భారత్ అయ్యేనా ‘హీరో’!
నేటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ
ఆశల పల్లకిలో టీమిండియా
తొలి మ్యాచ్‌లో జర్మనీతో ‘ఢీ’
కెప్టెన్ సర్దార్, రూపిందర్ అనుమానం!
ఈ ఏడాది భారత హాకీకి అన్నీ కలిసొచ్చాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం... ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2016 రియో డి జనీరో ఒలింపిక్స్‌కు అర్హత... విశ్వవిజేత ఆస్ట్రేలియాపై తొలిసారి సిరీస్ విజయం... జూనియర్ జట్టు సుల్తాన్ జోహర్ కప్‌ను నెగ్గడం.... ఇలా వరుస విజయాలతో మన హాకీ చలాకీ అయ్యింది. ఏడాది పొడవునా నిలకడైన ప్రదర్శనతో కొత్త ఆశలు రేపిన టీమిండియా సీజన్‌ను ఘనంగా ముగించాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై శనివారం మొదలుకానున్న ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ మనోళ్లకు ఈ సువర్ణావకాశం కల్పిస్తోంది.
చాంపియన్స్ ట్రోఫీ తొలిసారి 1978లో జరిగింది. 1980 నుంచి ప్రతి ఏడాదీ ఈ టోర్నీని నిర్వహించారు. అయితే 2012లో హాకీ వరల్డ్ లీగ్‌ను ప్రవేశపెట్టడంతో ఇక నుంచి చాంపియన్స్ ట్రోఫీ రెండేళ్లకోసారి జరుగుతుంది.
భువనేశ్వర్: మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఏనాడూ ఫైనల్‌కు చేరలేదు. 1982లో మూడో స్థానం సాధించడమే టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన. ఈ సంవత్సరం గొప్ప విజయాలతో జోరుమీదున్న సర్దార్ సింగ్ బృందం సొంతగడ్డపై సత్తా చాటుకోవాలని... చాంపియన్స్ ట్రోఫీలో తమ రికార్డును మెరుగుపర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. శనివారం మొదలయ్యే ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో తలపడనుంది. ఈ టోర్నీకి ముందు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా చేయడం భారత జట్టుకు కాస్త ప్రతికూలాంశం.
వాల్ష్ పర్యవేక్షణలోనే భారత్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. వాల్ష్ నిష్ర్కమణ తర్వాత టీమిండియాకు ఎదురవుతున్న అసలు సిసలు సవాలు చాంపియన్స్ ట్రోఫీ. ఎనిమిది మేటి జట్ల మధ్య జరిగే ఈ టోర్నీలో భారత్‌కు ప్రతి మ్యాచ్ కఠినంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం భారత్ తీవ్రంగానే శ్రమించింది. మిడ్ ఫీల్డ్‌లో కెప్టెన్ సర్దార్ సింగ్... ‘డ్రాగ్ ఫ్లికర్స్’ రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్... గోల్ కీపర్ శ్రీజేష్... రక్షణశ్రేణిలో బీరేంద్ర లాక్డా, గుర్బాజ్ సింగ్... ఫార్వర్డ్ శ్రేణిలో రమణ్‌దీప్ సింగ్, సునీల్, నికిన్ తిమ్మయ్యల ప్రతిభ... పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
సొంతగడ్డపై అనుకూల వాతావరణ పరిస్థితులు, అభిమానుల మద్దతు భారత్‌కు లాభించే అంశాలు. అయితే తొలి మ్యాచ్‌లో కెప్టెన్ సర్దార్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. సర్దార్ కాలి పిక్క నొప్పితో బాధపడుతుండగా... రూపిందర్‌కు జ్వరం వచ్చింది. అయితే ఈ ఇద్దరి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... మ్యాచ్ సమయానికి వీరిద్దరూ కోలుకుంటారని అసిస్టెంట్ కోచ్ జూడ్ ఫెలిక్స్ తెలిపారు.
డిఫెండర్లకు హెల్మెట్‌లు
ఇటీవల బౌన్సర్ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ దుర్మరణం పాలైన నేపథ్యంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) హాకీ ఆటగాళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇక నుంచి పెనాల్టీ కార్నర్‌ల సమయంలో డ్రాగ్ ఫ్లికర్స్ శక్తివంతంగా సంధించే షాట్‌లను అడ్డుకునేందుకు డిఫెండర్లకు గ్రిల్స్‌తో కూడిన హెల్మెట్ తరహా పరికరాలు ధరించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిబంధన 2015 జనవరి నుంచి అమలవుతుంది.
భారత్ షెడ్యూల్
డిసెంబరు 6: జర్మనీతో
డిసెంబరు 7: అర్జెంటీనాతో
డిసెంబరు 9: నెదర్లాండ్స్‌తో
డిసెంబరు 11న క్వార్టర్ ఫైనల్స్
భారత్ మ్యాచ్‌లన్నీ రాత్రి గం. 7.30 నుంచి
ప్రతిరోజూ మధ్యాహ్నం గం.12 నుంచి మ్యాచ్‌లు మొదలవుతాయి. టెన్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
డిసెంబరు 13న సెమీస్, 14న ఫైనల్స్ జరుగుతాయి.
జట్ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: ఇంగ్లండ్, బెల్జియం, ఆస్ట్రేలియా, పాకిస్తాన్
గ్రూప్ ‘బి’: భారత్, అర్జెంటీనా, నెదర్లాండ్స్, జర్మనీ
13 చాంపియన్స్ ట్రోఫీని అత్యధికంగా ఆస్ట్రేలియా జట్టు 13 సార్లు గెల్చుకుంది.
2 చాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన ఆసియా జట్ల సంఖ్య (పాకిస్తాన్, దక్షిణ కొరియా)
3 ఈ మెగా టోర్నీకి భారత్ మూడోసారి ఆతిథ్యమిస్తోంది. 1996, 2005లలో రెండుసార్లు చెన్నై ఈ పోటీలకు వేదిక అయ్యింది.
3 ఈ టోర్నీలో భారత అత్యుత్తమ ప్రదర్శన మూడో స్థానం (1982లో). మరో ఆరుసార్లు నాలుగో స్థానంలో నిలిచింది.
1 చాంపియన్స్ ట్రోఫీని వరుసగా ఐదుసార్లు నెగ్గిన ఏకైక జట్టు ఆస్ట్రేలియా. 2008 నుంచి ఆస్ట్రేలియా జట్టు చాంపియన్‌గా నిలుస్తోంది.