
పీలేకు ఘనస్వాగతం
కోల్‌కతా: ఫుట్‌బాల్ దిగ్గజం పీలేకు భారత్‌లో ఘనస్వాగతం లభించింది. 38 ఏళ్ల అనంతరం ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చిన ఆయనకు స్థానిక అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ‘పీలే.. పీలే’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆయన్ని స్వాగతించారు. దీనికి పులకించిన 74 ఏళ్ల పీలే తన వాహనం నుంచి అందరికీ చేయి ఊపుతూ అభివాదం చేశారు. విమానాశ్రయం నుంచి పీలేను వాహనం దగ్గరికి తీసుకెళ్లడం పోలీసులకు కష్టంగా మారింది. రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం, నిర్వాహకులు పీలేకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఆదివారం ఆయన ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా పూర్తిగా హోటల్‌కే పరిమితమయ్యారు. 1977లో మోహన్ బగాన్‌తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడేందుకు పీలే తొలిసారి కోల్‌కతాకు వచ్చారు.