
రెండో వన్డేలోనూ చేతులెత్తేసిన భారత్..
బంగ్లాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది.
మిర్పూర్: బంగ్లాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. వన్డే సిరీస్ బంగ్లా సొంతమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 45 ఓవర్లలో 200 పరుగులు చేసి ఆలౌటయింది. ఛేజింగ్కు దిగిన బంగ్లా బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్ లోనూ రాణించి, డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 47 ఓవర్లలో వారికి నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని 38 ఓవర్లలో సునాయాసంగా ఛేజ్ చేశారు. బంగ్లాకు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ కావడం గమనార్హం. షకీబ్ అల్ అసన్ 51 నాటౌట్, షబ్బీర్ రహ్మాన్ 22 నాటౌట్ గా ఉండి జట్టుకు విజయాన్ని అందించారు. దాస్ (36), సర్కార్ (34) లు బంగ్లా విజయంలో తోడ్పడ్డారు. ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రూబెల్ హుస్సేన్, నాసిర్ హుస్సేన్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.
రెండో వన్డేలో టీమిండియా ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది. టీమిండియా ఆటగాళ్లలో శిఖర్ ధావన్(53), మహేంద్ర సింగ్ ధోనీ(47)లు మాత్రమే కాస్త రాణించారు. సురేష్ రైనా(34), విరాట్ కోహ్లీ(23), రవీంద్ర జడేజా(19), అంబటి రాయుడు(0), రోహిత్ శర్మ(0)లు తీవ్ర నిరాశపరిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కులకర్ణి, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.