బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్?
న్యూఢిల్లీ: గతంలో భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా పని చేసిన భరత్ అరుణ్ కు మరోసారి ఆ బాధ్యతల్ని అప్పజెప్పేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రిని నియమించిన తరువాత భరత్ అరుణ్ పేరు ప్రధానంగా వినిపించింది. బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ఎంపికపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) సైతం దిగివచ్చింది. జహీర్ పూర్తిస్థాయి కోచ్ కాదని, కేవలం 150 రోజుల పాటు మాత్రమే బౌలింగ్ కన్సల్టెంట్ గా సేవలందిస్తాడని మాట మార్చింది. మరొకవైపు విదేశాల్లో మాత్రమే జహీర్ సేవల్ని ఉపయోగించుకుంటామని కూడా తెలిపింది. ఇందుకు కారణం బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ)నే.
భారత ప్రధాన కోచ్ ఎంపిక బాధ్యతల్ని మాత్రమే సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లతో కూడిన సీఏసీకి అప్పచెపితే, బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్ ను సైతం ప్రకటించడంపై వినోద్ రాయ్ నేతృత్వంలో సీవోఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో ఆ ఇద్దరి ఎంపికపై నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది. ఇక్కడ కేవలం రవిశాస్త్రి ఎంపికను మాత్రమే సీవోఏ పూర్తిస్థాయి సమర్ధించింది. సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే బాధ్యతను ప్రధాన కోచ్ కు అప్పచెప్పాలంటూ సీఏసీకి సూచించింది.
మరొకవైపు జహీర్ పూర్తిస్థాయిలో బౌలింగ్ సేవల్ని అందించడానికి కూడా సుముఖంగా లేడు. కాగా, రవిశాస్త్రి మాత్రం తనకు ఫుల్ టైమ్ కోచ్ కావాలంటూ పట్టుబడుతున్నాడు. దాంతో బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ఎంపిక ఖాయమైనట్లే కనబడుతోంది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ పాలకుల కమిటీతో రవిశాస్త్రి సమావేశమై తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసే అవకాశాలు కనబడుతున్నాయి.మరి రవిశాస్త్రి పంతం నెగ్గుతుందో లేదో చూడాలి.