లండన్ : న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌పై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘న్యూజిలాండర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ కావడంపై సోషల్ మీడియా వేదికగా స్టోక్స్ స్పందించాడు. న్యూజిలాండ్ అత్యుత్తమ పురస్కారానికి నామినేట్ అవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. కానీ ఈ అవార్డు అందుకోవడానికి తన కంటే కివీస్‌లో ఎంతో మంది గొప్పవాళ్లు ఉన్నారన్నాడు. ముఖ్యంగా విలియమ్సన్ ఈ అవార్డుకు అన్ని విధాల అర్హుడంటూ పేర్కొన్నాడు. తన ఓటు కూడా కివీస్ సారథికే అంటూ స్పష్టం చేశాడు. ఇక విలియమ్సన్ కివీస్ లెజెండ్ అంటూ అభివర్ణించాడు.
‘న్యూజిలాండ్ దేశ ప్రజలు కేన్ విలియమ్సన్‌కు మద్దతుగా నిలవాలి. అతడు కివీస్ లెజెండ్. ప్రపంచకప్‌లో కివీస్‌ను ముందుండి నడిపించాడు. సారథిగా, ఆటగాడిగా అద్బుత ప్రదర్శన కనబర్చాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ గెలుచుకున్నాడు. నాలాంటి ఎంతో మంది క్రికెటర్లుకు ఆదర్శంగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లో ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో గొప్ప క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. ఈ అవార్డుకు నా కంటే విలియమ్సనే అర్హుడు. నా ఓటు కూడా విలియమ్సన్‌కే’అంటూ స్టోక్స్ వివరించాడు.
ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌కు తొలిసారి అందించిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వాస్తవానికి న్యూజిలాండ్ దేశస్తుడు. క్రైస్ట్‌చర్చ్‌లో పుట్టిన స్టోక్స్ 12 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ గతంలో కివీస్ రగ్బీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని ఒక రగ్బీ జట్టుకు కోచ్‌గా పనిచేసేందుకు కుటుంబంతో సహా వలస వెళ్లాడు. బెన్ స్టోక్స్‌కు ఇంగ్లండ్‌లోనే క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు. స్టోక్స్ స్వతహాగా న్యూజిల్యాండర్ కావడంతో ఆ దేశం ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment