IPL 2024: కొనసాగుతున్న సెంటిమెంట్‌.. వరుసగా 8 మ్యాచ్‌ల్లో..! | IPL 2024: Till Match 8, Here's The List Of All The Matches Won By Home Team, See Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024: కొనసాగుతున్న సెంటిమెంట్‌.. వరుసగా 8 మ్యాచ్‌ల్లో..!

Published Thu, Mar 28 2024 9:26 AM | Last Updated on Thu, Mar 28 2024 10:18 AM

IPL 2024: Till Match 8, All The Matches Won By Home Team - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో సొంత మైదానాల్లో ఫ్రాంచైజీల గెలుపు సెంటిమెంట్‌ కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో హోం టీమ్‌లే విజయాలు సాధించాయి. తాజాగా సన్‌రైజర్స్‌ తమ సొంత మైదానమైన ఉప్పల్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై తిరుగులేని విజయం సాధించి సెంటిమెంట్‌ను కొనసాగించింది. ఐపీఎల్‌లో ఎన్నడూ లేనట్లుగా హోం గ్రౌండ్స్‌లో ఫ్రాంచైజీల హవా కొనసాగుతుంది. 

  • చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే (ఆర్సీబీపై విజయం),
  • చంఢీఘడ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై), 
  • కోల్‌కతాలో జరిగిన మూడో మ్యాచ్‌లో కేకేఆర్‌ (సన్‌రైజర్స్‌పై),
  • జైపూర్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్‌ (లక్నోపై), 
  • అహ్మదాబాద్‌లో ముంబైపై గుజరాత్‌,
  • బెంగళూరులో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ,
  • చెన్నైలో గుజరాత్‌పై సీఎస్‌కే,
  • హైదరాబాద్‌లో జరిగిన ఎనిమిదో మ్యాచ్‌లో ముంబైపై సన్‌రైజర్స్‌ విజయాలు సాధించాయి.

ఇదే సెంటిమెంట్‌ మున్ముందు కొనసాగితే విజేతలను ముందుగానే పసిగట్టవచ్చు. బెట్టింగ్‌ రాయుళ్లకు ఈ సెంటిమెంట్‌ కాసులు వర్షం కురిపిస్తుంది. జైపూర్‌లో ఇవాళ (మార్చి 28) రాజస్థాన్‌.. ఢిల్లీతో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఫలితం ఆసక్తి రేపుతుంది. హోం గ్రౌండ్‌ సెంటిమెంట్‌ నమ్ముకుని మెజార్టీ   శాతం రాజస్థానే గెలుస్తుందని ప్రెడిక్ట్‌ చేస్తున్నారు. ఢిల్లీతో పోలిస్తే రాజస్థాన్‌ టీమ్‌ పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలుపు ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య సన్‌రైజర్స్‌ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. ట్రవిస్‌ హెడ్‌ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (34 బంతుల్లో 80 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), మార్క్రమ్‌ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 42 నాటౌట్‌) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 

భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు ధీటుగా బదులిచ్చిన ముంబై ఇండియన్స్‌.. ఓ దశలో గెలుపు దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే లక్ష్యం అతి భారీది కావడంతో ఎంఐ టీమ్‌ ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన ముంబై లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు), నమన్‌ ధిర్‌ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్‌రైజర్స్‌కు దడ పుట్టించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement