'కోపా' కప్ విజేత చిలీ
శాండియాగో: 99 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ- 2015లో చిలీ విజేతగా నిలిచింది. శాండియాగోలో ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్స్లో ఆతిథ్య చిలీ.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 4-1 తేడాతో మట్టికరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇరుజట్లూ నిర్ణీత సమయానికి గోల్ సాధించకపోవడంతో ఎక్స్ట్రా టైమ్ ఆడాల్సి వచ్చింది. అదికూడా డ్రాగా ముగియడంతో షూట్ అవుటే శరణ్యమైంది.
చిలీ గోల్ కీపర్ క్లౌడియో బ్రావో సమయ స్పూర్తితో ఒక గోల్ తప్పించడం, అర్జెంటీనా ఆటగాళ్లుకూడా బంతిని గోల్ పోస్టులోకి పంపడంలో రెండు దఫాలు విఫలం కావడంతో 4-1 తేడాతో చిలీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఫైనల్స్ లో దురదృష్టం మెస్సీ సేన వెన్నంటే ఉంటుందని రుజువైంది. గత ఏడాది ఫిఫా వరల్డ్ కప్ లోనూ ఫైనల్స్ వరకు వెళ్లిన మెస్సీ సేన జర్మనీ చేతిలో 1-0 తేడాతో పరాజయంపాలైన సంగతి తెలిసిందే.