భారత క్రికెట్‌లో ‘సూపర్‌ స్టార్‌’ సంస్కృతి | Ram Guha Questions Virat's 'Veto Power' In Coach Selection Process | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌లో ‘సూపర్‌ స్టార్‌’ సంస్కృతి

Published Sat, Jun 3 2017 1:30 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

భారత క్రికెట్‌లో ‘సూపర్‌ స్టార్‌’ సంస్కృతి

భారత క్రికెట్‌లో ‘సూపర్‌ స్టార్‌’ సంస్కృతి

► వాళ్లు ఏం చేసినా చెల్లుతోంది
► కోచ్‌ ఎంపికతో కోహ్లికి ఏం పని?
► ధోని, గంగూలీ, ద్రవిడ్‌లదీ తప్పే
► రామచంద్ర గుహ తీవ్ర వ్యాఖ్యలు


క్రికెట్‌ చరిత్రకారుడు బీసీసీఐ చరిత్రను తవ్వే పనిలో పడ్డారు. పదవి నుంచి తప్పుకుంటూ భారత దిగ్గజాల వ్యవహార శైలిని ఘాటుగా ప్రశ్నిస్తూ పోయారు. కోర్టు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడంలో సీఓఏ వైఫల్యాన్ని కూడా గుర్తు చేశారు. పరిపాలకుల కమిటీ నుంచి తప్పుకుంటూ తన రాజీనామా లేఖలో అనేక అంశాలను రామచంద్ర గుహ ప్రస్తావించారు. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... గుహ లేవనెత్తిన అంశాలు భారత క్రికెట్‌లో మళ్లీ చర్చకు దారి తీయడం ఖాయం.  

న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ భారత క్రికెట్‌ పని తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరిపాలకుల కమిటీ (సీఓఏ) నలుగురు సభ్యులలో ఒకరిగా ఉన్న గుహ, వ్యక్తిగత కారణాల పేరుతో గురువారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే తన రాజీనామా సమయంలో కమిటీ చైర్మన్‌ వినోద్‌ రాయ్‌కు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. తాను సభ్యుడిగా ఉన్న గత నాలుగు నెలల కాలంలో తాను పరిశీలించిన అంశాలను ఆయన రాయ్‌ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ లేఖలో ఆయన ప్రశ్నించిన కొన్ని ప్రధాన అంశాలను సంక్షిప్తంగా చూస్తే...

కోచ్‌ల కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌
భారత జట్టుకు కోచ్‌లుగా పని చేసేవారు ఐపీఎల్‌ జట్లకూ కోచ్‌గా వ్యవహరించడం సరికాదు. అవసరమైతే వారికి కొంత అదనపు మొత్తం చెల్లించవచ్చు. రాహుల్‌ ద్రవిడ్, ఆర్‌.శ్రీధర్, సంజయ్‌ బంగర్, భరత్‌ అరుణ్‌లకు ఈ విషయంలో బోర్డు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చింది. పది నెలల కాంట్రాక్ట్‌ మాత్రమే ఇస్తూ వారు ఐపీఎల్‌లో పని చేసే విధంగా సడలింపు ఇస్తున్నారు. ఇదంతా అనైతిక వ్యవహారం. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో జూనియర్‌ క్రికెటర్ల క్యాంప్‌ ఉంటే ఒక కోచ్‌ ఐపీఎల్‌ ఉందని వెళ్లిపోయారు. సీఓఏ సమావేశాల్లో పలు మార్లు ఈ అంశాన్ని నేను ప్రస్తావించినా పట్టించుకోలేదు.

కామెంటేటర్ల కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌
సునీల్‌ గావస్కర్‌ పీఎంజీ అనే ప్లేయర్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి యజమా ని. అది శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అదే గావస్కర్‌ బీసీసీఐ కామెంటరీ టీమ్‌లో సభ్యుడిగా వారి గురించి వ్యాఖ్యానిస్తారు. ఇది పూర్తిగా తప్పు. ఆయన రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కావాలి. ఒక ప్రఖ్యాత క్రికెటర్‌ (సౌరవ్‌ గంగూలీ) ఒక క్రికెట్‌ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మళ్లీ కామెంటరీ కూడా చేస్తే ఎలా?

దేశవాళీలో తక్కువ చెల్లింపులు
ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడితే ఆటగాడికి రూ.1.14 లక్షలు లభిస్తాయి. అయితే పది వేలు మాత్రమే ముందుగా ఇస్తారు. మిగతావన్నీ వాయిదాల్లోనే. ఐపీఎల్‌ లేకుండా దీనిపైనే బతికే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీనిని ఒక క్రమపద్ధతిలో ఉంచాలి. కొన్నిసార్లు రాష్ట్ర సంఘాలు ఆటగాళ్లకు పూర్తి మొత్తాలు కూడా ఇవ్వడం లేదు.

సీఓఏ సరిగా పని చేయలేదు
కొన్ని అంశాల్లో మా సీఓఏ కూడా చురుగ్గా వ్యవహరించలేదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అనర్హులైన అనేక మంది బోర్డు, రాష్ట్ర సంఘాల ఆఫీస్‌ బేరర్లు స్వేచ్ఛగా సమావేశాలకు హాజరయ్యారు. వీరిలో కొందరు అతిగా చొరవ చూపించి చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి తప్పుకోవాలని ప్రచారం చేశారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చాయి కూడా. అయితే ఈ విషయాన్ని సీఓఏ కోర్టు దృష్టికి తీసుకుపోలేదు. నాకు కనీస సమాచారం లేకుండా సీఓఏ తమ లాయర్‌ను మార్చేసింది కూడా.

క్రికెటర్‌ ఉండాలి: సీఓఏలో ఒక పురుష క్రికెటర్‌ లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వచ్చాయి. బిషన్‌సింగ్‌ బేడీ, వెంకట్రాఘవన్‌ పేర్లు నేను చెప్పినా 70 ఏళ్లు దాటాయని చెప్పి తీసుకోలేదు. నేను జవగళ్‌ శ్రీనాథ్‌ పేరు చెప్పాను. నా స్థానంలో కమిటీలో క్రికెటర్‌ వస్తాడని ఆశిస్తున్నా.  

నాకేమీ తెలీదు.. శ్రీనాథ్‌: మరోవైపు సీఓఏలో తాను సభ్యుడైతే బాగుంటుందంటూ గుహ చేసిన సూచనపై జవగళ్‌ శ్రీనాథ్‌ మాట్లాడుతూ... ‘ఆ ప్రతిపాదన గురించి నాకేమీ తెలీదు. దానికి సంబంధించి నా మనసులో ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తా’ అని అన్నారు. కుంబ్లే, కోహ్లి వివాదం గురించి చర్చించేందుకు ఇది సరైన సమయం కాదన్న శ్రీనాథ్, భారత్‌ చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడమే అన్నింటికంటే ముఖ్యమన్నారు.  

ధోనికి కాంట్రాక్ట్‌
భారత క్రికెట్‌లో ఉన్న సూపర్‌ స్టార్‌ సంస్కృతి ధోనికి వరంలా మారింది. తాను టెస్టులు ఆడలేనంటూ స్వయంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత కూడా అతనికి ‘ఎ’ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వడంలో అర్థం లేదు. ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. దీనిని కూడా నేను విరోధించాను.

సూపర్‌ స్టార్‌ కెప్టెన్‌
కోచ్‌పై తమకు ప్రత్యేక అధికారం ఉందని సీనియర్‌ ఆటగాళ్లు భావిస్తున్నారు.  ప్రొఫెషనల్‌ క్రీడల్లో ప్రపంచంలో ఏ దేశంలో, ఏ క్రీడలో కూడా ఇలాంటిది జరగదు. సూపర్‌ స్టార్‌ సంస్కృతి ఇప్పటికే అదుపు తప్పిపోయింది.ఎక్కడా లేని విధంగా కోచ్‌లు, కామెంటేటర్ల ఎంపిక విషయంలో ఆటగాళ్లు జోక్యం చేసుకోవడం ఏమిటి ? (కోహ్లిపై వ్యాఖ్యలతోనే గతంలో హర్షా భోగ్లేపై వేటు పడింది).

రేపు సెలక్టర్లు, ఆఫీస్‌ బేరర్లను కూడా వారే ఎంపిక చేస్తారేమో? కెప్టెన్, కోచ్‌ మధ్య విభేదాలు ఉన్నాయని భావిస్తే ఆస్ట్రేలియాతో సిరీస్‌ ముగిసిన వెంటనే కొత్త కోచ్‌ గురించి చర్చించాల్సింది. ఇప్పుడు ప్రధాన టోర్నీకి ముందు ఆ అంశాన్ని తీసుకొస్తారా? కుంబ్లే వ్యవహారంలో బోర్డు చాలా నిర్దాక్షిణ్యంగా, ప్రొఫెషనలిజానికి విరుద్ధంగా వ్యవహరించింది. దురదృష్టవశాత్తూ సీఓఏ కూడా ఈ సమయంలో చురుగ్గా పని చేయడంలో విఫలమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement