picking up
-
సైనా శుభారంభం
న్యూఢిల్లీ: ఫైనల్‌కు చేరితే ‘నంబర్‌వన్’ ర్యాంక్ ఖాయం కానున్న నేపథ్యంలో... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సైనా 21-5, 21-13తో క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్)పై గెలిచింది. కేవలం 28 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివానితో సైనా తలపడుతుంది. తొలి రౌండ్లో రుత్విక 21-7, 21-6తో క్వాలిఫయర్ రుచా నికమ్ (భారత్)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు హైదరాబాద్‌కే చెందిన పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-17, 21-16తో సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్)పై, కశ్యప్ 16-21, 21-19, 21-18తో సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై, గురుసాయిదత్ 21-14, 17-21, 23-21తో లీ డాంగ్ కున్ (కొరియా)పై గెలిచారు. భారత్‌కే చెందిన క్వాలిఫయర్ సమీర్ వర్మ 21-15, 21-17తో ప్రపంచ 9వ ర్యాంకర్ విటిన్‌గస్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించగా... తెలుగు కుర్రాడు సాయిప్రణీత్ 4-21, 18-21తో అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. -
హిమాన్షు శుభారంభం
జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ కోల్‌కతా: జాతీయ సీనియర్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ హిమాన్షు జైన్ శుభారంభం చేశాడు. సోమవారం మొదలైన ఈ పోటీల్లో భాగంగా జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో హిమాన్షు 3-0 (101-69, 100-76, 100-98) ఫ్రేమ్‌ల తేడాతో కన్కన్ షంషీ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించాడు. గ్రూప్ ‘హెచ్’లో తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ ఎం.ఎన్.రంజిత్ 0-3 (68-100, 0-100, 75-100) ఫ్రేమ్‌ల తేడాతో జైవీర్ ఢింగ్రా (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐ.వి.రాజీవ్, ఎస్.శంకర్ రావు తమ లీగ్ మ్యాచ్‌ల్లో ఓటమి పాల య్యారు. రాజీవ్ 2-3 (100-59, 100-60, 92-100, 47-100, 67-100) ఫ్రేమ్‌ల తేడాతో నిఖిల్ గాడ్గే (రైల్వేస్) చేతిలో; శంకర్ రావు 0-3 (67-101, 83-100, 49-100) ఫ్రేమ్‌ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ సౌరవ్ కొఠారి (పీఎస్‌పీబీ) చేతిలో పరాజయాన్ని చవిచూశారు. -
'ప్రాక్టీస్' లో బౌలర్లు భేష్
అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనను భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ మొదటి రోజు మన ఆటగాళ్లు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టీమిండియా బౌలర్లు రాణించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 71.5 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. వరుణ్ ఆరోన్ 3 వికెట్లు పడగొట్టగా... కరణ్‌శర్మ, భువనేశ్వర్, షమీ తలా 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ధావన్ (10) పెవిలియన్ చేరగా...విజయ్ (32 బ్యాటింగ్), పుజారా (13 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అందరికీ వికెట్ టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్ తనదైన శైలిలో తొలి ఓవర్లోనే షార్ట్ (0)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. అనంతరం కార్టర్స్ (151 బంతుల్లో 58; 6 ఫోర్లు), టర్నర్ (29) రెండో వికెట్‌కు 51 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ దశలో ఆరోన్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అయితే కెల్విన్ స్మిత్ (40)తో కలిసి కార్టర్స్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. లోయర్ ఆర్డర్లో హ్యరీ నీల్సన్ (43 నాటౌట్) రాణించడంతో సీఏ స్కోరు 200 పరుగులు దాటింది. భారత బౌలర్లందరూ కనీసం ఒక వికెట్ పడగొట్టగా...వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 5 క్యాచ్‌లు పట్టి, ఒక స్టంపింగ్ చేయడం విశేషం. అనంతరం భారత ఇన్నింగ్స్‌లో ధావన్ త్వరగానే అవుటైనా... విజయ్, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. -
చెన్నైయిన్ శుభారంభం
ఫటోర్డా: దేశవాళీ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 2-1తో గోవా ఎఫ్‌సీపై విజయం సాధించింది. బల్వంత్ సింగ్ (32వ ని.), ఎలానో (42వ ని.)లో చెన్నైయిన్ జట్టుకు గోల్స్ అందించగా, ఆర్నోలిన్ గ్రెగొరి (65వ ని.) గోవా తరఫున ఏకైక గోల్ చేశాడు. ఈ టోర్నీలో గోల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా బల్వంత్ సింగ్ రికార్డులకెక్కాడు. ఆరంభంలో ఎక్కువ శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న గోవా ఆటగాళ్లు కీలక సమయంలో తడబడ్డారు. 21వ నిమిషం వరకు ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే బొజన్ జోర్డ్‌జిక్, ధ్యాన్‌చంద్ర సింగ్‌లు సమన్వయంతో కదులుతూ ఇచ్చిన పాస్‌ను బల్వంత్ అద్భుతమైన గోల్‌గా మలిచి చెన్నైయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మరో 10 నిమిషాల తర్వాత బాక్స్ బయటి నుంచి ఎలానో కొట్టిన ఫ్రీ కిక్ నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. కనీసం గోల్ కీపర్‌కు అడ్డుకునే అవకాశం కూడా లేకపోయింది. రెండో అర్ధభాగంలో గోవా అటాకింగ్‌కు దిగినా చెన్నైయిన్ డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. అయితే 65వ నిమిషంలో రాబర్ట్ పియర్స్ అందించిన క్రాస్ పాస్‌ను గ్రెగొరి నేర్పుగా గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు. ఆ తర్వాత గోల్స్ కోసం గోవా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓటమి తప్పలేదు. చెన్నైయిన్‌కు 3 పాయింట్లు లభించాయి.