
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో చెన్నైయిన్ ఎఫ్‌సీ 2–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. చెన్నైయిన్ జట్టు తరఫున విల్మార్ జోర్డాన్ గిల్ (19వ నిమిషంలో), డానియల్ చిమ చుకువా (84వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. పంజాబ్ జట్టు తరఫున లూకా మాజ్కెన్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో 12 షాట్లు ఆడాయి.
అందులో ఐదేసి సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేశాయి. అయితే మ్యాచ్ ఆరంభంలోనే జోర్డాన్ గిల్ గోల్‌తో చెన్నైయిన్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పంజాబ్ జట్టు స్కోరు సమం చేసినా... మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా... చెన్నైయిన్ మరో గోల్‌తో విజయం సాధించింది. తాజా సీజన్‌లో 21 మ్యాచ్‌లు ఆడిన చెన్నైయిన్ 6 విజయాలు, 9 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 10వ స్థానంలో ఉంది.
శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో కేరళా బ్లాస్టర్స్‌పై గెలుపొందింది. జేమీ మెక్‌లారెన్ (18వ, 40వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో విజృంభించగా... అల్బర్టో రోడ్రిగోజ్ (66వ నిమిషంలో) మరో గోల్ సాధించాడు. తాజా సీజన్‌లో 21 మ్యాచ్‌లు ఆడిన మోహన్ బగాన్ జట్టు 15 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 49 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో సాగుతోంది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో మోహమ్మదన్ స్పోర్ట్స్ క్లబ్‌తో ఈస్ట్ బెంగాల్ జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment