మరో విజయమే లక్ష్యంగా... | Bangladesh vs India Womens T20 WORLD CUP Match Today | Sakshi
Sakshi News home page

మరో విజయమే లక్ష్యంగా...

Feb 24 2020 4:13 AM | Updated on Feb 24 2020 2:50 PM

Bangladesh vs India Womens T20 WORLD CUP Match Today - Sakshi

ప్రపంచ కప్‌ వేటలో భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆరంభ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించిన భారత్‌... నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రెండు జట్ల బలాబలాలు పరిశీలిస్తే మనదే పైచేయిగా కనిపిస్తున్నా... ఆదమరిస్తే మాత్రం 2018 ఆసియా కప్‌ ఫైనల్‌ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. బౌలింగ్‌లో భారత్‌ బలంగా కనిపిస్తున్నా బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడంలేదు. ముఖ్యంగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఫామ్‌ కలవరపెడుతోంది. వీటిని అధిగమించి నేటి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే తర్వాత జరిగే కీలకమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు.   

పెర్త్‌: పూనమ్‌ యాదవ్‌ మ్యాజిక్‌ స్పెల్‌తో టి20 ప్రపంచ కప్‌ వేటను ఘనంగా ఆరంభించిన భారత మహిళల జట్టు నేడు ఆసియా కప్‌ చాంపియన్‌ బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలో దిగనున్న హర్మన్‌ సేన నాకౌట్‌కు మరింత చేరువ అవ్వడంతోపాటు గత ఆసియా కప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ చేతిలో ఎదురైన మూడు వికెట్ల పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సల్మా ఖాతూన్‌ సారథ్యంలోని బంగ్లాదేశ్‌ సంచలనాన్ని ఆశిస్తోంది. ఈ ఫార్మాట్‌లో భారత్‌పై ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్‌ గెలవడం వారికి కలిసొచ్చే అంశం. నేడు జరిగే మరో మ్యాచ్‌లో శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతుంది.

హర్మన్‌పైనే దృష్టి...
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ ప్రీత్, దీప్తి శర్మలతో భారత బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తున్నా... గత కొంతకాలంగా స్మృతి మాత్రమే నిలకడ చూపుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో షఫాలీ 15 బంతుల్లో 29 పరుగులు సాధించినా... తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. జెమీమా రోడ్రిగ్స్‌ కెరీర్‌ ఆరంభంలో ఆడినంత దూకుడును ప్రస్తుతం ప్రదర్శించలేకపోతుంది. ముఖ్యంగా ఫినిషర్‌గా పేరున్న హర్మన్‌ప్రీత్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో 75 స్ట్రయిక్‌ రేట్‌తో 78 పరుగులు మాత్రమే చేసింది.

దాంతో భారత్‌కు మంచి ఆరంభం లభిస్తున్నా... డెత్‌ ఓవర్లలో ధనాధన్‌ ఫినిష్‌ లభించడంలేదు. దీప్తి శర్మ నిలకడ ప్రదర్శిస్తున్నా వికెట్ల మధ్య పరుగెత్తడంలో మరింత చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే బౌన్సీ వికెట్‌గా పిలువబడే ‘వాకా’ మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుండటంతో పేసర్‌ శిఖా పాండే మరోసారి కీలకం కానుంది. ఈమెతో పాటు పూనమ్‌ యాదవ్‌ మరోసారి చెలరేగితే భారత్‌కు విజయం అంత కష్టమేమీ కాదు. మరోవైపు సల్మా ఖాతూన్, ఫర్జానా హక్, జహనర ఆలమ్‌లతో కూడిన బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయలేం. భారత్‌పై గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలనే ఉద్దేశంతో బంగ్లా బరిలో దిగనుంది.  
ఇప్పటి వరకు భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య 11 టి20లు జరిగాయి. భారత్‌ తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండింటిలో బంగ్లాదేశ్‌ నెగ్గింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement