉందని గుహ అభిప్రాయపడితే ఇక్కడ ఇతరులపై అసూయపడే సంస్కృతి కూడా ఉన్నట్లేనని అన్నారు.