భువనేశ్వర్ మారిపోయాడు! | Bhubaneswar Kumar key role of Foreign Tour | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్ మారిపోయాడు!

Published Wed, Nov 22 2017 11:58 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

Bhubaneswar Kumar key role of Foreign Tour - Sakshi

‘భారత జట్టు ఆడే ప్రతీ టెస్టులో ఉండే అర్హత భువనేశ్వర్‌ కుమార్‌కు ఉంది. మా ప్రణాళికల్లో, ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో అతను కీలక భాగం కానున్నాడు’ కోల్‌కతా టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ గురించి మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంస ఇది. శ్రీలంకతో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భువీ ప్రదర్శన తర్వాత కెప్టెన్‌ అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వన్డేలు, టి20ల్లో భువనేశ్వర్‌ ఆటపై అభినందనలు కొత్త కాకపోయినా... ఈసారి టెస్టు మ్యాచ్‌లో ప్రదర్శన ఒక్కసారిగా భువీ స్థాయిని పెంచేసింది. తన కెప్టెన్సీలో ఏడో టెస్టు మ్యాచ్‌ ఆడిన భువీపై కోహ్లి మొదటిసారి పూర్తి స్థాయిలో విశ్వాసం ప్రకటించడం విశేషం. రాబోయే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలను దృష్టిలో ఉంచుకొని అతను ఈ వ్యాఖ్యలు చేయగా... మారిన ఆటతీరుతో భువనేశ్వర్‌ కూడా దానికి తగిన అర్హత ఉందని నిరూపించుకున్నాడు.

సాక్షి క్రీడా విభాగం: భువనేశ్వర్‌ కుమార్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించి సరిగ్గా ఐదేళ్లవుతుంది. ఈ మధ్య కాలంలో వన్డేల్లో, టి20ల్లో అతను తనదైన ముద్ర చూపించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను మొదట్లోనే పడగొట్టి శుభారంభం ఇచ్చినా... డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా చివర్లో కట్టడి చేసి మన జట్టుకు విజయం అందించినా అది భువీకే చెల్లింది. వన్డేల్లో బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తున్న ఈ రోజుల్లోనూ కేవలం 4.94 ఎకానమీతో అతని బౌలింగ్‌ సాగుతుండటం చూస్తే పరుగులు ఇవ్వడంలో భువీ ఎంత పొదుపరినో అర్థమవుతోంది. అయితే టెస్టులకు సంబంధించి మాత్రం భువనేశ్వర్‌ ఆ నమ్మకాన్ని కలిగించలేకపోయాడు. పిచ్‌ స్వింగ్‌కు అనుకూలిస్తుందని కచ్చితంగా అనిపించినప్పుడు మాత్రమే తుది జట్టులో అతనికి చోటు దక్కుతూ వచ్చింది. ఎవరికైనా ప్రత్యామ్నాయంగానే తప్ప రెగ్యులర్‌ బౌలర్‌గా స్థానం లేకపోవడంతో భువీ ఇప్పటికి 19 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. అయితే వచ్చే సిరీస్‌లలో భారత్‌ ఆడే ప్రతీ టెస్టులోనూ అతను ఉండే అవకాశం ఉంది.  

ఇంగ్లండ్‌లో చెలరేగినా...
భువీ కెరీర్‌లో తొలి ఆరు టెస్టుల్లో సొంతగడ్డపై అంతంత మాత్రం ప్రదర్శనే కనబర్చాడు. వీటిలో మొత్తం 9 వికెట్లు మాత్రమే అతను పడగొట్టగలిగాడు. అయితే కొంత విరామం తర్వాత అతనికి 2014 ఇంగ్లండ్‌ సిరీస్‌లో అవకాశం దక్కింది. అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రధానంగా స్వింగ్‌పై ఆధారపడే తన బౌలింగ్‌ శైలి కలగలిసి భువీ చెలరేగిపోయాడు. ఐదు టెస్టుల్లో కేవలం 26.63 సగటుతో 19 వికెట్లు పడగొట్టి భారత్‌ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ముఖ్యంగా లార్డ్స్‌ టెస్టులో భారత్‌ చారిత్రాత్మక విజయంలో అతని 6 వికెట్ల పాత్ర కూడా ఉంది. అయితే కాలి మడమ గాయానికి తోడు వన్డేల్లో వైఫల్యం కారణంగా 2015లో అతను ఒక్క టెస్టుకే (సిడ్నీ) పరిమితమై అందులోనూ విఫలమయ్యాడు. ఇక ఆ తర్వాతి నుంచి టెస్టు జట్టులో రెగ్యులర్‌గా చోటు కరువైంది. అయితే లోపాలు సరిదిద్దుకొని దాదాపు ఏడాదిన్నర తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన అతను 7 టెస్టుల్లో మూడు సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను నమోదు చేయడం విశేషం. సీమ్‌ బౌలింగ్‌కు అనుకూలించిన గ్రాస్‌ ఐలెట్‌లో (వెస్టిండీస్‌పై) 6 వికెట్లు, గత ఏడాది కోల్‌కతాలో (న్యూజిలాండ్‌)పై 6 వికెట్లు, ఇప్పుడు కోల్‌కతాలోనే లంకపై 8 వికెట్లు తన సత్తాను చూపిస్తున్నాయి.  

బలం, వేగం పెరిగాయి...
కెరీర్‌ ఆరంభంలో భువనేశ్వర్‌ శారీరక దారుఢ్యం అంత గొప్పగా లేదు. బౌలింగ్‌లో కూడా గంటకు 125 కి.మీ. సాధారణ వేగంతో మిలిటరీ మీడియం పేస్‌తోనే అతను తన ఆట కొనసాగించాడు. అయితే వికెట్‌కు ఇరు వైపులా బంతిని స్వింగ్‌ చేయగల సామర్థ్యం భువీకి వికెట్లు తెచ్చి పెట్టింది. రెండేళ్ల క్రితం వేగం పెంచుకునే ప్రయత్నంలో తన బలమైన స్వింగ్‌ను కూడా కోల్పోయి రెండు రకాలుగా అతను నష్టపోయాడు. అయితే ఆ తర్వాత అతను తన లోపాలు సరిదిద్దుకున్నాడు. ముందుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఫాస్ట్‌ బౌలర్‌కు తగిన విధంగా తన శరీరాన్ని మలచుకున్నాడు. ‘అతని బౌలింగ్‌లో వేగం పెరిగింది. అతని బంతి బ్యాట్‌కు చాలా బలంగా కూడా తగులుతోంది’ అని కోహ్లి చెప్పడం భువీలో వచ్చిన మార్పును సూచిస్తోంది. ప్రస్తుతం భువనేశ్వర్‌ బౌలింగ్‌ వేగం గంటకు 140 కిలోమీటర్లకు పెరగడం విశేషం. నిజానికి చాలా మంది పేసర్లు ఆరంభంలో బాగా వేగంగా బంతులు విసిరినా... రాన్రాను గాయాల భయంతోనో, మరో కారణంగానో వారిలో వేగం తగ్గిపోతుంది. కానీ భువీ అందుకు రివర్స్‌లో వేగం పెంచుకోవడం అసాధారణం అని మాజీ సెలక్టర్‌ విక్రమ్‌ రాథోడ్‌ చేసిన వ్యాఖ్య భువీ గురించి చెబుతోంది.  

దక్షిణాఫ్రికా పిలుస్తోంది...
‘తన బలం స్వింగ్‌ను ఎక్కడా కోల్పోకుండా దానికి వేగాన్ని కూడా జోడించడంతో ఇప్పుడు భువనేశ్వర్‌ ప్రమాదకరంగా మారాడు. సాంకేతికంగా చూస్తే అతను మణికట్టును వాడే తీరు అటు అవుట్‌ స్వింగర్, ఇటు ఇన్‌స్వింగర్‌ను అద్భుతంగా వేయడానికి ఉపయోగపడుతుంది’... మారిన భువీ ఆట గురించి భారత మాజీ పేసర్, కోచ్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ విశ్లేషణ ఇది. తాజా ప్రదర్శనను బట్టి చూస్తే దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేయగల సామర్థ్యం అతనికి ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. తన స్వల్ప కెరీర్‌లో భువనేశ్వర్‌ ఇంకా దక్షిణాఫ్రికాతో ఒక్క టెస్టు కూడా ఆడలేదు. అయితే ఇప్పుడు సఫారీ గడ్డపై తన సత్తాను ప్రదర్శించడంతో పాటు 2018లో ఇతర విదేశీ పర్యటనల్లో కూడా భారత రాతను మార్చడంలో కీలకం అవుతాడనడంలో సందేహం లేదు.  

పెళ్లి కొడుకాయెనె...
స్వస్థలం మీరట్‌లో నేడు భువనేశ్వర్‌ వివాహం జరగనుంది. తన చిన్ననాటి స్నేహితురాలు నుపుర్‌ నాగర్‌ను గురువారం అతను వివాహమాడనున్నాడు. పెళ్లి కారణంగా శ్రీలంకతో జరిగే తర్వాతి రెండు టెస్టులకు కూడా భువీ దూరమయ్యాడు. భువీ వివాహ నేపథ్యంలో ‘మా జట్టులో మరో పులి బిడ్డ ఇకపై భార్యకు బానిస కాబోతున్నాడు’ అని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సరదా వ్యాఖ్యతో అతడిని ఆట పట్టించగా...‘దానిని ప్రేమ అంటారు’ అంటూ భువీ అదే రీతిలో జవాబిచ్చాడు.

నేను కెరీర్‌ ఆరంభంలో స్వింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడేవాడిని. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ ఇంకా ఎక్కడ మెరుగవ్వాలో నేర్పిస్తుంది. నా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఫలితాలను అందిస్తోంది. 
– భువనేశ్వర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement