ఐపీఎల్‌లో మరో అద్భుతం... పరుగుల వరద పారిన పోరులో ఆఖరి వరకు ఉత్కంఠ... అసాధ్యంగా కనిపించిన లక్ష్యాన్ని అసాధారణ ఆటతో ఛేదించి రాయుడు, ధోని చిన్నస్వామి మైదానానికి విజయంతో పసుపు రంగు పూత పూశారు. సిక్సర్ల సునామీ సాగిన మ్యాచ్‌లో చివరకు కోహ్లిపై ‘మిస్టర్ కూల్’దే పైచేయి అయింది. డివిలియర్స్ సిక్సర్ల సునామీతో 205 పరుగులు చేసిన బెంగళూరు బౌలింగ్ వైఫల్యంతో దానిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. రాయుడు, ధోని కూడా పోటీ పడి సిక్సర్లు బాదడంతో భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా... బ్రేవో ఫోర్, సిక్సర్‌తో మొదలుపెట్టగా, తనదైన శైలిలో ధోని భారీ సిక్సర్‌తో ముగించాడు.
బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఆటతో మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (30 బంతుల్లో 68; 2 ఫోర్లు, 8 సిక్సర్లు), క్వింటన్ డి కాక్ (37 బంతుల్లో 53; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 53 బంతుల్లో 103 పరుగులు జోడించడం విశేషం. బ్రేవో, తాహిర్, ఠాకూర్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. అంబటి రాయుడు (53 బంతుల్లో 82; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చెలరేగగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ధోని (34 బంతుల్లో 70 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 54 బంతుల్లో 101 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు.
సెంచరీ భాగస్వామ్యం...
ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి (15 బంతుల్లో 18; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లతో శుభారంభం అందించాడు. మరో ఎండ్‌లో డి కాక్ కూడా సిక్సర్లతో దూకుడు ప్రదర్శించడంతో బెంగళూరు స్కోరు వేగంగా దూసుకుపోయింది. అయితే శార్దూల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి వెనుదిరగడంతో ఆర్‌సీబీ తొలి వికెట్ కోల్పోయింది. అయితే డివిలియర్స్ రాక ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేసింది. హర్భజన్ ఓవర్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్‌తో జూలు విదిల్చాడు. అనంతరం తాహిర్ ఓవర్లోనూ ఇదే పునరావృతమైంది. ఈ ఓవర్లోనూ డివిలియర్స్ ఒక ఫోర్, 2 భారీ సిక్సర్లు బాదడంతో 10.4 ఓవర్లలోనే స్కోరు వంద పరుగులు దాటింది. ఇందులో చివరి సిక్సర్ స్టేడియం బయట పడటం విశేషం! ఏబీ స్ఫూర్తితో చెలరేగిన డి కాక్ కూడా వాట్సన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఠాకూర్ వేసిన తర్వాతి ఓవర్లో ఏబీ వరుసగా మూడు బంతుల్లో 6, 6, 6తో చెలరేగి తన విధ్వంసాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు బ్రేవో రిటర్న్ క్యాచ్‌తో డి కాక్‌ను అవుట్ చేయ డంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. తాహిర్ తన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో డివిలియర్స్, అండర్సన్ (2)లను అవుట్ చేసి బెంగళూరు జోరుకు బ్రేక్ వేశాడు.
మెరుపు బ్యాటింగ్..: భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై... నేగి వేసిన తొలి ఓవర్లోనే వాట్సన్ (7) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో రాయుడు తన ఫామ్ కొనసాగించాడు. సుందర్ బౌలింగ్‌లో అతను వరుసగా రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. సిరాజ్ తొలి ఓవర్లో చెన్నై మూడు ఫోర్లు సహా 15 పరుగులు రాబట్టింది. అయితే రైనా (11)ను అవుట్ చేసి ఉమేశ్ బెంగళూరు శిబిరంలో ఆనందం నింపాడు. అనంతరం చహల్ తన వరుస ఓవర్లలో బిల్లింగ్స్ (9), జడేజా (3)లను డగౌట్ పంపించడంతో చెన్నై తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో రాయుడు, ధోని కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీరిద్దరు పోటీ పడి సిక్సర్లతో చెలరేగారు. 40 బంతుల్లో రాయుడు అర్ధసెంచరీ పూర్తయింది. అండర్సన్ ఓవర్లో ఉమేశ్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రాయుడు అదే ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఈ జోడి చెన్నైని విజయం దిశగా తీసుకు వెళుతున్న దశలో రాయుడును రనౌట్ చేసి బెంగళూరు మ్యాచ్‌పై ఆశలు పెంచుకుంది. అయితే బ్రేవో (7 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి ధోని ఆ అవకాశం ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment