కల చెదిరింది...
సెమీస్‌లో పాక్ చేతిలో భారత్ ఓటమి
నేడు ఆసీస్‌తో కాంస్యం కోసం పోరు
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ
మూడున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న ‘ఫైనల్ బెర్త్’ స్వప్నాన్ని సాకారం చేసుకు నేందుకు వచ్చిన అద్భుత అవకాశాన్ని భారత జట్టు చేజేతులా చేజార్చుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో మరోసారి ఓడిపోయి నిరాశపరిచింది. ఆసియా క్రీడల ఫైనల్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్న పాకిస్తాన్ 16 ఏళ్ల తర్వాత మళ్లీ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
భువనేశ్వర్: తొలుత ఆధిక్యంలోకి వెళ్లడం... ఆ తర్వాత దానిని కోల్పోవడం... చివరి క్షణాల్లో తడబడటం ఎంత చేటు చేస్తుందో భారత హాకీ జట్టుకు మరోసారి తెలిసొచ్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని మరోసారి కోల్పోయింది. పాకిస్తాన్‌తో శనివారం జరిగిన సెమీఫైనల్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 3-4 గోల్స్‌తో ఓడింది. మ్యాచ్ ముగియడానికి 90 సెకన్ల సమయం ఉందనగా భారత్ కీలకమైన గోల్‌ను పాక్‌కు సమర్పించుకుంది. భారత్ తరఫున గుర్జిందర్ సింగ్ (12వ నిమిషంలో), ధరమ్‌వీర్ (38వ నిమిషంలో), నికిన్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పాక్ జట్టుకు ఖాదిర్ (17వ, 59వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా... వకాస్ (32వ నిమిషం లో), ఇర్ఫాన్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
ఒక వ్యాపారవేత్త ఆర్థిక సహాయం చేయడంతో భారత్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు వచ్చిన పాకిస్తాన్ ఏకంగా ఫైనల్‌కు చేరుకొని ఆశ్చర్యపరిచింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పాక్... క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌ను బోల్తా కొట్టించి... అదే జోరులో సెమీఫైనల్లో ఆతిథ్య భారత్ ఆశలను వమ్ముచేసింది. 1998 తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీలో పాక్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ఆదివారం జరిగే ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో పాక్ అమీతుమీ తేల్చుకుంటుంది. తొలి సెమీఫైనల్లో జర్మనీ 3-2తో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆదివారమే జరిగే కాంస్య పతక పోరులో భారత్, ఆస్ట్రేలియా పోటీపడతాయి.
మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించినా... కేవలం ఒకదానిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు పాక్ ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ భారత్‌పై ఒత్తిడిని పెంచింది. తొలుత 12వ నిమిషంలో గుర్జిందర్ గోల్‌తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఐదు నిమిషాల తేడాలోనే ఆధిక్యాన్ని కోల్పోయింది. భారత రక్షణశ్రేణిలోని లోపాలను అనుకూలంగా మల్చుకున్న పాక్ ఆటగాడు ఖాదిర్ గోల్ చేసి స్కోరును 1-1వద్ద సమం చేశాడు. ఒకదశలో మ్యాచ్ ‘పెనాల్టీ షూట్‌అవుట్’కు దారి తీస్తుందని అనుమానం కలిగినా... భారత అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ మ్యాచ్ ముగింపునకు 90 సెకన్లు ఉందనగా ఖాదిర్ గోల్ చేశాడు.
పాక్ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తన...
భారత్‌పై విజయం సాధించిన తర్వాత పాక్ ఆటగాళ్లు అనుచితంగా ప్రవర్తించారు. తమ చొక్కాలను విప్పి గాల్లో తిప్పుతూ ప్రేక్షకులవైపు అసభ్యకర సంజ్ఞలు చేశారు. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై హాకీ ఇండియా టోర్నీ నిర్వాహకులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీనిపై వాళ్లు విచారణకు ఆదేశించారు. పాక్ ఆటగాళ్లు హద్దుమీరి ప్రవర్తించారని టోర్నీ డెరైక్టర్ విమర్శించారు. చివరకు తమ ఆటగాళ్ల అనుచిత చర్యలకు పాక్ జట్టు చీఫ్ కోచ్ షానాజ్ షేక్ క్షమాపణలు కోరారు.