చెన్నైయిన్ శుభారంభం
ఫటోర్డా: దేశవాళీ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 2-1తో గోవా ఎఫ్‌సీపై విజయం సాధించింది. బల్వంత్ సింగ్ (32వ ని.), ఎలానో (42వ ని.)లో చెన్నైయిన్ జట్టుకు గోల్స్ అందించగా, ఆర్నోలిన్ గ్రెగొరి (65వ ని.) గోవా తరఫున ఏకైక గోల్ చేశాడు. ఈ టోర్నీలో గోల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా బల్వంత్ సింగ్ రికార్డులకెక్కాడు.
ఆరంభంలో ఎక్కువ శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న గోవా ఆటగాళ్లు కీలక సమయంలో తడబడ్డారు. 21వ నిమిషం వరకు ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే బొజన్ జోర్డ్‌జిక్, ధ్యాన్‌చంద్ర సింగ్‌లు సమన్వయంతో కదులుతూ ఇచ్చిన పాస్‌ను బల్వంత్ అద్భుతమైన గోల్‌గా మలిచి చెన్నైయిన్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మరో 10 నిమిషాల తర్వాత బాక్స్ బయటి నుంచి ఎలానో కొట్టిన ఫ్రీ కిక్ నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది.
కనీసం గోల్ కీపర్‌కు అడ్డుకునే అవకాశం కూడా లేకపోయింది. రెండో అర్ధభాగంలో గోవా అటాకింగ్‌కు దిగినా చెన్నైయిన్ డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. అయితే 65వ నిమిషంలో రాబర్ట్ పియర్స్ అందించిన క్రాస్ పాస్‌ను గ్రెగొరి నేర్పుగా గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించాడు. ఆ తర్వాత గోల్స్ కోసం గోవా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఓటమి తప్పలేదు. చెన్నైయిన్‌కు 3 పాయింట్లు లభించాయి.