చెన్నై: వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తమ కసరత్తులను ముమ్మరం చేసింది. ఐపీఎల్-2019 కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. తమ జట్టులోని 22 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. కాగా, ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేస్తున్నట్టు సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది. 2018 ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ఒక్క మ్యాచ్‌లో ప్రాతినిథ్యం వహించిన ఇంగ్లిష్ క్రికెటర్ మార్క్ వుడ్‌తో సహా గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్షితిజ్ శర్మ, కనిష్క్ సేత్‌లను సైతం జట్టు నుంచి విడుదల చేసింది.
గత సీజన్‌లో గాయపడ్డ కేదార్ జాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన డేవిడ్ విల్లేకు ఫ్రాంచైజీ మరో అవకాశమిచ్చింది. వచ్చే సీజన్ సైతం ఎంఎస్ ధోని కెప్టెన్సీలోనే చెన్నై ముందుకు సాగనుంది. గాయంతో సీజన్‌కు దూరమైన ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను, అతని స్థానంలో తీసుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లేను కూడా రిటైన్ చేసుకుంది. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన వుడ్ వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్ 12 కోసం డిసెంబర్ నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. కాంట్రాక్ట్ పూర్తయిన ఆటగాళ్లతో పాటు నిరాశ పరిచిన వారిని ఫ్రాంచైజీలు వదులుకుంటున్నాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment