
చాంపియన్స్ కావడం మాకు అవసరం..
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవడంతోనైనా పాకిస్తాన్ క్రికెట్ లో మార్పులు చోటు చేసుకుంటాయని ఆశిస్తున్నట్టు ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్ అభిప్రాయపడ్డాడు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ లో క్రికెట్ ఆడటానికి దాదాపు అన్ని క్రికెట్ జట్లు వెనుకడుగు వేయడాన్ని ఆర్థర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ప్రస్తుత గెలుపుతోనైనా పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయని భావిస్తున్నట్లు తెలిపాడు.
'మాకు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవడం చాలా అవసరం. మమ్ముల్ని హీరోలుగా గుర్తించాలంటే చాంపియన్స్ కావడం కచ్చితంగా ముఖ్యమే. ఇప్పుడు యావత్ పాకిస్తాన్ చాలా సంతోషంగా ఉంది. ఎంతోకాలంగా దేశంలో పర్యటించడానికి ఏ పెద్ద దేశం కూడా సాహసించడం లేదు. ఇటువంటి తరుణంలో ఒక ఐసీసీ టైటిల్ ను గెలిచి సత్తా చాటాం. వచ్చే సెప్టెంబర్ లో మూడు ట్వంటీ 20 గేమ్ల సిరీస్ లో భాగంగా వరల్డ్ ఎలివన్ జట్టు పాకిస్తాన్ కు రాబోతుంది. దాంతోనైనా పాక్ లో ఆడటానికి అన్ని జట్లు ఆసక్తిచూపుతాయని అనుకుంటున్నా'అని ఆర్థర్ పేర్కొన్నాడు.