స్వప్నం సాకారమయ్యేనా?
రాత్రి గం. 7.30 నుంచి
టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
‘ఫైనల్ బెర్త్’పై భారత్ గురి
నేడు పాక్‌తో సెమీస్‌లో అమీతుమీ
నెగ్గితే తొలిసారి టైటిల్ పోరుకు అర్హత
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ
ఆరంభ విఘ్నాలను అధిగమించిన భారత హాకీ జట్టు అసలు సిసలు పోరుకు సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శనివారం జరిగే సెమీఫైనల్ పోరులో టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే... భారత్ 36 ఏళ్ల చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న ఘనతను సొంతం చేసుకుంటుంది. మరోవైపు పాకి స్తాన్ ఆసియా క్రీడల ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. అంతేకాకుండా 1998 తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ ఫైనల్‌కు చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది.
భువనేశ్వర్: సొంతగడ్డపై భారత జట్టు ముందు సువర్ణావకాశం ఉంది. మూడున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఏనాడూ భారత్ ఫైనల్‌కు చేరలేదు. ఇన్నాళ్లుగా ఊరిస్తున్న ‘ఫైనల్ బెర్త్’ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు సర్దార్ సింగ్ బృందానికి మంచి అవకాశం లభించింది. దాయాది పాకిస్తాన్‌తో శనివారం జరిగే సెమీఫైనల్లో టీమిండియా శక్తివంచన లేకుండా ఆడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు పాకిస్తాన్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది.
రెండు జట్లకు ఈ పోరు చావోరేవో లాంటిది. తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ ఆ తర్వాత మూడో లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను బోల్తా కొట్టించి... అదే ఊపులో క్వార్టర్స్‌లో బెల్జియంను ఓడించింది. మరోవైపు పాక్ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి... క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌పై నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. టోర్నీ సొంతగడ్డపై జరుగుతుండటం... ప్రత్యర్థి పాకిస్తాన్ కావడంతో సెమీస్‌లో భారత్‌పైనే అధిక ఒత్తిడి ఉంటుంది.
అయితే ఈ ఏడాది గొప్ప ఫలితాలను సాధించిన భారత్ సీజన్‌ను మరో గొప్ప విజయంతో ముగించాలనే లక్ష్యంతో ఉంది. సర్దార్ సింగ్ అనుభవానికి... యువ ఆటగాళ్ల ఉత్సాహం తోడైతే భారత్ మళ్లీ పాక్‌ను ఓడించడం కష్టమేమీకాదు. 2012 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-3తో పాక్ చేతిలో ఓడింది. ఈసారి టీమిండియా గెలిస్తే లెక్క సరిచేసినట్లవుతుంది. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జర్మనీ తలపడుతుంది.
చాంపియన్స్ ట్రోఫీలో పాక్ రికార్డును పరిశీలిస్తే... గతంలో మూడుసార్లు (1978, 1980, 1994) విజేతగా నిలిచి; ఆరుసార్లు (1983, 1984, 1988, 1991, 1996, 1998) రన్నరప్‌గా నిలిచింది. భారత్ 13 సార్లు పాల్గొని... ఒకసారి మూడో స్థానంలో (1982), ఆరుసార్లు (1983, 1996, 2002, 2003, 2004, 2012) నాలుగో స్థానంలో నిలిచింది.
పాక్‌దే పైచేయి
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇప్పటివరకు మొత్తం 160 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 52 మ్యాచ్‌ల్లో నెగ్గగా... పాకిస్తాన్ 79 మ్యాచ్‌ల్లో గెలిచింది. 29 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. భారత్ 307 గోల్స్ చేయగా... పాకిస్తాన్ 374 గోల్స్ సాధించింది.
ఇక చాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే... ఈ రెండు జట్లు 17 సార్లు తలపడ్డాయి. 6 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... 11 మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధించింది. టీమిండియా 41 గోల్స్ నమోదు చేయగా... పాక్ 50 గోల్స్ సాధించింది. అయితే అంతర్జాతీయ వేదికపై ఈ రెండు జట్లు చివరిసారిగా ఈ ఏడాది అక్టోబరు 2న కొరియాలోని ఇంచియాన్ ఆసియా క్రీడల ఫైనల్లో పోటీపడగా... ‘షూటౌట్’లో భారత్ 4-2తో పాక్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.