సొంతగడ్డపై కీలకపోరుకు భారత్ సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో టీమిండియాకు గురువారం అగ్ని పరీక్ష ఎదురుకానుంది.
చాంపియన్స్ ట్రోఫీ హాకీ క్వార్టర్స్ నేడు
బెల్జియంతో భారత్ ‘ఢీ’
భువనేశ్వర్: సొంతగడ్డపై కీలకపోరుకు భారత్ సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో టీమిండియాకు గురువారం అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ఇటీవల కాలంలో సంచలన ప్రదర్శనతో రాణిస్తున్న బెల్జియంతో సర్దార్ సింగ్ బృందం అమీతుమీ తేల్చుకోనుంది.
బెల్జియంతో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఓటమే ఎదురైంది. ప్రపంచకప్‌లో 2-3తో; హాకీ వరల్డ్ లీగ్‌లో 1-2తో టీమిండియా ఓటమి పాలైంది. ఈ రెండు పరాజయాలకు బదులు తీర్చుకునే అవకాశం భారత్‌కు లభించింది. లీగ్ దశలో భారత ఆటతీరును విశ్లేషిస్తే జట్టులో నిలకడలేమి స్పష్టంగా కనిపించింది. ప్రపంచ నాలుగో ర్యాంకర్ బెల్జియంలాంటి జట్లతో ఆడుతున్నపుడు ఆద్యంతం ఒకే తరహా ఆటతీరుతో భారత్ ఆడాల్సి ఉంటుంది. ఏమాత్రం ఉదాసీనత కనబరిచినా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
లీగ్ దశలో ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 సెకన్లు ఉండగా గోల్‌ను సమర్పించుకున్న భారత్... అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో తాము గోల్ చేసిన నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశమిచ్చింది. నాకౌట్ మ్యాచ్ కావడంతో టీమిండియాకు కోలుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో అన్ని శ్రేణుల్లో ఆటగాళ్లు సమన్వయంతో రాణిస్తే బెల్జియంను ఓడించడం భారత్‌కు కష్టమేమీకాదు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో నెదర్లాండ్స్; అర్జెంటీనాతో ఆస్ట్రేలియా; జర్మనీతో ఇంగ్లండ్ పోటీపడతాయి.
భారత్ x బెల్జియం
రాత్రి గం. 7.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం