![Bolt as promoter of T20 World Cup cricket tournament - Sakshi](/styles/webp/s3/filefield_paths/bolt.jpg.webp?itok=YLy3BmL-)
దుబాయ్: అథ్లెటిక్స్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు కొత్తగా క్రికెట్‌కు ప్రచారం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. జమైకాకు చెందిన బోల్ట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో జరిగే టి20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. జూన్ 1 నుంచి జరిగే ఈ టోర్నీ వెస్టిండీస్, అమెరికాలలో జరగనున్న నేపథ్యంలో విండీస్ జట్టులో భాగమైన జమైకా దేశ ప్లేయర్ బోల్ట్‌ను ఎంచుకుంది.
కొన్నేళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలికిన ఫాస్టెస్ట్ స్ప్రింటర్ బోల్ట్ పేరిటే ప్రస్తుతం 100 మీటర్లు, 200 మీటర్లు ప్రపంచ రికార్డులు నమోదై ఉన్నాయి. ‘ఈ కొత్త పాత్ర పట్ల చాలా సంతోషంగా ఉంది. అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. క్రికెట్‌ను ఎంతో ప్రేమించే కరీబియన్ దేశం నుంచి వచ్చిన నా మదిలో క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
వరల్డ్ కప్ అమెరికాలో జరగడం క్రికెట్ మార్కెట్‌ను మరింత విస్తరించేలా చేస్తుంది. అయితే టోర్నీలో మాత్రం నేను వెస్టిండీస్ జట్టుకు మద్దతు పలుకుతా’ అని బోల్ట్ వెల్లడించాడు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment