న్యూఢిల్లీ:రాబోవు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ లో జరిగే మ్యాచ్‌ల సమయాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఈ టోర్నీ నిర‍్వహించే సమయంలో ఇప్పటివరకూ తొలి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకు నిర్వహించే వారు. అయితే ఇక నుంచి రెండో మ్యాచ్‌ను 7గంటలకు నిర్వహించాలనే యోచనలో ఐపీఎల్ నిర్వాహకులు ఉన్నారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ ముగిసే సరికి అర్ధరాత్రి దాటుతున్న కారణం చేత దాన్ని ఒక గంట ముందుకు తీసుకురావాలని ఆలోచన ఉంది. అంతేకాదు ఇంటి దగ్గర ఉండి చూసే ప్రేక్షకులు సైతం పూర్తిగా మ్యాచ్‌లను వీక్షించలేకపోతున్నారు.
వీటిని దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు వచ్చే ఏడాది నుంచి రెండో మ్యాచ్‌ను సాయంత్రం 7గంటలకే ప్రారంభించాలన్న ప్రతిపాదనను ఫ్రాంఛైజీల ముందుంచారు. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకారం తెలపడంతో దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్టార్ ఇండియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు.'డిసెంబరు 5న ఢిల్లీలో స్టార్ ఇండియా ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని వారి ముందు ఉంచుతా. రెండో మ్యాచ్ సాయంత్రం 7గంటలకే నిర్వహిస్తాం' అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. అయితే రెండో మ్యాచ్ రాత్రి 7 గంటలకు నిర్వహిస్తే, తొలి మ్యాచ్ ను గంట ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment