HOckey tournment
-
కల చెదిరింది...
సెమీస్‌లో పాక్ చేతిలో భారత్ ఓటమి నేడు ఆసీస్‌తో కాంస్యం కోసం పోరు చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ మూడున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న ‘ఫైనల్ బెర్త్’ స్వప్నాన్ని సాకారం చేసుకు నేందుకు వచ్చిన అద్భుత అవకాశాన్ని భారత జట్టు చేజేతులా చేజార్చుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో మరోసారి ఓడిపోయి నిరాశపరిచింది. ఆసియా క్రీడల ఫైనల్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్న పాకిస్తాన్ 16 ఏళ్ల తర్వాత మళ్లీ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భువనేశ్వర్: తొలుత ఆధిక్యంలోకి వెళ్లడం... ఆ తర్వాత దానిని కోల్పోవడం... చివరి క్షణాల్లో తడబడటం ఎంత చేటు చేస్తుందో భారత హాకీ జట్టుకు మరోసారి తెలిసొచ్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని మరోసారి కోల్పోయింది. పాకిస్తాన్‌తో శనివారం జరిగిన సెమీఫైనల్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 3-4 గోల్స్‌తో ఓడింది. మ్యాచ్ ముగియడానికి 90 సెకన్ల సమయం ఉందనగా భారత్ కీలకమైన గోల్‌ను పాక్‌కు సమర్పించుకుంది. భారత్ తరఫున గుర్జిందర్ సింగ్ (12వ నిమిషంలో), ధరమ్వీర్ (38వ నిమిషంలో), నికిన్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పాక్ జట్టుకు ఖాదిర్ (17వ, 59వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా... వకాస్ (32వ నిమిషం లో), ఇర్ఫాన్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఒక వ్యాపారవేత్త ఆర్థిక సహాయం చేయడంతో భారత్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు వచ్చిన పాకిస్తాన్ ఏకంగా ఫైనల్‌కు చేరుకొని ఆశ్చర్యపరిచింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పాక్... క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌ను బోల్తా కొట్టించి... అదే జోరులో సెమీఫైనల్లో ఆతిథ్య భారత్ ఆశలను వమ్ముచేసింది. 1998 తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీలో పాక్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో పాక్ అమీతుమీ తేల్చుకుంటుంది. తొలి సెమీఫైనల్లో జర్మనీ 3-2తో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆదివారమే జరిగే కాంస్య పతక పోరులో భారత్, ఆస్ట్రేలియా పోటీపడతాయి. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించినా... కేవలం ఒకదానిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు పాక్ ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ భారత్‌పై ఒత్తిడిని పెంచింది. తొలుత 12వ నిమిషంలో గుర్జిందర్ గోల్‌తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఐదు నిమిషాల తేడాలోనే ఆధిక్యాన్ని కోల్పోయింది. భారత రక్షణశ్రేణిలోని లోపాలను అనుకూలంగా మల్చుకున్న పాక్ ఆటగాడు ఖాదిర్ గోల్ చేసి స్కోరును 1-1వద్ద సమం చేశాడు. ఒకదశలో మ్యాచ్ ‘పెనాల్టీ షూట్అవుట్’కు దారి తీస్తుందని అనుమానం కలిగినా... భారత అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ మ్యాచ్ ముగింపునకు 90 సెకన్లు ఉందనగా ఖాదిర్ గోల్ చేశాడు. పాక్ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తన... భారత్‌పై విజయం సాధించిన తర్వాత పాక్ ఆటగాళ్లు అనుచితంగా ప్రవర్తించారు. తమ చొక్కాలను విప్పి గాల్లో తిప్పుతూ ప్రేక్షకులవైపు అసభ్యకర సంజ్ఞలు చేశారు. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై హాకీ ఇండియా టోర్నీ నిర్వాహకులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీనిపై వాళ్లు విచారణకు ఆదేశించారు. పాక్ ఆటగాళ్లు హద్దుమీరి ప్రవర్తించారని టోర్నీ డెరైక్టర్ విమర్శించారు. చివరకు తమ ఆటగాళ్ల అనుచిత చర్యలకు పాక్ జట్టు చీఫ్ కోచ్ షానాజ్ షేక్ క్షమాపణలు కోరారు. -
స్వప్నం సాకారమయ్యేనా?
రాత్రి గం. 7.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ‘ఫైనల్ బెర్త్’పై భారత్ గురి నేడు పాక్‌తో సెమీస్‌లో అమీతుమీ నెగ్గితే తొలిసారి టైటిల్ పోరుకు అర్హత చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ ఆరంభ విఘ్నాలను అధిగమించిన భారత హాకీ జట్టు అసలు సిసలు పోరుకు సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శనివారం జరిగే సెమీఫైనల్ పోరులో టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే... భారత్ 36 ఏళ్ల చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న ఘనతను సొంతం చేసుకుంటుంది. మరోవైపు పాకి స్తాన్ ఆసియా క్రీడల ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అంతేకాకుండా 1998 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ ఫైనల్‌కు చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది. భువనేశ్వర్: సొంతగడ్డపై భారత జట్టు ముందు సువర్ణావకాశం ఉంది. మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఏనాడూ భారత్ ఫైనల్‌కు చేరలేదు. ఇన్నాళ్లుగా ఊరిస్తున్న ‘ఫైనల్ బెర్త్’ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు సర్దార్ సింగ్ బృందానికి మంచి అవకాశం లభించింది. దాయాది పాకిస్తాన్‌తో శనివారం జరిగే సెమీఫైనల్లో టీమిండియా శక్తివంచన లేకుండా ఆడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు పాకిస్తాన్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. రెండు జట్లకు ఈ పోరు చావోరేవో లాంటిది. తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ ఆ తర్వాత మూడో లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను బోల్తా కొట్టించి... అదే ఊపులో క్వార్టర్స్‌లో బెల్జియంను ఓడించింది. మరోవైపు పాక్ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి... క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌పై నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. టోర్నీ సొంతగడ్డపై జరుగుతుండటం... ప్రత్యర్థి పాకిస్తాన్ కావడంతో సెమీస్‌లో భారత్‌పైనే అధిక ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ ఏడాది గొప్ప ఫలితాలను సాధించిన భారత్ సీజన్‌ను మరో గొప్ప విజయంతో ముగించాలనే లక్ష్యంతో ఉంది. సర్దార్ సింగ్ అనుభవానికి... యువ ఆటగాళ్ల ఉత్సాహం తోడైతే భారత్ మళ్లీ పాక్‌ను ఓడించడం కష్టమేమీకాదు. 2012 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-3తో పాక్ చేతిలో ఓడింది. ఈసారి టీమిండియా గెలిస్తే లెక్క సరిచేసినట్లవుతుంది. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జర్మనీ తలపడుతుంది. చాంపియన్స్ ట్రోఫీలో పాక్ రికార్డును పరిశీలిస్తే... గతంలో మూడుసార్లు (1978, 1980, 1994) విజేతగా నిలిచి; ఆరుసార్లు (1983, 1984, 1988, 1991, 1996, 1998) రన్నరప్‌గా నిలిచింది. భారత్ 13 సార్లు పాల్గొని... ఒకసారి మూడో స్థానంలో (1982), ఆరుసార్లు (1983, 1996, 2002, 2003, 2004, 2012) నాలుగో స్థానంలో నిలిచింది. పాక్‌దే పైచేయి భారత్, పాకిస్తాన్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 160 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 52 మ్యాచ్‌ల్లో నెగ్గగా... పాకిస్తాన్ 79 మ్యాచ్‌ల్లో గెలిచింది. 29 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. భారత్ 307 గోల్స్ చేయగా... పాకిస్తాన్ 374 గోల్స్ సాధించింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే... ఈ రెండు జట్లు 17 సార్లు తలపడ్డాయి. 6 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... 11 మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధించింది. టీమిండియా 41 గోల్స్ నమోదు చేయగా... పాక్ 50 గోల్స్ సాధించింది. అయితే అంతర్జాతీయ వేదికపై ఈ రెండు జట్లు చివరిసారిగా ఈ ఏడాది అక్టోబరు 2న కొరియాలోని ఇంచియాన్ ఆసియా క్రీడల ఫైనల్లో పోటీపడగా... ‘షూటౌట్’లో భారత్ 4-2తో పాక్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. -
ప్రతీకార పోరు!
చాంపియన్స్ ట్రోఫీ హాకీ క్వార్టర్స్ నేడు బెల్జియంతో భారత్ ‘ఢీ’ భువనేశ్వర్: సొంతగడ్డపై కీలకపోరుకు భారత్ సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో టీమిండియాకు గురువారం అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఇటీవల కాలంలో సంచలన ప్రదర్శనతో రాణిస్తున్న బెల్జియంతో సర్దార్ సింగ్ బృందం అమీతుమీ తేల్చుకోనుంది. బెల్జియంతో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఓటమే ఎదురైంది. ప్రపంచకప్‌లో 2-3తో; హాకీ వరల్డ్ లీగ్‌లో 1-2తో టీమిండియా ఓటమి పాలైంది. ఈ రెండు పరాజయాలకు బదులు తీర్చుకునే అవకాశం భారత్‌కు లభించింది. లీగ్ దశలో భారత ఆటతీరును విశ్లేషిస్తే జట్టులో నిలకడలేమి స్పష్టంగా కనిపించింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ బెల్జియంలాంటి జట్లతో ఆడుతున్నపుడు ఆద్యంతం ఒకే తరహా ఆటతీరుతో భారత్ ఆడాల్సి ఉంటుంది. ఏమాత్రం ఉదాసీనత కనబరిచినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. లీగ్ దశలో ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 సెకన్లు ఉండగా గోల్‌ను సమర్పించుకున్న భారత్... అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో తాము గోల్ చేసిన నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశమిచ్చింది. నాకౌట్ మ్యాచ్ కావడంతో టీమిండియాకు కోలుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో అన్ని శ్రేణుల్లో ఆటగాళ్లు సమన్వయంతో రాణిస్తే బెల్జియంను ఓడించడం భారత్‌కు కష్టమేమీకాదు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో నెదర్లాండ్స్; అర్జెంటీనాతో ఆస్ట్రేలియా; జర్మనీతో ఇంగ్లండ్ పోటీపడతాయి. భారత్ x బెల్జియం రాత్రి గం. 7.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
మళ్లీ ఓడిన భారత్
అర్జెంటీనా 4-2తో గెలుపు చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ భువనేశ్వర్: సొంతగడ్డపై మెరిపిస్తుందని ఆశించిన భారత హాకీ జట్టు మరోసారి నిరాశను మిగిల్చింది. చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. శనివారం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 0-1తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో మూడు క్వార్టర్స్‌లో రాణించిన భారత్ చివరి క్వార్టర్లో రెండు గోల్స్ సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (30వ నిమిషంలో), గుర్జిందర్ సింగ్ (37వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. అర్జెంటీనా జట్టుకు లుకాస్ విల్లా (30వ నిమిషంలో), లోపెజ్ (37వ నిమిషంలో), అగస్టీన్ (49వ నిమిషంలో), జోక్విన్ మెనిని (59వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. లుకాస్ విల్లాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభిం చింది. ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 8-2తో పాకిస్తాన్‌పై; నెదర్లాండ్స్ 4-1తో జర్మనీపై గెలుపొందగా... ఆస్ట్రేలియా, బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ 4-4 వద్ద ‘డ్రా’గా ముగిసింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. -
భారత్ అయ్యేనా ‘హీరో’!
నేటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ ఆశల పల్లకిలో టీమిండియా తొలి మ్యాచ్‌లో జర్మనీతో ‘ఢీ’ కెప్టెన్ సర్దార్, రూపిందర్ అనుమానం! ఈ ఏడాది భారత హాకీకి అన్నీ కలిసొచ్చాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం... ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2016 రియో డి జనీరో ఒలింపిక్స్‌కు అర్హత... విశ్వవిజేత ఆస్ట్రేలియాపై తొలిసారి సిరీస్ విజయం... జూనియర్ జట్టు సుల్తాన్ జోహర్ కప్‌ను నెగ్గడం.... ఇలా వరుస విజయాలతో మన హాకీ చలాకీ అయ్యింది. ఏడాది పొడవునా నిలకడైన ప్రదర్శనతో కొత్త ఆశలు రేపిన టీమిండియా సీజన్‌ను ఘనంగా ముగించాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై శనివారం మొదలుకానున్న ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ మనోళ్లకు ఈ సువర్ణావకాశం కల్పిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ తొలిసారి 1978లో జరిగింది. 1980 నుంచి ప్రతి ఏడాదీ ఈ టోర్నీని నిర్వహించారు. అయితే 2012లో హాకీ వరల్డ్ లీగ్‌ను ప్రవేశపెట్టడంతో ఇక నుంచి చాంపియన్స్ ట్రోఫీ రెండేళ్లకోసారి జరుగుతుంది. భువనేశ్వర్: మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఏనాడూ ఫైనల్‌కు చేరలేదు. 1982లో మూడో స్థానం సాధించడమే టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన. ఈ సంవత్సరం గొప్ప విజయాలతో జోరుమీదున్న సర్దార్ సింగ్ బృందం సొంతగడ్డపై సత్తా చాటుకోవాలని... చాంపియన్స్ ట్రోఫీలో తమ రికార్డును మెరుగుపర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. శనివారం మొదలయ్యే ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో తలపడనుంది. ఈ టోర్నీకి ముందు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ రాజీనామా చేయడం భారత జట్టుకు కాస్త ప్రతికూలాంశం. వాల్ష్ పర్యవేక్షణలోనే భారత్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. వాల్ష్ నిష్ర్కమణ తర్వాత టీమిండియాకు ఎదురవుతున్న అసలు సిసలు సవాలు చాంపియన్స్ ట్రోఫీ. ఎనిమిది మేటి జట్ల మధ్య జరిగే ఈ టోర్నీలో భారత్‌కు ప్రతి మ్యాచ్ కఠినంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం భారత్ తీవ్రంగానే శ్రమించింది. మిడ్ ఫీల్డ్‌లో కెప్టెన్ సర్దార్ సింగ్... ‘డ్రాగ్ ఫ్లికర్స్’ రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్... గోల్ కీపర్ శ్రీజేష్... రక్షణశ్రేణిలో బీరేంద్ర లాక్డా, గుర్బాజ్ సింగ్... ఫార్వర్డ్ శ్రేణిలో రమణ్‌దీప్ సింగ్, సునీల్, నికిన్ తిమ్మయ్యల ప్రతిభ... పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సొంతగడ్డపై అనుకూల వాతావరణ పరిస్థితులు, అభిమానుల మద్దతు భారత్‌కు లాభించే అంశాలు. అయితే తొలి మ్యాచ్‌లో కెప్టెన్ సర్దార్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. సర్దార్ కాలి పిక్క నొప్పితో బాధపడుతుండగా... రూపిందర్‌కు జ్వరం వచ్చింది. అయితే ఈ ఇద్దరి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... మ్యాచ్ సమయానికి వీరిద్దరూ కోలుకుంటారని అసిస్టెంట్ కోచ్ జూడ్ ఫెలిక్స్ తెలిపారు. డిఫెండర్లకు హెల్మెట్లు ఇటీవల బౌన్సర్ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ దుర్మరణం పాలైన నేపథ్యంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) హాకీ ఆటగాళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇక నుంచి పెనాల్టీ కార్నర్ల సమయంలో డ్రాగ్ ఫ్లికర్స్ శక్తివంతంగా సంధించే షాట్లను అడ్డుకునేందుకు డిఫెండర్లకు గ్రిల్స్‌తో కూడిన హెల్మెట్ తరహా పరికరాలు ధరించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిబంధన 2015 జనవరి నుంచి అమలవుతుంది. భారత్ షెడ్యూల్ డిసెంబరు 6: జర్మనీతో డిసెంబరు 7: అర్జెంటీనాతో డిసెంబరు 9: నెదర్లాండ్స్‌తో డిసెంబరు 11న క్వార్టర్ ఫైనల్స్ భారత్ మ్యాచ్‌లన్నీ రాత్రి గం. 7.30 నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం గం.12 నుంచి మ్యాచ్‌లు మొదలవుతాయి. టెన్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. డిసెంబరు 13న సెమీస్, 14న ఫైనల్స్ జరుగుతాయి. జట్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: ఇంగ్లండ్, బెల్జియం, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ గ్రూప్ ‘బి’: భారత్, అర్జెంటీనా, నెదర్లాండ్స్, జర్మనీ 13 చాంపియన్స్ ట్రోఫీని అత్యధికంగా ఆస్ట్రేలియా జట్టు 13 సార్లు గెల్చుకుంది. 2 చాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన ఆసియా జట్ల సంఖ్య (పాకిస్తాన్, దక్షిణ కొరియా) 3 ఈ మెగా టోర్నీకి భారత్ మూడోసారి ఆతిథ్యమిస్తోంది. 1996, 2005లలో రెండుసార్లు చెన్నై ఈ పోటీలకు వేదిక అయ్యింది. 3 ఈ టోర్నీలో భారత అత్యుత్తమ ప్రదర్శన మూడో స్థానం (1982లో). మరో ఆరుసార్లు నాలుగో స్థానంలో నిలిచింది. 1 చాంపియన్స్ ట్రోఫీని వరుసగా ఐదుసార్లు నెగ్గిన ఏకైక జట్టు ఆస్ట్రేలియా. 2008 నుంచి ఆస్ట్రేలియా జట్టు చాంపియన్‌గా నిలుస్తోంది. -
6న జయశంకర్ స్మారక హాకీ టోర్నీ
ఎల్బీ స్టేడియం: దివంగత ప్రొఫెసర్ కె. జయశంకర్ స్మారక ఓపెన్ హాకీ టోర్నమెంట్ జింఖానా మైదానంలో ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నారు. యంగ్‌టర్క్స్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ టోర్నీలో పాఠశాలలు, జూనియర్ కాలేజి డిపార్ట్మెంట్ జట్లు పాల్గొననున్నాయి. ఆసక్తి గల వారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ ముదిరాజ్‌ను 97003-07544 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. రేపు ఓపెన్ చెస్ టోర్నీ హైదరాబాద్ జిల్లా చెస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ ఆదివారం (3న) నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో సూపర్ కిడ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్-7 బాలబాలికల చెస్ టోర్నీ రాంనగర్‌లోని అకాడమీలో జరగనుంది. జిల్లా మహిళల చెస్ టోర్నీ కూడా అదే రోజు నిర్వహిస్తారు. వివరాలకు టోర్నీ డెరైక్టర్ కె. దయానంద్ (96526-17524)ను సంప్రదించవచ్చు. 11నుంచి ఓల్డ్ సిటీ క్రీడలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఇంటర్ స్కూల్ క్రీడలు ఈనెల 11 నుంచి 19 వరకు కులీ కుతుబ్‌షా స్టేడియంలో జరగనున్నాయి. ఓల్డ్ సిటీ స్కూల్ గేమ్స్ అసోసియేషన్ (ఓసీఎస్జీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ఈవెంట్లో క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, కబడ్డీల్లో పోటీలను నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈనెల 9లోగా పంపించాలి. వివరాలకు ఓసీఎస్జీఏ ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఫజిలత్ అహ్మద్(97000-08253)ను సంప్రదించవచ్చు. -
సెమీస్‌లో ఇన్కమ్ ట్యాక్స్
ఇన్విటేషన్ హాకీ టోర్నీ సాక్షి, హైదరాబాద్: హెచ్‌హెచ్ ఇన్విటేషన్ హాకీ టోర్నీలో ఇన్కమ్ ట్యాక్స్, ఏజీఓఆర్‌సీ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో శుక్రవారం ఈ క్వార్టర్స్ మ్యాచ్ జరిగింది. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ జట్టు 5-4 తేడాతో జింఖానా జట్టుపై గెలుపొందింది. ఇన్కమ్ ట్యాక్స్ జట్టులో సంజీవి రెండు గోల్స్ చేయగా, అజయ్ శర్మ, అజయ్‌బాబు, సమీర్లు ఒక్కో గోల్ చొప్పున చేశారు. జింఖానా ఆటగాళ్లలో మహేశ్ రెండు గోల్స్, అభిమన్యు, సాయి చెరో గోల్ నమోదు చేశారు. ఇక మరో క్వార్టర్ ఫైనల్లో ఏజీఓఆర్‌సీ 6-0 తేడాతో రాయల్ క్లబ్‌పై విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టింది. ఇన్కమ్ ట్యాక్స్, ఏజీఓఆర్‌సీ జట్లు శనివారం జరగనున్న రెండో సెమీఫైనల్లో తలపడనుండగా, నవభారత్ (ఏ), రసూల్‌పురా (ఏ) జట్లు తొలి సెమీఫైనల్లో ఆడనున్నాయి. -
బెల్జియం చేతిలో భారత మహిళల ఓటమి
గ్లాస్గో: చాంపియన్స్ చాలెంజ్-1 హాకీ టోర్నీలో భారత మహిళల జట్టుకు మరో పరాజయం ఎదురైంది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం బెల్జియంతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 0-5 తేడాతో ఓటమిపాలైంది. ఆరంభంలో హోరాహోరీగా పోరాడి బెల్జియంను అడ్డుకున్న భారత మహిళలు 33వ నిమిషంలో మనన్ సైమన్స్ తొలి గోల్ సాధించినప్పటి నుంచి పట్టు కోల్పోయారు. బెల్జియం క్రీడాకారిణులు జిల్ బూన్ (38వ నిమిషం), లూయిస్ వెర్సవెల్ (41వ), ఎమ్మా పవ్రెజ్ (64వ), లీసెలోట్ వాన్ లింట్ (69వ)లు వరుసగా గోల్స్ నమోదు చేసి భారత్‌పై ఆ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం అమెరికాతో ఆడనుంది. -
చాంపియన్ నిజామాబాద్
సీనియర్ హాకీ టోర్నీ నల్లగొండ, న్యూస్‌లైన్: కోమటి రెడ్డి ప్రతీక్ స్మారక తెలంగాణ అంతర్ జిల్లా పురుషుల సీనియర్ హాకీ టోర్నమెంట్లో నిజామాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఇక్కడి ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ బుధవారం ముగిసింది. చివరి రోజు జరిగిన సూపర్ లీగ్ మ్యాచుల్లో నిజామాబాద్ రెండు విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 6-1 గోల్స్ తేడాతో వరంగల్‌ను ఓడించింది. నిజామాబాద్ తరఫున శివ, యోగేశ్ చెరో 3 గోల్స్ చేశారు. రెండో మ్యాచ్‌లోనూ నిజామాబాద్ నల్లగొండపై 4-1తో విజయం సాధించింది. శివ 2, యోగేశ్, సుమన్ చెరో గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో వరంగల్‌ను 2-0తో ఓడించి నల్లగొండ రెండో స్థానంలో నిలిచింది. నల్లగొండ తరఫున లోకేశ్, కిరణ్ చెరో గోల్ సాధించారు. సూపర్ లీగ్‌లో రెండు మ్యాచ్‌లూ ఓడిన వరంగల్ మూడో స్థానంతో సంతృప్తి పడింది. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, హాకీ ఇండియా సంయుక్త కార్యదర్శి నిరంజన్ రెడ్డి, ఏపీ ఒలింపిక్ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, నల్లగొండ హాకీ సంఘం అధ్యక్షుడు మెరుగు గోపి తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ లీగ్‌కు నల్లగొండ
సాక్షి, నల్లగొండ: తెలంగాణ అంతర్ జిల్లా పురుషుల సీనియర్ హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య నల్లగొండ జట్టు సూపర్లీగ్లోకి ప్రవేశించింది. నల్లగొండతో పాటు నిజామాబాద్, వరంగల్ కూడా ఈ దశకు అర్హత సాధించాయి. ఇక్కడి ఎన్జీ కాలేజీ మైదానంలో జరుగుతున్న ఈ పోటీల లీగ్ దశలో పై మూడు జట్లు నిలకడగా రాణించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ 6-0 గోల్స్ తేడాతో రంగారెడ్డిని చిత్తు చేసింది. ఎండీ అజీజ్, లచ్చు చెరో 3 గోల్స్ చేసి నల్లగొండకు విజయాన్ని అందించారు. మరో మ్యాచ్‌లో నిజామాబాద్ 3-2 తేడాతో ఆదిలాబాద్‌ను ఓడించింది. రెండో లీగ్ మ్యాచ్‌లో కూడా చెలరేగిన నిజామాబాద్ 6-0 తేడాతో మహబూబ్‌నగర్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో వరంగల్ 3-1తో మెదక్‌పై విజయం సాధించి సూపర్‌లీగ్‌కు చేరుకుంది. టోర్నీ చివరి రోజు బుధవారం సూపర్ లీగ్‌లో భాగంగా ఒక్కో జట్టు ఇతర రెండు జట్లతో తలపడుతుంది. ఈ ప్రదర్శన తర్వాతే (సెమీస్, ఫైనల్ లేకుండా) టోర్నీ విజేతను నిర్ణయిస్తారు. -
రంగారెడ్డి జట్టుకు మూడో స్థానం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర పైకా మహిళల హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను అనంతపురం జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో అనంతపురం జట్టు 2-0 స్కోరుతో వైఎస్ఆర్ కడప జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా 3-0తో విశాఖపట్నంపై గెలిచింది. సెమీఫైనల్లో అనంతపురం 4-0తో రంగారెడ్డి జిల్లాపై, వైఎస్ఆర్ కడప 2-0తో విశాఖపట్నంపై గెలిచాయి. విజేతలకు హాకీ ట్రిపుల్ ఒలింపియన్ ఎన్.ముఖేష్ కుమార్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ డిప్యూటీ డెరైక్టర్ జి.ఎ.శోభ, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె.నర్సయ్య, హైదరాబాద్ జిల్లా క్రీడాధికారి ఎ.అలీమ్ ఖాన్ తదితరలు పాల్గొన్నారు. రాజు అదుర్స్ జింఖానా, న్యూస్‌లైన్: బ్యాట్స్‌మన్ రాజు (106) సెంచరీతో చెలరేగడంతో తారకరామ జట్టు 14 పరుగుల తేడాతో సాక్రెడ్ హార్ట్స్ జట్టుపై గెలుపు దక్కించుకుంది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన తారకరామ 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. శేఖర్ 35 పరుగులు చేశాడు. తర్వాత బరిలోకి దిగిన సాక్రెడ్ హార్ట్స్ 188 పరుగుల వద్ద ఆలౌటైంది. జమీర్ (40), జెరాద్ (43) మెరుగ్గా ఆడారు. తారకరామ బౌలర్లు సిద్ధార్థ్, తరుణ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో హెచ్‌యూసీసీ బౌలర్ బిలాల్ అహ్మద్ (5/19) తన బౌలింగ్‌తో ఇంపీరియల్ జట్టును కట్టడి చేశాడు. దీంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో ఇంపీరియల్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంపీరియల్ 180 పరుగులు చేసి ఆలౌటైంది. ఉత్తేజ్ (56) అర్ధ సెంచరీతో రాణించగా... అర్ఫాన్ (42) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బరిలోకి దిగిన హెచ్‌యూసీసీ 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి నెగ్గింది. ఇబ్రహీమ్ (76) అర్ధ సెంచరీతో చెలరేగగా... అతీఖ్ 30 పరుగులు చేశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎంపీ యంగ్‌మెన్: 215/6 (ఆదర్శ్ 41, ఉదయ్ 43, శ్రీవంత్ 44; అభిషేక్ 4/16); సెయింట్ ప్యాట్రిక్స్: 161/9 (అభిషేక్ 52). పీకేఎంసీసీ: 235/9 (జయేష్ 50, కుమార్ 44, విజయ్ 40, మణికాంత్ 33; శ్యామ్ 5/50); విజయ్ సీసీ: 212/9 (సుధాకర్ 76 నాటౌట్, కిరణ్ 43, భార్గవ్ 35; కుమార్ 3/13). హైదరాబాద్ పాంథర్స్: 155 (హైదర్ 32, రేహాన్ 34 నాటౌట్; శ్రీకాంత్ 3/22); డబ్ల్యూఎంసీసీ: 156/4 (ప్రదీప్ 63 నాటౌట్, హర్యాంక్ 30; విలాయత్ 3/26). స్టార్లెట్స్: 178 (అజయ్ జశ్వంత్ 40; కేసరి 4/28); యూనివర్సల్: 111. యాదవ్ డెయిరీ: 164 (మహ్మద్ 55, శ్రీనాథ్ 35, స్వామి 3/11); ఎంపీ బ్లూస్: 168/2 (విక్రమ్ 41 నాటౌట్, స్వామి 35 నాటౌట్). పీఎన్ యంగ్‌స్టర్స్: 138 (జావిద్ 40; ప్రకాష్ 3/40); సూపర్‌స్టార్: 139/3 (మహేష్ 51, రాకేష్ 31). మయూర సీసీ: 197/9 (ఆశిష్ శ్రీవాస్తవ్ 46, అఖిలేష్ 44 నాటౌట్ , రిషబ్ 37; మహ్మద్ ఐజాజ్ 5/17); ఆడమ్స్ ఎలెవన్: 52 (సంజయ్ 3/11, అఖిలేష్ 3/10). ధృవ్ ఎలెవన్: 161 (సంపత్ 41, అశోక్ 31; భార్గవ్ ప్రసాద్ 3/22); గగన్‌మహల్: 112 (కిరణ్ 34; సంపత్ 3/13, మోహన్ 3/31). -
రంగారెడ్డి జిల్లా శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర పైకా మహిళల హాకీ టోర్నమెంట్లో తొలి రోజు రంగారెడ్డి జిల్లా, వైఎస్ఆర్ కడప జట్లు శుభారంభం చేశాయి. జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని హాకీ స్టేడియంలో గురువారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా 7-0 స్కోరుతో శ్రీకాకుళంపై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో వైఎస్ఆర్ కడప 5-0తో మెదక్‌పై గెలిచింది. ప్రారంభ వేడుకలకు రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారిణుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హాకీ ట్రిపుల్ ఒలింపియన్ ఎన్.ముఖేష్ కుమార్, శాప్ డిప్యూటీ డెరైక్టర్లు జి.ఎ.శోభ, జి.వెంకటరమణ, రాష్ట్ర పైకా సలహాదారుడు డాక్టర్ ఎన్.సి.మోహన్, హైదరాబాద్ జిల్లా క్రీడాధికారి ఎ.అలీమ్ ఖాన్, జి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. లీగ్ ఫలితాలు ప్రకాశం 6-0తో ఆదిలాబాద్‌పై, విశాఖపట్నం 2-0తో కర్నూలుపై, తూర్పు గోదావరి 4-0తో నెల్లూరుపై, అనంతపురం 7-0తో కరీంనగర్‌పై, చిత్తూరు 5-0తో వరంగల్‌పై గెలుపొందాయి. -
రంగారెడ్డి జిల్లాకు బాలికల టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ‘పైకా’ హాకీ టోర్నమెంట్లో బాలికల టీమ్ టైటిల్‌ను రంగారెడ్డి జిల్లా జట్టు చేజిక్కించుకుంది. బాలుర టీమ్ టైటిల్‌ను అనంతపురం జట్టు గెల్చుకుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంగళవారం జరిగిన బాలికల హాకీ ఫైనల్లో రంగారెడ్డి జిల్లా 2-0 స్కోరుతో వైఎస్ఆర్ కడపపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు 2-1తో కృష్ణాపై గెలిచింది. బాలుర విభాగం ఫైనల్లో అనంతపురం 2-1తో మహబూబ్‌నగర్‌పై గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా 2-1తో చిత్తూరుపై నెగ్గింది. ఈ పోటీలకు శాప్ డిప్యూటీ డెరైక్టర్ జి. శోభ విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె.నర్సయ్య, పైకా క్రీడల సలహాదారుడు డాక్టర్ ఎన్.సి.మోహన్, ఆర్ఆర్డీఎస్ఏ అధికారి ఇ.వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌కు పదో స్థానం
న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పరాజయం పొందిన భారత జట్టు ప్రపంచకప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో పదో స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో పాకిస్థాన్ టైబ్రేక్‌లో 4-2 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించి తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 1-1వద్ద సమంగా నిలిచాయి. ఆట ఏడో నిమిషంలో రిజ్వాన్ అలీ గోల్‌తో పాక్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 66వ నిమిషంలో గుర్జిందర్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. టైబ్రేక్‌లో పాకిస్థాన్ తరఫున ఇర్ఫాన్ మహ్మద్, తౌసిక్ మహ్మద్, మహ్మద్ ఉమర్ భుట్టా, దిల్బర్ మహ్మద్ బంతిని లక్ష్యానికి చేర్చగా... రిజ్వాన్ జూనియర్ విఫలమయ్యాడు. భారత్ తరఫున గుర్జిందర్ సింగ్, తల్విందర్ సింగ్ సఫలం కాగా... ఇమ్రాన్ ఖాన్, సత్బీర్ సింగ్ విఫలమయ్యారు. ఫలితం రావడంతో భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ చివరిదైన ఐదో షాట్‌ను తీసుకోలేదు. -
మలేసియాపై భారత్ గెలుపు
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు 4-3తో మలేసియాపై గెలుపొందింది. జపాన్‌లోని కకమిగహరలో శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు మలక్ సింగ్ (41వ, 51వ ని.) రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రమణ్‌దీప్ సింగ్ (4వ ని.), మన్దీప్ సింగ్ (54వ ని.) గోల్స్ చేశారు. మలేసియా తరఫున అజ్రీన్ రిజాల్ బిన్ నాసిర్ (10వ ని.), ఫైజల్ సారి (12వ, 67వ ని.) గోల్స్ చేశారు. ఐదు, ఆరు స్థానాల కోసం ఆదివారం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో భారత్... ఒమన్‌తో తలపడుతుంది. -
ఆసియా చాంపియన్స్‌ట్రోఫీకి హాకీ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సోమవారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ సర్ధారా సింగ్‌కు విశ్రాంతినిచ్చిన హెచ్ఐ సెలక్టర్లు జట్టు పగ్గాలు మన్‌ప్రీత్ సింగ్‌కు అప్పగించారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ జపాన్‌లోని కకమిగహరలో వచ్చే నెల 2 నుంచి 10 వరకు జరగనుంది. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్‌లో మన్‌ప్రీత్ జూనియర్ జట్టును విజయపథాన నడిపించాడు. దీంతో అతని సారథ్యంలోని 18 మంది సభ్యుల సీనియర్ జట్టును ఎంపిక చేశారు. ఈ ఈవెంట్ తొలి మ్యాచ్‌లో నవంబర్ 2న భారత్... చైనాతో తలపడుతుంది. అనంతరం 3న జపాన్, 5న ఒమన్, 7న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోటీపడుతుంది. -
భారత్ ‘డ్రా’తో సరి
జొహర్ బారు (మలేసియా): వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు మలేసియా బ్రేక్ వేసింది. సుల్తాన్ జొహర్ కప్ అండర్-21 హాకీ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 3-3తో భారత్‌ను నిలువరించింది. భారత్ తరఫున సత్బీర్ సింగ్ (10వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (33వ ని.లో), అఫాన్ యూసుఫ్ (70వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా తరఫున షారిల్ రెండు గోల్స్ (61వ, 68వ ని.లో)... రషీద్ (64వ ని.లో) ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్‌కు ముందే ఈ రెండు జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దాంతో ఈ ఫలితం రెండు జట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ఆరు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగిసిన తర్వాత భారత్, మలేసియా 13 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్ అగ్రస్థానంలో, మలేసియా రెండో స్థానంలో నిలిచి ఆదివారం జరిగే అంతిమ పోరుకు అర్హత పొందాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత్ విరామ సమయానికి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరి పది నిమిషాల్లో మలేసియా అనూహ్య విజృంభణతో మూడు గోల్స్ సాధించింది. భారత్ ఓటమి ఖాయమనుకున్న దశలో చివరి సెకన్లలో వైస్ కెప్టెన్ అఫాన్ యూసుఫ్ గోల్‌తో టీమిండియా మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. నేటి ఫైనల్ భారత్ x మలేసియా సాయంత్రం గం. 6.00 నుంచి ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కేవీఎస్ ‘డబుల్’
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వి.పురుషోత్తం స్మారక ఇంటర్ స్కూల్ హాకీ టోర్నమెంట్లో బాలబాలికల టీమ్ టైటిల్స్‌ను గచ్చిబౌలికి చెందిన కేంద్రీయ విద్యా సంఘటన్ (కేవీఎస్) స్కూల్ గెలుచుకుంది. (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా మైదానంలో ఆదివారం జరిగిన బాలికల విభాగం ఫైనల్లో కేవీఎస్ 6-0తో ఐ.వి.వై లీగ్ అకాడమీ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేవీఎస్ స్కూల్‌కు చెందిన గీతా హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. శృతి, సోను చెరో గోల్ సాధించారు. బాలుర విభాగం ఫైనల్లో కేవీఎస్ జట్టు 2-0తో బాలంరాయి హైస్కూల్ టీమ్‌ను ఓడించింది. కేవీ స్కూల్ జట్టు తరఫున అభిమన్యు, వంశీ గోల్ చేశారు. ఈ పోటీల ముగింపు వేడుకలకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ కార్యక్రమంలో హెచ్‌హెచ్ అధ్యక్షుడు జయేష్ రంజన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సెవెన్ స్టార్’ రాఘవేంద్ర
సాక్షి, హైదరాబాద్: వి.పురుషోత్తం స్మారక అంతర్ పాఠశాల హాకీ టోర్నమెంట్లో బాలంరాయి హైస్కూల్ సత్తా చాటింది. జింఖానా మైదానంలో శనివారం జరిగిన బాలుర విభాగం మ్యాచ్‌లో ఈ స్కూల్ 15-0 గోల్స్ తేడాతో మమతా హైస్కూల్‌ను చిత్తుగా ఓడించింది. బాలంరాయి ఆటగాడు రాఘవేంద్ర ఒక్కడే 7 గోల్స్ చేయడం విశేషం. రంజిత్, ధరమ్, సాయికుమార్ తలా 2 గోల్స్ చేయగా మోహిత్, భాను ఒక్కో గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో స్యామ్సన్ చేసిన ఏకైక గోల్‌తో ఉప్పల్ హైస్కూల్ 1-0తో రహమాని హైస్కూల్‌ను ఓడించింది. ఇదే విభాగంలో మరో మ్యాచ్‌లో ఉప్పల్ హైస్కూల్ 2-1 తేడాతో ఐవీఐ లీగ్‌పై గెలుపొందింది. ఉప్పల్ తరఫున స్యామ్సన్ రెండు గోల్స్ చేయగా, ఐవీఐ తరఫున చేతన్ గోల్ చేశాడు. బాలికల విభాగంలో కేవీ గచ్చిబౌలి 6-1 స్కోరుతో కస్తూర్బా కాలేజీని చిత్తు చేసింది. కేవీ తరఫున శృతి కౌశిక్ 2 గోల్స్ చేయగా సునీత, గీత, మేఘన, సన ఒక్కో గోల్ చేశారు. -
మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆర్.డి.ఆభరణం స్మారక హాకీ టోర్నమెంట్‌ను మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు చేజిక్కించుకుంది. జింఖానా మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ 5-0 స్కోరుతో రసూల్పురాపై ఘన విజయం సాధించింది. మహ్మదన్ స్పోర్టింగ్ జట్టు సీనియర్ ఆటగాళ్లు మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రసూల్‌పూరా ఆటగాళ్ల నుంచి అంతగా ప్రతిఘటన లేకపోవడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టులో అబ్దుల్ ఆలీమ్, బి.హీరో, ఇన్నోసెంట్ కులూ, షకీల్, ఆశిష్ తలా ఒక్కో గోల్ చేశారు. ముగింపు వేడుకలకు హాకీ హైదరాబాద్(హెచ్‌హెచ్) అధ్యక్షుడు డాక్టర్ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన హెచ్‌హెచ్ కొత్త లోగోను లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపియన్ ఎన్.ముఖేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.