ఇంట గెలిచేనా!
► సింధు, సైనా సత్తాకు పరీక్ష
► మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు నేటి నుంచి
► ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అద్వితీయ ఫామ్‌లో ఉన్న పీవీ సింధు స్వదేశంలో తనకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను అందుకోవాలనే లక్ష్యంతో పోరును ప్రారంభించనుంది. బుధవారం మొదలయ్యే మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో భాగంగా మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన అరుంధతి పంతవానెతో సింధు తలపడనుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదుసార్లు పోటీపడిన సింధు ఒకసారి సెమీఫైనల్‌కు (2013) చేరగా... రెండుసార్లు తొలి రౌండ్‌లో (2011, 2014) నిష్క్రమించింది. మరో రెండుసార్లు క్వార్టర్ ఫైనల్లో (2012, 2016) వెనుదిరిగింది.
అయితే ఈసారి మాత్రం టైటిలే లక్ష్యంగా ఈ హైదరాబాద్ స్టార్ బరిలోకి దిగింది. మరోవైపు ఏడోసారి ఈ టోర్నీలో అడుగుపెడుతున్న మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్‌కు ఈ టోర్నీ పరీక్షగా నిలువనుంది. తొలి రౌండ్‌లో ప్రపంచ 39వ ర్యాంకర్ చియా సిన్ లీ (చైనీస్ తైపీ)తో సైనా ఆడనుంది. తొలి రెండు రౌండ్‌లను సైనా, సింధు అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. సైనా, సింధులతోపాటు మెయిన్ ‘డ్రా’లో భారత్‌కే చెందిన శ్రీకృష్ణప్రియ, తులసి, రీతూపర్ణ దాస్, తన్వీ లాడ్ నేరుగా బరిలోకి దిగనున్నారు.
ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఏకంగా ఆరుగురు క్రీడాకారులు పోటీపడుతున్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్‌లో నిషిమోటో (జపాన్)తో సాయిప్రణీత్; సన్ వాన్ హో (కొరియా)తో సమీర్ వర్మ; జావో జున్‌పెంగ్ (చైనా)తో శ్రీకాంత్; అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో జయరామ్; ప్రణయ్‌తో సౌరభ్ వర్మ పోటీపడతారు.
మెయిన్ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత
మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, రసిక రాజే, అనురా ప్రభుదేశాయ్, శ్రేయాన్షి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో ఉత్తేజిత 21–7, 21–8తో దీపాలిపై, రసిక 21–18, 21–16తో ఆకర్షిపై, అనురా 21–13, 21–14తో దెబోరాపై, శ్రేయాన్షి 21–12, 18–21, 21–10తో వైదేహిపై గెలిచారు.