చెన్నైయిన్ చమక్
చెన్నై: సొంత మైదానంలో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు దుమ్ము రేపింది. ప్రత్యర్థి కోలుకునేందుకు కూడా సమయమివ్వకుండా గోల్స్ వర్షం కురిపించింది. దీనికి తోడు ఇటలీ స్టార్ మెటరాజ్జీ రంగ ప్రవేశంతో దూకుడు మీద కనిపించిన చెన్నైయిన్ మంగళవారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ముంబై సిటీ ఎఫ్‌సీని 5-1 తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఎలనో (9, 69వ నిమిషాలు), జేజే (26వ ని.), వాలెన్సియా (41, 44వ ని.) గోల్స్ సాధించారు. ముంబై నుంచి నబీ (87వ ని.) ఏకైక గోల్ సాధించాడు.
అటు స్టార్ స్టయికర్ నికోలస్ అనెల్కా అరంగేట్రం చేసినప్పటికీ ముంబై రాత మారలేదు. వారి డిఫెన్స్‌తో పాటు మిడ్ ఫీల్డ్‌లో లోపాలు.. గోల్ కీపర్ ఏమరుపాటు చెన్నైయిన్‌కి కలిసొచ్చింది. ఆరంభంలోనే వాలెన్సియాను ఫ్రెడెరిక్ (ముంబై) మొరటుగా అడ్డుకోవడంతో చెన్నైయిన్‌కి పెనాల్టీ కిక్ దక్కింది. దీన్ని ఎలనో తొమ్మిదో నిమిషంలో గోల్‌గా మలిచాడు. 26వ నిమిషంలో మిడ్‌ఫీల్డ్ నుంచి ఎలనో అందించిన పాస్‌ను జేజే గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ చేసిన గోల్‌తో జట్టు స్కోరు 2-0కి పెరిగింది.
41వ నిమిషంలో ఎలనో ఫ్రీ కిక్‌ను సరిగా అందుకోలేని గోల్ కీపర్ సుబ్రతా పాల్ వదిలేయగా అక్కడే ఉన్న వాలెన్సియా బంతిని నెట్‌లోకి తన్ని ముంబైని షాక్‌కు గురి చేశాడు. మరో మూడు నిమిషాల్లోనే బంతిని అందుకునేందుకు మరీ ముందుకు వచ్చిన కీపర్ పాల్‌ను ఏమారుస్తూ వాలెన్సియా బంతిని గోల్ పోస్టులోకి పంపడంతో చెన్నైయిన్ సంబరాలు మిన్నంటాయి.
ద్వితీయార్ధంలోనూ వీరి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 69వ నిమిషంలో ఎలనో సంధించిన ఫ్రీ కిక్ నేరుగా గోల్ పోస్టు కుడివైపు నుంచి లోనికి దూసుకె ళ్లడంతో జట్టు ఆధిక్యం 5-0కి పెరిగింది. ఐఎస్‌ఎల్‌లో ఎలనోకిది ఐదో గోల్ కావడం విశేషం. 87వ నిమిషంలో నబీ హెడర్ గోల్‌తో ముంబై ఖాతా తెరిచింది. చెన్నైయిన్ జట్టు సహ యజమాని ధోని ఈ మ్యాచ్‌కు వచ్చాడు.