
బోల్ట్... బిజీ బిజీ!
రిటైర్మెంట్ తర్వాత వ్యాపారం వైపు
లండన్: ‘నా కంపెనీ ఎనర్టర్‌లో ఇప్పుడు మీరు షేర్‌లు కొనుగోలు చేయవచ్చు’... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసు ముగిసిన మరుసటి రోజే ఉసేన్ బోల్ట్ అభిమానులకు చేసిన విజ్ఞప్తి ఇది. ట్రాక్‌ను వీడిన తర్వాత తన ఆలోచనలేమిటో బోల్ట్ స్పష్టంగా చెప్పేశాడు. ఇప్పటికే తాను భాగస్వామిగా ఉన్న, కొత్త వ్యాపారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అతను సిద్ధమవుతున్నాడు. షూస్ లోపలి భాగంలో ఉపయోగించే ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి ఇన్‌సోల్‌లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. బోల్ట్‌కు ఈ సంస్థలో వాటా ఉంది. మరోవైపు తన సొంత షూ బ్రాండ్‌ను ‘టు ద వరల్డ్’ లోగోతో తీసుకొచ్చే ఆలోచన కూడా అతనికి ఉంది.
అయితే 15 ఏళ్ల వయసు నుంచి అతనితో అనుబంధం కొనసాగిస్తున్న టాప్ స్పోర్ట్స్ బ్రాండ్ ‘పూమా’ మాత్రం బోల్ట్‌ను వదిలిపెట్టాలని భావించడం లేదు. ఇప్పటి వరకు ప్రచారకర్తగా మాత్రమే ఉన్న బోల్ట్‌ను తమ ఉద్యోగిగా మార్చుకొని కరీబియన్ దీవుల్లో వ్యాపార బాధ్యతలు అప్పజెప్పాలనుకుంటున్నట్లు ఆ సంస్థ సీఈ జోర్న్ గిల్డెన్ చూచాయగా చెప్పారు. ‘ఫోర్బ్స్’ లెక్కల ప్రకారం గత ఏడాది కాలంలో బోల్ట్ సంపాదన 34.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 218 కోట్లు). ఇందులో 10 మిలియన్ డాలర్ల వరకు ‘పుమా’నే అతనికి చెల్లిస్తోంది. జమైకాలోని కింగ్‌స్టన్‌లో బోల్ట్‌కు ‘ట్రాక్స్ అండ్ రికార్డ్స్’ పేరుతో సొంత రెస్టారెంట్ కూడా ఉంది.