
భారత అభిమానిపై బంగ్లాలో దాడి
ఢాకా: సుధీర్ గౌతమ్... ఒంటి నిండా త్రివర్ణ రంగులతో పాటు చేతిలో భారీ జాతీయ జెండాను పట్టుకుని భారత్ ఎక్కడ క్రికెట్ మ్యాచ్‌లు ఆడినా కచ్చితంగా స్టేడియంలో కనిపించే వీరాభిమాని. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న తనకు అక్కడి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం రెండో వన్డే ముగిసిన అనంతరం స్టేడియం బయట అతడిపై దాడి జరిగింది. పెద్ద ఎత్తున బంగ్లా అభిమానులు గుమిగూడి అతడిని దుర్భాషలాడారు. ‘స్టేడియం నుంచి బయటకు వెళ్లగానే నన్ను కొద్ది మంది చుట్టుముట్టి జాతీయ పతాకాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. హ్యాండిల్‌ను పగులగొట్టారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే నాకు రక్షణగా వచ్చి బయట ఆటో రిక్షా ఎక్కించారు. అయినా వారు ఆగకుండా ఆటోను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిం చారు. రాళ్లు కూడా విసిరినప్పటికీ గాయం కాకుండా తప్పించుకోగలిగాను’ అని సుధీర్ తెలిపాడు.