Sakshi News home page

IPL 2024 RCB VS KKR: సెంటిమెంట్‌ కొనసాగేనా..!

Published Fri, Mar 29 2024 11:44 AM

First 9 Games In IPL 2024 Won By Home Teams - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 29) మరో క్లాసీ మ్యాచ్‌ జరుగనుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.

రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడే అవకాశం ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉంటే.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్‌ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది.

ఇవాల్టి మ్యాచ్‌కు ముందు ఓ సెంటిమెంట్‌ అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లో హోం గ్రౌండ్‌లో ఆడిన జట్లే విజయాలు సాధించాయి. 

  • చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే (ఆర్సీబీపై విజయం),
  • చంఢీఘడ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై), 
  • కోల్‌కతాలో జరిగిన మూడో మ్యాచ్‌లో కేకేఆర్‌ (సన్‌రైజర్స్‌పై),
  • జైపూర్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్‌ (లక్నోపై), 
  • అహ్మదాబాద్‌లో ముంబైపై గుజరాత్‌,
  • బెంగళూరులో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ,
  • చెన్నైలో గుజరాత్‌పై సీఎస్‌కే,
  • హైదరాబాద్‌లో  ముంబైపై సన్‌రైజర్స్‌,
  • జైపూర్‌లో నిన్న జరిగిన తొమ్మిదో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ విజయాలు సాధించాయి.

ఈ నేపథ్యంలో ఆర్సీబీ హోం గ్రౌండ్‌లో విజయం సాధించి సెంటిమెంట్‌ కొనసాగిస్తుందా.. లేక కేకేఆర్‌కు దాసోహమై సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. 

గత రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీ, కేకేఆర్‌ మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగగా కేకేఆర్‌ 18, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.

బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు బ్యాటింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్నప్పటికీ.. కేకేఆర్‌కు బ్యాటింగ్‌ డెప్త్‌ కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఆ జట్టులో ఎనిమిదో నంబర్‌ వరకు బ్యాటింగ్‌ చేసే వాళ్లు ఉన్నారు. ఆర్సీబీ విషయానికొస్తే పరిస్థితి అలా లేదు. విరాట్‌, డుప్లెసిస్‌, మ్యాక్సీ ఔటైతే ఆ జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది.

బౌలింగ్‌లోనూ ఆర్సీబీతో పోలిస్తే కేకేఆర్‌ మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఐపీఎల్‌ కాస్ట్‌లీ ప్లేయర్‌ మిచెల్‌ స్టార్క్‌ నాయకత్వంలో కేకేఆర్‌ బౌలింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తుంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా ఇరగదీశాడు. రసెల్‌ బ్యాట్‌తో పాటు బంతితోనూ చెలరేగాడు. నరైన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.

స్టార్క్‌, వరుణ్‌ చక్రవర్తి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ పరిస్థితి రిపీట్‌ కాదని అనిపిస్తుంది. ఆర్సీబీ విషయానికొస్తే.. ముందుగా ఈ జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్‌ లేడు. కేవలం బ్యాటింగ్‌పైనే ఆ జట్టు ఆధార పడింది. సిరాజ్‌, అల్జరీ జోసఫ్‌, యశ్‌ దయాల్‌, గ్రీన్‌ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి గొప్ప ప్రదర్శనలు ఆశించలేని పరిస్థితి ఉంది. స్పిన్నర్లు కర్ణ్‌ శర్మ, మయాంక్‌ డాగర్‌, మ్యాక్సీ అడపాదడపా రాణిస్తుంటారు. మొత్తంగా చూస్తే.. ఆర్సీబీ కంటే కేకేఆర్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement