మళ్లీ ఓడిన భారత్
అర్జెంటీనా 4-2తో గెలుపు
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ
భువనేశ్వర్: సొంతగడ్డపై మెరిపిస్తుందని ఆశించిన భారత హాకీ జట్టు మరోసారి నిరాశను మిగిల్చింది. చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. శనివారం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 0-1తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో మూడు క్వార్టర్స్‌లో రాణించిన భారత్ చివరి క్వార్టర్‌లో రెండు గోల్స్ సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (30వ నిమిషంలో), గుర్జిందర్ సింగ్ (37వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
అర్జెంటీనా జట్టుకు లుకాస్ విల్లా (30వ నిమిషంలో), లోపెజ్ (37వ నిమిషంలో), అగస్టీన్ (49వ నిమిషంలో), జోక్విన్ మెనిని (59వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. లుకాస్ విల్లాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభిం చింది. ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 8-2తో పాకిస్తాన్‌పై; నెదర్లాండ్స్ 4-1తో జర్మనీపై గెలుపొందగా... ఆస్ట్రేలియా, బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ 4-4 వద్ద ‘డ్రా’గా ముగిసింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది.