కుంబ్లేకు పొడిగింపు లేదు!
►కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం
►ఎంపిక చేయనున్న క్రికెట్ సలహా కమిటీ
న్యూఢిల్లీ: కోచ్‌గా వ్యవహరించిన కాలంలో స్వదేశంలో భారత్ ఆడిన 13 టెస్టుల్లో 10 విజయాలు, ఒకటే పరాజయం. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ విజయంతో పాటు వన్డేల్లో కూడా మెరుగైన ప్రదర్శన. అయితే ఇవేవీ కూడా అనిల్ కుంబ్లేను కోచ్‌గా కొనసాగించేందుకు సరిపోలేదు. చాంపియన్స్ ట్రోఫీతో కుంబ్లే ఏడాది పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత ఉన్నవారు ఎవరైనా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత కోచ్ హోదాలో మళ్లీ తన బయోడేటాను పంపించాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటర్వూ్యకు హాజరయ్యే వెసులుబాటు మాత్రం కుంబ్లేకు బోర్డు కల్పించింది.
ఆసక్తి కలిగిన వారు ఈనెల 31లోగా అప్లై చేసుకోవాల్సిఉండగా, వీరిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఇంటర్వూ్య చేస్తారు. ‘ఈ ఎంపిక వ్యవహారం పూర్తి పారదర్శకంగా ఉండేందుకు పరిపాలక కమిటీ (సీఓఏ)కి చెందిన నామినీ పర్యవేక్షకులుగా ఉంటారు. కుంబ్లే పనితీరు బాగానే ఉంది. అయితే వచ్చే నెల 20న ఆయనతో ఒప్పంద గడువు ముగుస్తుంది. ఆ తర్వాత సహజంగా జరగాల్సిన ప్రక్రియే ఇదంతా. కుంబ్లే కూడా మరోసారి ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీసీఐలోని ఏ ఒక్కరి నిర్ణయం వల్లో కోచ్ ఎంపిక జరగదు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ ఎంపిక చేస్తారు’ అని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు.
కుంబ్లేపై అసంతృప్తి...
నిజానికి మైదానంలో జట్టు ప్రదర్శన బాగున్నా... ఇతర కారణాలు కుంబ్లేను ఆటోమెటిక్‌గా కొనసాగించేందుకు అడ్డు పడుతున్నాయి. కుంబ్లే వ్యవహార శైలిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల వేతనాలతో పాటు తన వేతనాన్ని కూడా భారీగా పెంచాలనే విషయంలో ఈ దిగ్గజ స్పిన్నర్ దూకుడుగా వెళ్లడం బోర్డుకు రుచించలేదు. ఈ కారణంగానే చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు అటు ఇంగ్లండ్‌లో అడుగుపెట్టగానే ఇటు కొత్త కోచ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం కోరుతోంది. ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.2 కోట్లు ఇస్తుండగా దీన్ని రూ.5 కోట్లకు పెంచాలని అలాగే కోచ్ వేతనం రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్లకు పెంచాలని కుంబ్లే సూచించారు. ‘కుంబ్లే ఆటగాళ్ల కోసమే కాకుండా తన కోసం కూడా బేరమాడుతున్నాడు.
ఆయన చేస్తున్న డిమాండ్లు చాలా క్లిష్టంగా ఉన్నాయి. విరాట్ కోహ్లి కోసం 25 శాతం అదనంగా ‘కెప్టెన్సీ ఫీజు’ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నాడు. అంతేకాకుండా సెలక్షన్ కమిటీలో కెప్టెన్, కోచ్‌లకు కూడా సమానస్థాయిలో హోదా, ఓటింగ్ హక్కు కావాలంటున్నాడు. ఇవన్నీ ఆయనకు సంబంధం లేని విషయాలు’ అని బోర్డుకు చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అలాగే కుంబ్లే సూచనల్లో చాలా వాటిని అమలు చేసేందుకు బోర్డు ఇష్టపడడం లేదు. బీసీసీఐ ఆదాయంనుంచి ఆటగాళ్లకు ఇస్తున్న 26 శాతం మొత్తాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
ఆఫీస్ బేరర్ల వివరాలు పంపండి: సీఓఏ
న్యూఢిల్లీ: బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు తమ ఆఫీస్ బేరర్ల వివరాలను పంపించాలని బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) ఆదేశించింది. మే 6న జరిగిన సమావేశంలోనే సీఓఏ ఈ ప్రతిపాదనను తెచ్చినా అవగాహనా లోపంతో రాష్ట్ర సంఘాలు ఇప్పటివరకు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తాజాగా గురువారం సీఓఏ మరోసారి రాష్ట్ర సంఘాలకు లేఖ రాసింది. తమ పరిధిలోని ఆఫీస్ బేరర్ల పేర్లు, పదవీ కాలం, ఇతర వివరాలను పంపించాలని కోరింది. లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై త్వరలోనే మరోసారి రాష్ట్ర సంఘాలతో భేటీ అవుతామని ఆ లేఖలో పేర్కొంది.