
హీరో హేల్స్
ఇంగ్లండ్ తరఫున తొలి శతకం
శ్రీలంకపై అద్భుత విజయం
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ గడ్డపై శ్రీలంకకు లభిస్తున్న అప్రతిహత విజయాలకు ఇంగ్లండ్ జట్టు అడ్డుకట్ట వేసింది. అలెక్స్ హేల్స్ (64 బంతుల్లో 116 నాటౌట్, 11 ఫోర్లు; 6 సిక్స్) తుఫాన్ సెంచరీతో అదరగొట్టడంతో టి20 ప్రపంచకప్‌లో ఆ జట్టు బోణీ చేసింది. సున్నా పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో హేల్స్ తన అద్భుత ఆటతీరుతో ఆదుకోవడమే కాకుండా... తమ జట్టు అత్యధిక లక్ష్య ఛేదన రికార్డులోనూ పాలుపంచుకున్నాడు.
దీంతో గురువారం జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగిన గూప్ 1 మ్యాచ్‌లో బ్రాడ్ సేన ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ఇంతకుముందు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇక్కడ తాము ఆడిన చివరి 14 మ్యాచ్‌ల్లో లంకేయులకు ఓటమనేదే లేకపోవడం గమనార్హం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 189 పరుగులు సాధించింది. సీనియర్ బ్యాట్స్‌మన్ జయవర్ధనే (51 బంతుల్లో 89; 11 ఫోర్లు; 3 సిక్స్), ఓపెనర్ దిల్షాన్ (47 బంతుల్లో 55; 4 ఫోర్లు; 2 సిక్స్) రాణించారు. 15 ఓవర్లపాటు వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్లను ఆడుకోగా, రెండో వికెట్‌కు 145 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. డెర్న్‌బాచ్, జోర్డాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
హేల్స్ అదుర్స్
ఆ తర్వాత భారీ ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 190 పరుగులు చేసి నెగ్గింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే వరుస బంతుల్లో కులశేఖర రెండు వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. అయితే ఇంగ్లండ్ ఆటతీరులో మాత్రం దూకుడు తగ్గలేదు. హేల్స్, మోర్గాన్ (38 బంతుల్లో 57; 7 ఫోర్లు; 2 సిక్స్) ఏమాత్రం తడబాటు లేకుండా యథేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించారు. దీంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. 32 బంతుల్లో మోర్గాన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం కొద్దిసేపటికి కులశేఖర మరోసారి దెబ్బతీశాడు. అప్పటికి మూడో వికెట్‌కు 152 పరుగులు జత చేరాయి. అదే ఓవర్‌లో బట్లర్ వికెట్‌ను కూడా తీసిన కులశేఖర, లంక శిబిరంలో ఆనందం నింపినా...హేల్స్ తన జోరుతో వారి ఆశలను వమ్ము చేశాడు. ఓ భారీ సిక్స్‌తో 60 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత మరో సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. హేల్స్ చేసిన సెంచరీ టి20 ప్రపంచకప్‌లో ఐదోది. ఓవరాల్‌గా ఈ ఫార్మాట్‌లో పదకొండోది