సిక్కు ఆటగాళ్ల తలపాగా తొలగింపు
నాగ్‌పూర్: ఇటీవల చైనాలో ముగిసిన ‘ఫిబా’ ఆసియా కప్‌లో భారత్ ఆటగాళ్లు ఇద్దరు జాతి వివక్షకు గురయ్యారు. మ్యాచ్‌లు ఆడాలంటే తలపాగా (టర్బన్స్) తొలగించాల్సిందేనని జట్టులోని సిక్కు ఆటగాళ్లు అమ్రిత్‌పాల్ సింగ్, అమ్‌జ్యోత్ సింగ్‌లకు నిర్వాహకులు అల్టీమేటం జారీ చేయడంతో చేసేదేమీలేక తలపాగా తీసేసి బరిలోకి దిగారు. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (ఎఫ్‌ఐబీఏ) నిబంధలన (ఆర్టికల్ 4.4.2) ప్రకారం తలకు హెల్మెట్‌గానీ, పిన్నులుగానీ, విలువైన వస్తువులుగానీ ధరించి మ్యాచ్‌లు ఆడకూడదు. వీటివల్ల ప్రత్యర్థి ఆటగాళ్లకు గాయాలు అవుతాయనే ఉద్దేశంతో ఈ నిబంధనను విధించారు.
అయితే సిక్కులు ధరించే టర్బన్స్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా దీన్ని సాకుగా చూపి నిర్వాహకులు జాతి వివక్షకు గురి చేశారు. లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు... భారత్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకునేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో టర్బన్స్‌ను తీసేసి ఆడారు. ఈ మ్యాచ్‌లో అమ్రిత్‌పాల్ 15 పాయింట్లు చేశాడు.
భారత్ జట్టు అమెరికన్ కోచ్ స్కాట్ ఫ్లెమింగ్ ఈ నిబంధనపై ఓ రోజంతా నిర్వాహకులకు నచ్చజెప్పినా మొదట ఒప్పుకొని మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు మళ్లీ షాకిచ్చారు. గతంలో ఏ టోర్నీలోనూ ఇలా టర్బన్స్‌ను తీసేయమని చెప్పకపోవడంతో ఈ ఇద్దరు ప్లేయర్లు స్వేచ్ఛగా మ్యాచ్‌లు ఆడారు. కానీ ఇప్పుడు... భారత్‌లో తప్ప బయటి దేశాల్లో మ్యాచ్‌లు ఆడబోమని చెబుతున్నారు. అయితే ఇంత జరిగినా... ఈ విషయం గురించి భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్‌ఐ)కు ఇప్పటి వరకు తెలియకపోవడం కొసమెరుపు!
బాస్కెట్‌బాల్‌లో జాతి వివక్ష
Published Thu, Jul 24 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement