సైనా శుభారంభం
న్యూఢిల్లీ: ఫైనల్‌కు చేరితే ‘నంబర్‌వన్’ ర్యాంక్ ఖాయం కానున్న నేపథ్యంలో... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సైనా 21-5, 21-13తో క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్)పై గెలిచింది. కేవలం 28 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివానితో సైనా తలపడుతుంది. తొలి రౌండ్‌లో రుత్విక 21-7, 21-6తో క్వాలిఫయర్ రుచా నికమ్ (భారత్)పై నెగ్గింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు హైదరాబాద్‌కే చెందిన పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-17, 21-16తో సెన్‌సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)పై, కశ్యప్ 16-21, 21-19, 21-18తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై, గురుసాయిదత్ 21-14, 17-21, 23-21తో లీ డాంగ్ కున్ (కొరియా)పై గెలిచారు. భారత్‌కే చెందిన క్వాలిఫయర్ సమీర్ వర్మ 21-15, 21-17తో ప్రపంచ 9వ ర్యాంకర్ విటిన్‌గస్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించగా... తెలుగు కుర్రాడు సాయిప్రణీత్ 4-21, 18-21తో అక్సెల్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు.