టైటిల్ లక్ష్యంగా బరిలోకి...
క్వాంటాన్ (మలేసియా): రెండేళ్ల విరామం తర్వాత మరోసారి జరుగుతున్న ఆసియా చాంపియన్‌స ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. నేటి నుంచి ఈనెల 30 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నారుు. భారత్‌తోపాటు పాకిస్తాన్, చైనా, జపాన్, మలేసియా, దక్షిణ కొరియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారుు. గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడనుంది.
డిఫెండింగ్ చాంపియన్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఈనెల 23న తలపడుతుంది. ఆరు జట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటారుు. 2011లో తొలిసారి జరిగిన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలువగా... 2012, 2013లలో పాకిస్తాన్ టైటిల్ సాధించింది. గోల్‌కీపర్ శ్రీజేష్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టులో గాయాల కారణంగా మన్‌ప్రీత్ సింగ్, ఎస్‌వీ సునీల్, రఘునాథ్ తదితర కీలక ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు.