బ్యాంక్రాఫ్ట్ వీరోచిత సెంచరీ
ఆస్ట్రేలియా ‘ఎ’కు భారీ ఆధిక్యం అపరాజిత్‌కు 5 వికెట్లు
చెన్నై: భారత్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బ్యాంక్రాఫ్ట్ (267 బంతుల్లో 150; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగడంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 103 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు చేసింది. కీఫీ (6 బ్యాటింగ్), ఫెకిటి (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కంగారూలు 194 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. 43/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆసీస్‌కు... బ్యాంక్రాఫ్ట్, ఖాజా (33) తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.
తర్వాత ఓజా చకచకా రెండు వికెట్లు తీసినా... ఫెర్గుసన్ (103 బంతుల్లో 54; 8 ఫోర్లు) మెరుగ్గా ఆడటంతో ఆసీస్ ఇన్నింగ్స్ తడబాటు లేకుండా సాగింది. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో 14, 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి క్యాచ్‌లు జారవిడిచడంతో ఊపిరి పీల్చుకున్న ఫెర్గుసన్.... బ్యాంక్రాఫ్ట్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 107 పరుగులు జోడించి అవుటయ్యాడు.అద్భుతమైన స్ట్రోక్స్‌తో చెలరేగిన బ్యాంక్రాఫ్ట్ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో నాలుగో శతకాన్ని నమోదు చేశాడు. అయితే భారీ స్కోరు దిశగా సాగుతున్న కంగారూలకు ఆఫ్ స్పిన్నర్ అపరాజిత్ కాస్త అడ్డుకట్ట వేశాడు. స్వల్ప వ్యవధిలో స్టోనిస్ (10), వేడ్ (11)లతో పాటు బ్యాంక్రాఫ్ట్, సంధూ (36), ఎగర్ (6)లను అవుట్ చేశాడు. అపరాజిత్ 5, ఓజా 3, గోపాల్ ఒక్క వికెట్ తీశారు.