Ramchandra Guha
-
‘మోదీని ఆ ట్రస్టులు దూరం పెట్టాయి’
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మ గాంధీ పేరును మోదీ తన స్వార్థం కోసం మోదీ వాడుకున్నారని విమర్శించారు. ప్రధాని కాకముందు ఎప్పుడైనా గాంధీని మోదీ గుర్తుచేశారా అంటూ ప్రశ్నించారు. ఆయన గురువారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ.. గాంధీ జీవించి ఉంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకించేవారని అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక సబర్మతి ఆశ్రమానికి చెందిన ప్రధాన ట్రస్టులు అతన్ని దూరం పెట్టాయని గుర్తు చేశారు. గాంధీ నెలకొల్పిన సబర్మతి ఆశ్రమ యాజమాన్యం సీఏఏను వ్యతికేస్తూ మాట్లాడకపోవడంపై గుహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారు సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తారని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ అసభ్యకర భాషను వినియోగిస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ఉన్నా, లేకపోయినా గుజరాత్ రాష్ట్రం శాశ్వతమని గుహ పేర్కొన్నారు. చదవండి: మోదీ, గాడ్సేలది ఒకే భావజాలం: రాహుల్ రాహుల్‌ను గెలిపిస్తే.. మోదీకే ప్రయోజనం -
‘మీరిచ్చే ఆ 40 లక్షలు నాకొద్దు’
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 39వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ పూర్థి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గం పూర్తిస్థాయిలో బాధ్యతలు చేప్పటడంతో సుప్రీంకోర్టు నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ)కి నేటితో శుభం కార్డు పడింది. అయితే ఇన్నాళ్లు భారత క్రికెట్ వ్యవహారాలు చూసిన సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీకి 33 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 3.5 కోట్లు చెల్లించాలిని బీసీసీఐ నిర్ణయిచింది. వీరితో పాటు కొన్ని నెలలు సీఓఏలో సభ్యులుగా ఉన్న విక్రమ్ లిమాయేకు రూ. 50.5 లక్షలు, రామచంద్ర గుహకు రూ. 40 లక్షల చొప్పున ఇవ్వాలని బీసీసీఐ భావించింది. అయితే బీసీసీఐ నిర్ణయంపై రామచంద్ర గుహ భిన్నంగా స్పందించాడు. తనకు బోర్డు నుంచి ఒక్క రూపాయి కూడా అవసరం లేదని స్పష్టం చేశాడు. ‘సీఓఏ సభ్యుడిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఆ పదవిని డబ్బు కోసం చేపట్టలేదు. అయితే ఇది నా వ్యక్తిగత నిర్ణయం. అదేవిధంగా 33 నెలలు పనిచేసి(వినోద్ రాయ్, ఎడుల్జీ) బీసీసీఐ ఇచ్చే భారీ వేతనాన్ని అంగీకరించడం కూడా సరైనదిగా భావించడం లేదు. ఇక నేను కమిటీ సభ్యుడిగా పనిచేసింది కొన్ని నెలలైనా క్రికెట్ అభివృద్దికి నా వంతు కృషి చేసా. నేను బాధ్యతలు చేపట్టే సరికి క్రికెట్ పరిపాలన గందరగోళంగా ఉంది. అయితే పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాను’అంటూ బీసీసీఐకి రామచంద్ర గుహ లేఖ రాశాడు. ఇక 2017లో టీమిండియా కోచ్-కెప్టెన్ మధ్య జరిగిన వివాదంలో రామచంద్ర గుహ కుంబ్లేకే మద్దతుగా నిలిచాడు. అయితే కుంబ్లేను తొలగించడంపై ‘సూపర్ స్టార్ సంస్కృతి మొదలైంది’అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బోర్డులో రోజువారి కార్యకలాపాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు 2017లో అప్పటి అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను పదవి నుంచి తప్పించింది. జస్టిస్ లోథా సంస్కరణలు అమలు చేసేందుకు 2017 జనవరిలో వినోద్ రాయ్, విక్రమ్ లిమాయే, డయానా ఎడుల్జీ, రామచంద్ర గుహలతో కూడిన క్రికెట్ పరిపాల కమిటీ(సీఓఏ)ని నియమించింది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో 2017 జులైలో రామచంద్ర గుహ, అనంతరం విక్రమ్ లిమాయే కూడా సీఓఏ నుంచి తప్పుకున్నారు. అయితే వీర్దిదరూ పక్కకు జరిగినప్పటికీ వినోద్ రాయ్, ఎడుల్జీలు భారత క్రికెట్ వ్యవహారాలను సమర్థంగా చూసుకున్నారు. -
'అంతా కోహ్లి భజన చేస్తున్నారు'
న్యూఢిల్లీ:ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అంతా కెప్టెన్ విరాట్ కోహ్లి భజన బ్యాచ్‌గా మారిపోయిందని క్రికెట్ పరిపాలన కమిటీ(సీఓఏ) మాజీ సభ్యుడు రామచంద్ర గుహా విమర్శించారు. ఇది ఎంతలా అంటే కేంద్ర కేబినెట్ ప్రధాన నరేంద్ర మోదీని స్తుతించడం కంటే ఎక్కువగా ఉందంటూ చురకలంటించారు. ఈ మేరకు టెలిగ్రాఫ్ వార్తాసంస్థకు రాసిన కాలమ్‌లో కోహ్లిపై రామచంద్ర గుహా ధ్వజమెత్తారు. భారత క్రికెట్ బోర్డు అధికారులు, సెలెక్టర్లు, కోచింగ్ సిబ్బంది అంతా కూడా కోహ్లి ముందు చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తున్నారన్నాడు. వారంతా కోహ్లి ముందు మరగుజ్జుల్లా కనిపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా బోర్డులో అవినీతి, బంధుప్రీతి ఉండగా దానికి అదనంగా కోహ్లి భజన ఒకటి వచ్చి చేరిందన్నాడు. దీన్ని ‘సూపర్ స్టార్ సిండ్రోమ్’ అంటూ ఎద్దేవా చేశాడు. బీసీసీఐలో తనకు సంబంధం లేని విషయాల్ని కూడా కోహ్లి ప్రభావం కనబడుతుందంటే ఇది భజన కాక ఏమిటని ప్రశ్నించాడు. కానీ కుంబ్లే ఒక్కడే అతడి ముందు స్వతంత్రంగా వ్యవహరించగల్గిన వ్యక్తి అని గుహా పేర్కొన్నాడు.భవిష్యత్ టూర్ షెడ్యూల్, జాతీయ క్రికెట్ అకాడమీ వ్యవహారాలపై కోహ్లి అంగీకారం తీసుకోవాల్సిన పరిస్థితి నేటి బోర్డులో కనిపిస్తుందన్నాడు. ఈ విషయాన్ని బోర్డు లీగల్ కౌన్సిల్, సీఈవో సూచించిన విషయాన్ని గుహా ప్రస్తావించారు. అసలు అనిల్ కుంబ్లే తన కోచ్ పదవి నుంచి వైదొలగడానికి కారణం ఎవరో అందరికీ తెలుసంటూ ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
ద్రవిడ్, జహీర్లకు కుంబ్లే పరిస్థితే..
ముంబై: భారత క్రికెట్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తరహాలోనే బీసీసీఐ ద్రవిడ్, జహీర్‌లను ఘోరంగా అవమానిస్తోందని సీఓఏ మాజీ సభ్యుడు రామ చంద్రగుహా ఆగ్రహాం వ్యక్తం చేశాడు. రామచంద్ర గుహా గత జూన్‌లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పరిపాలక కమిటీ (సీఓఏ) అభ్యర్థిత్వానికి రాజీనామ చేశారు. డ్రామను తలపిస్తూ సాగిన భారత్ హెడ్ కోచ్ ఎంపికను రామచంద్రగుహా తప్పుబట్టాడు. కుంబ్లే, ద్రవిడ్, జహీర్ గొప్ప ఆటగాళ్లని, ఎన్నోవిజయాలు అందించారని వారిని అవమానాలకు గురిచేయవద్దని పేర్కొన్నారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) రవిశాస్త్రీ హెడ్ కోచ్‌గా, ద్రవిడ్, జహీర్‌ను విదేశీ పర్యటనలకు బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పరిపాలక కమిటీ (సీఓఏ) హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైనే ఆమోద ముద్ర వేసింది. అయితే బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్, బ్యాటింగ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల నియామకంపై కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జట్టు సహాయక సిబ్బందిని ఈనెల 22న రవిశాస్త్రిని సంప్రదించాకే నియమించే అవకాశం ఉంది. అయితే బోర్డు చెబుతున్నట్టుగా విదేశీ పర్యటనలోనైనా జహీర్, ద్రవిడ్ జట్టుతో పాటు ఉంటారా? అనే విషయంలో కమిటీ స్పష్టతనివ్వడం లేదు. ఈ విషయంపై స్పందించిన రామచంద్ర గుహా కోచ్ ఎంపికలో రాజకీయలు చేయడం బాధించిందని, కుంబ్లేకు ఎదురైన పరిస్థితే ద్రవిడ్, జహీర్‌కు ఎదురవుతుందని వరుస ట్వీట్లు పోస్టు చేశాడు. గతంలో కూడా రామచంద్ర గుహా బీసీసీఐని ఉద్దేశించి తన రాజీనామాలో ప్రశ్నించారు. క్రికెటర్లు కోచ్, కామెంటేటర్ల ఎంపికలో భాగస్వామ్యులవుతున్నారని హార్షబోగ్లేను తప్పించడంలో కోహ్లీ పాత్రను గుర్తు చేశారు. Kumble, Dravid and Zaheer were true greats of the game who gave it all on the field. They did not deserve this public humiliation. — Ramachandra Guha (@Ram_Guha) 16 July 2017 The shameful treatment of Anil Kumble has now been compounded by the cavalier treatment of Zaheer Khan and Rahul Dravid. — Ramachandra Guha (@Ram_Guha) 16 July 2017 -
నితీశ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుణ్ని చేయండి: గుహ
న్యూఢిల్లీ: నానాటికీ క్షీణిస్తున్న కాంగ్రెస్ పునరుత్తేజం పొందాలంటే ఆ పార్టీ అధ్యక్ష పదవిని జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు అప్పగించాలని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు. నాయకత్వ మార్పుతోనే కాంగ్రెస్ తిరిగి కోలుకుంటుందని వ్యాఖ్యానించారు. ‘ఇది నా ఊహ మాత్రమే. కాంగ్రెస్‌కు నాయకుడు లేడు, నితీశ్‌కు పార్టీ లేదు. నితీశ్ స్నేహపూర్వకంగా కాంగ్రెస్ పగ్గాలు చేపడితే అది స్వర్గంలో కుదిర్చిన పెళ్లి అవుతుంది’ అని సరదాగా అన్నారు. నితీశ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుణ్ని చేయకపోతే ఆయనకు, సోనియా గాంధీకి దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. -
నా నిజాయితీనే శంకిస్తారా?
గుహ వ్యాఖ్యలపై గావస్కర్ న్యూఢిల్లీ: క్రికెట్ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలను సునీల్ గావస్కర్ తిప్పికొట్టారు. తన నిజాయితీని శంకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయని అన్నారు. తాను పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్)ను కలిగి ఉన్నట్లు ప్రవర్తించిన ఒక్క సంఘటనైనా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. తన కామెంటరీ ద్వారా సెలక్షన్ ప్యానల్‌ను ప్రభావితం చేసినట్లు రుజువు చేయాలని గుహను సూటిగా అడిగారు. ‘గుహ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా నిరాశపరిచాయి. భారత క్రికెట్ నాకెంతో చేసింది. నా వంతుగా క్రికెట్ అభివృద్ధిలో సహకరిస్తున్నాను. కానీ ఇలా నా నిజాయితీనే శంకించడం నన్ను బాధించింది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంశాన్ని నాకు ఆపాదించడం సరికాదు. నాకు వ్యతిరేకంగా గుహ వ్యాఖ్యలు చేయడం వెనుక ఇంకా ఏదో ఉంది’ అని గావస్కర్ వివరించారు. ధోని, కోహ్లి, కుంబ్లేలపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన వ్యతిరేకించారు. ‘ధోని అద్భుతమైన క్రికెటర్. గ్రేడ్ ‘ఎ’ కాంట్రాక్టు పొందే హక్కు అతనికి ఉంది. భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలను ఎలా ప్రశ్నిస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో సూపర్‌స్టార్ సంస్కృతి ఉందని గుహ అభిప్రాయపడితే ఇక్కడ ఇతరులపై అసూయపడే సంస్కృతి కూడా ఉన్నట్లేనని అన్నారు. -
భారత క్రికెట్లో ‘సూపర్ స్టార్’ సంస్కృతి
► వాళ్లు ఏం చేసినా చెల్లుతోంది ► కోచ్ ఎంపికతో కోహ్లికి ఏం పని? ► ధోని, గంగూలీ, ద్రవిడ్లదీ తప్పే ► రామచంద్ర గుహ తీవ్ర వ్యాఖ్యలు క్రికెట్ చరిత్రకారుడు బీసీసీఐ చరిత్రను తవ్వే పనిలో పడ్డారు. పదవి నుంచి తప్పుకుంటూ భారత దిగ్గజాల వ్యవహార శైలిని ఘాటుగా ప్రశ్నిస్తూ పోయారు. కోర్టు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడంలో సీఓఏ వైఫల్యాన్ని కూడా గుర్తు చేశారు. పరిపాలకుల కమిటీ నుంచి తప్పుకుంటూ తన రాజీనామా లేఖలో అనేక అంశాలను రామచంద్ర గుహ ప్రస్తావించారు. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... గుహ లేవనెత్తిన అంశాలు భారత క్రికెట్లో మళ్లీ చర్చకు దారి తీయడం ఖాయం. న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ భారత క్రికెట్ పని తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరిపాలకుల కమిటీ (సీఓఏ) నలుగురు సభ్యులలో ఒకరిగా ఉన్న గుహ, వ్యక్తిగత కారణాల పేరుతో గురువారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే తన రాజీనామా సమయంలో కమిటీ చైర్మన్ వినోద్ రాయ్‌కు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. తాను సభ్యుడిగా ఉన్న గత నాలుగు నెలల కాలంలో తాను పరిశీలించిన అంశాలను ఆయన రాయ్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ లేఖలో ఆయన ప్రశ్నించిన కొన్ని ప్రధాన అంశాలను సంక్షిప్తంగా చూస్తే... కోచ్‌ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ భారత జట్టుకు కోచ్‌లుగా పని చేసేవారు ఐపీఎల్ జట్లకూ కోచ్‌గా వ్యవహరించడం సరికాదు. అవసరమైతే వారికి కొంత అదనపు మొత్తం చెల్లించవచ్చు. రాహుల్ ద్రవిడ్, ఆర్.శ్రీధర్, సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌లకు ఈ విషయంలో బోర్డు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చింది. పది నెలల కాంట్రాక్ట్ మాత్రమే ఇస్తూ వారు ఐపీఎల్లో పని చేసే విధంగా సడలింపు ఇస్తున్నారు. ఇదంతా అనైతిక వ్యవహారం. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో జూనియర్ క్రికెటర్ల క్యాంప్ ఉంటే ఒక కోచ్ ఐపీఎల్ ఉందని వెళ్లిపోయారు. సీఓఏ సమావేశాల్లో పలు మార్లు ఈ అంశాన్ని నేను ప్రస్తావించినా పట్టించుకోలేదు. కామెంటేటర్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ సునీల్ గావస్కర్ పీఎంజీ అనే ప్లేయర్ మేనేజ్మెంట్ కంపెనీకి యజమా ని. అది శిఖర్ ధావన్, రిషభ్ పంత్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అదే గావస్కర్ బీసీసీఐ కామెంటరీ టీమ్‌లో సభ్యుడిగా వారి గురించి వ్యాఖ్యానిస్తారు. ఇది పూర్తిగా తప్పు. ఆయన రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కావాలి. ఒక ప్రఖ్యాత క్రికెటర్ (సౌరవ్ గంగూలీ) ఒక క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మళ్లీ కామెంటరీ కూడా చేస్తే ఎలా? దేశవాళీలో తక్కువ చెల్లింపులు ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడితే ఆటగాడికి రూ.1.14 లక్షలు లభిస్తాయి. అయితే పది వేలు మాత్రమే ముందుగా ఇస్తారు. మిగతావన్నీ వాయిదాల్లోనే. ఐపీఎల్ లేకుండా దీనిపైనే బతికే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీనిని ఒక క్రమపద్ధతిలో ఉంచాలి. కొన్నిసార్లు రాష్ట్ర సంఘాలు ఆటగాళ్లకు పూర్తి మొత్తాలు కూడా ఇవ్వడం లేదు. సీఓఏ సరిగా పని చేయలేదు కొన్ని అంశాల్లో మా సీఓఏ కూడా చురుగ్గా వ్యవహరించలేదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అనర్హులైన అనేక మంది బోర్డు, రాష్ట్ర సంఘాల ఆఫీస్ బేరర్లు స్వేచ్ఛగా సమావేశాలకు హాజరయ్యారు. వీరిలో కొందరు అతిగా చొరవ చూపించి చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలని ప్రచారం చేశారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చాయి కూడా. అయితే ఈ విషయాన్ని సీఓఏ కోర్టు దృష్టికి తీసుకుపోలేదు. నాకు కనీస సమాచారం లేకుండా సీఓఏ తమ లాయర్‌ను మార్చేసింది కూడా. క్రికెటర్ ఉండాలి: సీఓఏలో ఒక పురుష క్రికెటర్ లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వచ్చాయి. బిషన్‌సింగ్ బేడీ, వెంకట్రాఘవన్ పేర్లు నేను చెప్పినా 70 ఏళ్లు దాటాయని చెప్పి తీసుకోలేదు. నేను జవగళ్ శ్రీనాథ్ పేరు చెప్పాను. నా స్థానంలో కమిటీలో క్రికెటర్ వస్తాడని ఆశిస్తున్నా. నాకేమీ తెలీదు.. శ్రీనాథ్: మరోవైపు సీఓఏలో తాను సభ్యుడైతే బాగుంటుందంటూ గుహ చేసిన సూచనపై జవగళ్ శ్రీనాథ్ మాట్లాడుతూ... ‘ఆ ప్రతిపాదన గురించి నాకేమీ తెలీదు. దానికి సంబంధించి నా మనసులో ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తా’ అని అన్నారు. కుంబ్లే, కోహ్లి వివాదం గురించి చర్చించేందుకు ఇది సరైన సమయం కాదన్న శ్రీనాథ్, భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే అన్నింటికంటే ముఖ్యమన్నారు. ధోనికి కాంట్రాక్ట్ భారత క్రికెట్లో ఉన్న సూపర్ స్టార్ సంస్కృతి ధోనికి వరంలా మారింది. తాను టెస్టులు ఆడలేనంటూ స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతనికి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వడంలో అర్థం లేదు. ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. దీనిని కూడా నేను విరోధించాను. సూపర్ స్టార్ కెప్టెన్ కోచ్‌పై తమకు ప్రత్యేక అధికారం ఉందని సీనియర్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ప్రొఫెషనల్ క్రీడల్లో ప్రపంచంలో ఏ దేశంలో, ఏ క్రీడలో కూడా ఇలాంటిది జరగదు. సూపర్ స్టార్ సంస్కృతి ఇప్పటికే అదుపు తప్పిపోయింది.ఎక్కడా లేని విధంగా కోచ్‌లు, కామెంటేటర్ల ఎంపిక విషయంలో ఆటగాళ్లు జోక్యం చేసుకోవడం ఏమిటి ? (కోహ్లిపై వ్యాఖ్యలతోనే గతంలో హర్షా భోగ్లేపై వేటు పడింది). రేపు సెలక్టర్లు, ఆఫీస్ బేరర్లను కూడా వారే ఎంపిక చేస్తారేమో? కెప్టెన్, కోచ్ మధ్య విభేదాలు ఉన్నాయని భావిస్తే ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన వెంటనే కొత్త కోచ్ గురించి చర్చించాల్సింది. ఇప్పుడు ప్రధాన టోర్నీకి ముందు ఆ అంశాన్ని తీసుకొస్తారా? కుంబ్లే వ్యవహారంలో బోర్డు చాలా నిర్దాక్షిణ్యంగా, ప్రొఫెషనలిజానికి విరుద్ధంగా వ్యవహరించింది. దురదృష్టవశాత్తూ సీఓఏ కూడా ఈ సమయంలో చురుగ్గా పని చేయడంలో విఫలమైంది. -
రాహుల్ సభ కోసం పంట ధ్వంసం
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ కోసం కర్ణాటకలో చేతికొచ్చిన పంటపొలాన్ని ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది. ఓ నిరుపేద రైతు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజోన్న పంటను రాహుల్ సభ కోసం కోతలు కోసే సమయానికి నరికివేసి ప్రాంగణం సిద్ధం చేశారు. విచిత్రమేమిటంటే కరువు కారణంగా పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి రాహుల్ ఈ సభను తలపెట్టారు. మధ్య కర్ణాటకలోని రానిబిన్నూర్ సమీపంలో నిర్వహించనున్న శనివారం ఈ సభ కోసం దాదాపు మూడు ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన ప్రదేశంలో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సభాప్రాంగణానికి సమీపంలో ఉన్న ఓ బక్క రైతు తన నాలుగు ఎకరాల పొలంలో పండించిన మొక్కజోన్న పంటను నరికేశారు. 15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా ఈ చర్యకు ఒడిగట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయంలో తెలిసిందే. రాహుల్ సభ కోసం చేతికొచ్చిన పంటను ధ్వంసం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మొదట స్పందించిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ "రాహుల్ వచ్చిపోయే సభాప్రాంగణం కోసం ఒక బక్కరైతు తన విలువైన పంటపొలాన్ని కోల్పోయాడు' అని ట్వీట్ చేశారు. హెలికాప్టర్ ద్వారా కర్ణాటకకు చేరుకొని తొమ్మిది కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి రాహుల్ ఆత్యహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అయితే తమకు ఇబ్బందికలుగని ప్రాంతాలలోనే రాహుల్ పాదయాత్ర సాగేవిధంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసినట్టు విమర్శలు వినవస్తున్నాయి.