విజేందర్ ఇక సర్దుకో..
న్యూఢిల్లీ:వచ్చే నెల్లో డబ్యూబీవో పసిఫిక్ ఆసియా మిడిల్ వెయిట్ చాంపియన్షిప్ను కాపాడుకోవడానికి సిద్ధమవుతున్న భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఇక మూటముళ్లూ సర్దుకోవాల్సిందేనని అంటున్నాడు అతని ప్రత్యర్థి ఫ్రాన్సిస్ చెకా. ఇప్పటివరకూ పెద్దగా అనుభవం లేని వాళ్ల దగ్గరే విజేందర్ ఆటలు సాగాయని, తన వద్ద అతని బాక్సింగ్ పంచ్ పనిచేయదని హెచ్చరించాడు.
'ఆ బాక్సింగ్ బాలుడికి పాఠాలు నేర్పేందుకు సిద్ధమయ్యా. త్వరలోనే భారత్ కు వస్తా.. విజేందర్ పని పడతా. ఆ భారత బాక్సర్ గురించి చాలా విన్నా. అతన్ని చాలా ఎత్తులో చూస్తున్నారు. ఆ స్థానం నుంచి అతన్ని వెనక్కు నెట్టడానికి నా ఒక పంచ్ చాలు'అని చెకా ఘాటుగా వ్యాఖ్యానించాడు. విజేందర్ మాంచెస్టర్, యూకేలో శిక్షణ తీసుకున్న సంగతి తనకు తెలుసని, అతని సొంత దేశంలో ఓడించి తన పవర్ చూపిస్తానన్నాడు. ఈసారి ఆ టైటిల్ విజేందర్ దూరం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. తన ట్రాక్ రికార్డును ఒకసారి చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నాడు. ఇప్పటివరకూ తాను 32 విజయాలు సాధిస్తే, అందులో 17 నాకౌట్ విజయాలున్నాయన్నాడు. విజేందర్ పని ముగించడానికి తనకు ఒక రౌండ్ చాలంటూ అమితమైన విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ విజేందర్ ఆడిన బౌట్లలో అతని తిరుగులేని విజేత కావొచ్చు కానీ ఒకసారి రింగ్ లో కి వచ్చానంటే అతను తిరిగి సమాధానం చెప్పడానికి కూడా ఏమీ ఉండదంటూ ఈ మాజీ చాంపియన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.వచ్చే నెల17వ తేదీన ఇరువురి మధ్య పోరు జరుగునుంది.
ఈ ఏడాది జూలైలో త్యాగరాజ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ పోరులో విజేందర్ తొలిసారి విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ను ఓడించి టైటిల్ ను సాధించాడు. ఇప్పటివరకూ ఏడు ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్లలో పాల్గొన్న విజేందర్ అన్నింటా విజయం సాధించాడు. అందులో ఆరు గేమ్లను నాకౌట్గా ముగించాడు.