![Bajrang Punia And Ravi Dahiya Win World Wrestling Championships - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/21/da.jpg.webp?itok=oTObMaDu)
ఆతిథ్య నిర్వాకం బజరంగ్ స్వర్ణావకాశాన్నే దెబ్బతీసింది. కానీ పతకాల పూనియా ఘన చరిత్రను మాత్రం అడ్డుకోలేకపోయింది. రోజు వ్యవధిలోనే తనకెదురైన చేదు అనుభవం నుంచి బయటపడిన ఈ భారత ‘ఖేల్‌రత్న’ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాడు. మెగా ఈవెంట్‌లలో అతనికిది మూడో పతకం. తద్వారా ప్రపంచ చాంపియన్íÙప్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఏకైక భారత రెజ్లర్‌గా అతను ఘనతకెక్కాడు. 2013లో కాంస్యం నెగ్గిన బజరంగ్ గతేడాది రజతం సాధించాడు.
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు) ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కంచుమోత మోగించారు. శుక్రవారం జరిగిన కాంస్య పతక బౌట్‌లలో బజరంగ్ 8–7తో తుల్గతుముర్ ఒచిర్ (మంగోలియా) పై... రవి 6–3తో ఆసియా చాంపియన్ రెజా అహ్మదాలీ అట్రినగర్చి (ఇరాన్)పై గెలిచారు. అయితే వెటరన్ స్టార్ సుశీల్ కుమార్‌కు (74 కేజీలు) తొలి రౌండ్లోనే షాక్ ఎదురైంది. బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సుశీల్ 2010లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. అయితే ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్íÙప్‌లో బరిలోకి దిగిన 36 ఏళ్ల సుశీల్‌కు ఈసారి తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. గద్జియెవ్ (అజర్‌బైజాన్)తో జరిగిన తొలి రౌండ్ బౌట్‌లో సుశీల్ 9–11తో ఓడిపోయాడు. ఒకదశలో 9–4తో ఆధిక్యంలో నిలిచిన సుశీల్ ఆ తర్వాత వరుసగా ఏడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు.
సుశీల్‌పై గెలిచిన ఖద్జిమురద్ క్వార్టర్స్‌లో ఓడిపోవడంతో భారత రెజ్లర్‌కు ‘రెపిచేజ్’ అవకాశం లేకుండా పోయింది. మిగతా పోటీల్లో 125 కేజీల ఈవెంట్‌లో సుమిత్ 0–2తో లిగెటి (హంగేరి) చేతిలో... 70 కేజీల బౌట్‌లో కరణ్ 0–7తో నవ్రుజోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... 92 కేజీల కేటగిరీలో ప్రవీణ్ 0–8తో సగలిక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయారు. 65 కేజీల కేటగిరీలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బజరంగ్ ఆఖరిదాకా ‘పట్టు’ సడలించకుండా తలపడి గెలిచాడు. గురువారం సెమీఫైనల్ బౌట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి బయటపడిన ఈ చాంపియన్ రెజ్లర్ ఈ బౌట్‌లో 8–7తో మంగోలియాకు చెందిన తుల్గ తుముర్ ఒచిర్‌పై విజయం సాధించాడు. ఒకదశలో 2–6తో వెనుకబడిన బజరంగ్ ఆ తర్వాత దూకుడు పెంచి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 8–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి నిమిషంలో ఒక పాయింట్ కోల్పోయిన బజరంగ్ ఒక పాయింట్ తేడాతో విజయాన్ని అందుకున్నాడు. సెమీస్ చేరడంతోనే బజరంగ్‌తో పాటు రవి కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment